పురుషుల కోసం కొత్త తరహా గర్భ నిరోధక ఇంజక్షన్ ప్రవేశపెట్టారు. దీని సహాయంతో 99 శాతం గర్భాన్ని నివారించవచ్చు.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) ఏడేళ్ల ఇంటెన్సివ్ రీసెర్చి తర్వాత ఈ ఇంజక్షన్ ను ఆమోదించారు.
దీన్ని తీసుకోవడం చాలా సులభమని, సక్సెస్ రేట్ కూడా అధికంగా ఉందని తెలిపింది. దీనికి సంబంధించి ఐసీఎంఆర్ తన నివేదికను విడుదల చేసింది.
303 మంది పెళ్లయినవారు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారిపై ఐసీఎంఆర్ తన అధ్యయనాన్ని నిర్వహించింది.
ఈ పరిశోధనలో వారికి రివర్సిబుల్ ఇన్షిబిషన్ ఆఫ్ స్పెర్మ్ ఇంజక్షన్ risug ఇచ్చారు.
ఇది నాన్ హార్మోనల్ ఇంజెక్ట్ చేయదగిన గర్భనిరోధకంగా పనిచేస్తుందని, అంతేకాకుండా అవాంఛిత గర్భధారణను నివారిస్తుందని తేలింది.
సాధారణంగా పురుషులు గర్భ నిరోధకం కోసం వాసెక్టమీ లేదంటే కండోమ్స్ వాడుతుంటారు. అయితే icmr కొత్త పద్ధతిని అభివృద్ధి చేసింది.
పురుషులకు ఇంజక్షన్ చేయడంద్వారా మహిళలు గర్భం దాల్చకుండా ఉండేలా దీన్ని రూపొందించారు. ఒకసారి దీన్ని ఇస్తే 13 సంవత్సరాల వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది.
అంటే 13 సంవత్సరాల వరకు గర్భం రాకుండా నిరోధించవచ్చు. దీంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని, సురక్షితమైందని icmr వెల్లడించింది.
అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో గర్భం రాకుండా ఉండేందుకు మహిళలు 70 శాతం మాత్రలు, ఇంజక్షన్లు వాడుతున్నారు. 22 శాతం మంది ట్యబెక్టమీ చేయించుకుంటున్నారు.
ఇండియాలో అయితే 50 శాతం మంది గర్భనిరోధక మందులు, ఇంజక్షన్లు వాడుతుండగా, అధిక శాతం పురుషులు నిరోధ్ వాడేలా ప్రోత్సహిస్తున్నారు.
ఏ నిరోధక సాధనాలను వాడని స్త్రీ, పురుషులు కూడా భారత్ లో గణనీయంగా ఉన్నారు. అలాంటివారికి ఈ ఇంజక్షన్ ఎంతో ఉపకరిస్తుందని వైద్యులు చెబుతున్నారు.