చలికాలం వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరినీ చర్మ సంబంధింత సమస్యలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటి వాటిల్లో పాదాల పగుళ్లు ఒకటి. ఈ సమస్య చాలా మందిలో తీవ్రంగా ఉంటుంది.
పగుళ్లు చూడటానికి బాగుండకపోవడం ఒకెత్తయితే.. కొందరికి నడుస్తుంటే నొప్పిగా. ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు.. నలుగురిలోకి వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
పాదాల పగుళ్లకి ముఖ్య కారణం.. పాదాలపై మురికి చేరడంతోపాటు పొడి బారడమే. కాబట్టి.. రోజూ పాదాలను శుభ్రంగా కడిగి, మృదువైన వస్త్రంతో తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి.
ఓ టబ్‌లో పాదాలు మునిగేంత వరకు గోరు వెచ్చని నీళ్లు నింపి, రెండు చెంచాల తేనె వేసి, పాదాలను అందులో ఉంచాలి. పది నిమిషాల తర్వాత పగిలిన ప్రాంతాన్ని మృదువుగా రుద్దాలి. ఇది మయిశ్చరైజర్‌ల పని చేసి చూపును దూరం చేస్తుంది.
అరటిపండును గుజ్జులా చేసుకొని.. పాదాలపై పగుళ్లు ఉన్న చోట రాసినా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా.. నువ్వుల నూనెలో కాస్త గ్లిజరిన్ కలిపి పాదాలకు మసాజ్ చేయాలి. ఇలా నిత్యం చేయడం ద్వారా మీ పాదాలు కోమలంగా తయారవుతాయి.
కొబ్బరి నూనెలో హారతి కర్పూరం, పసుపు కలిపి పాదాలకు అప్లై చేసినా బెటర్ రిజల్ట్ కనిపిస్తుంది. తరచూ ఇలా చేయడం ద్వారా పాదాలు పగుళ్లు తగ్గడమే కాకుండా చాలా మృదువుగా మారతాయి.
పెరుగు, వెనిగర్ మిశ్రమంతో పాదాలకు, మడమలకు తరచూ మసాజ్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా హ్యాండ్ క్రీమ్, నిమ్మరసం కలిపి పాదాలకు రాసినా పగుళ్లు తగ్గుతాయి.
రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు మర్దన చేసినా కూడా పగుళ్లు ఈజీగా తగ్గిపోతాయి. ఇలా పైన ఉండే చిట్కాల్లో ఏదో ఒక క్రమం తప్పకుండా పాటిస్తే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితం మీకు కనిపిస్తుంది.