ఇటీవలి కాలంలో బ్యూటీ పార్లర్లకు ఆదరణ పెరిగింది. తమ సౌందర్యాన్ని మెరుగుపర్చుకునేందుకు మహిళలు రకరకాల పద్ధతులను అనుకరిస్తున్నారు.

ఇందులో హెడ్‌ మసాజ్‌ ఒకటి కాగా…దీనివల్ల ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో నరాలపై ఒత్తిడి పెరిగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయే ప్రమాదం ఉందని ఇది చాలా అరుదే అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాల్సిందేనని  సూచిస్తున్నారు వైద్యులు.

హెడ్‌ మసాజ్‌లో బ్యూటీపార్లర్‌ నిర్వాహకులు కేవలం తల వరకే స్నానం చేయిస్తారు.

ఈ ప్రక్రియలో ఓ బేసిన్‌పై తలను ఉంచి సువాసనలు వెదజల్లే రకరకాల షాంపూలతో కురులను శుభ్రపరుస్తారు.

ఈ సందర్భంలో మెడపై విపరీతమైన ఒత్తిడి ఉండగా.. మసాజ్‌ చేయడం వల్ల మెదడుకు, వెన్నుముకకు రక్తప్రసరణ సరిగా జరగక దుష్పరిణామాలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా ప్రతి మనిషిలో చిన్నమెదడుకు రక్త ప్రసరణ జరిపేందుకు రెండు రక్తనాళాలు ఉంటాయని..అయితే కొందరిలో పుట్టుక నుంచే ఒకే రక్తనాళం ఉంటుంది

హెడ్‌ మసాజ్‌ సందర్భంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తనాళాల సమస్య ఉన్నవారిలోనూ స్ట్రోక్‌ సిండ్రోమ్‌ సమస్య ఉత్పన్నమవుతుంది.

హెడ్‌ మసాజ్‌ వల్ల బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుందని పూర్తి స్థాయిలో ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. స్ట్రోక్‌ సంకేతాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

ముఖ్యంగా వృద్ధులు, పిల్లలకు మసాజ్‌ చేసేటప్పుడు రక్తనాళాలపై ఒత్తిడి తెచ్చేలా మసాజ్‌ చేయకూడదు. సున్నితంగా మసాజ్‌ చేయించుకోవాలి.

అంతర్లీనంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మసాజ్‌ చేయించుకోవడానికి ముందు ఒకసారి ఆరోగ్య నిపుణుడి సలహాలు తీసుకోవడం మంచిది.