ముఖం అందంగా కనిపించడానికి, ఆకర్షణీయంగా మెరిసిపోవడానికి, అమ్మాయిలు రకరకాల క్రీమ్‌లు వాడుతూ ఉంటారు, పేస్ ప్యాక్స్‌లు వేసుకుంటారు. కానీ మెడ విషయానికి వచ్చేసరికి చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీంతో ముఖం మెరిసిపోతుంది, మెడ నల్లగా కళా విహీనంగా మిగిలిపోతుంది..
ముఖం కనపడినవారికి మెడ కనపడకుండా ఉండదు.. కానీ ఈ విషయంలో చేసే చిన్న అశ్రద్ద సరిగ్గా అద్దంలో చూసుకున్నప్పుడు బయటపడి బాధ పెట్టేస్తుంది. నిజానికి మన అశ్రద్దతో పాటూ , ఎండలు, కాలుష్యం, హార్మోన్ల మార్పుల కారణంగా మెడ నల్లగా మారుతుంది.
ఊబకాయం, ఇన్సులిన్ నిరోధకత కూడా మెడను నల్లగా మారే అవకాశం ఉంది. అయితే మెడ నలుపును దూరం చేసి... కాంతివంతంగా మార్చడానికి కొన్ని న్యాచురల్ ప్యాక్స్ సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.
శరీరంపై నాలుపుని పోగొట్టుకోవడానికి సహాయపడే వారిలో ముందు చెప్పుకోదగ్గది నిమ్మకాయ. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి.
నిమ్మరసానికి సమాన పరిమాణంలో.. రోజ్ వాటర్ మిక్స్ చేసి మెడకు అప్లై చేయండి. దీన్ని 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి.
నిమ్మ రసంలో తేనె గానీ, పెరుగు గానీ మిక్స్ చేసి కూడా నెక్ ప్యాక్ వేసుకోవచ్చు. కానీ ఏది చేసినా 15 నుంచి 20 నిమిషాల తరువాత శుభ్రంగా కడిగేయాలి. అలాగే శనగపిండి చర్మాన్ని కాంతివంతం చేయడానికి సహాయపడుతుంది, చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
రెండు స్పూన్ల శనగ పిండి తీసుకుని, కొద్దిగా పసుపు కలపండి. దీనిలో పెరుగు కలిపి పేస్ట్‌లా మిక్స్ చేయండి. ఈ పేస్ట్‌ను మెడకు అప్లై చేసి. 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.
పెరుగుకు బదులు రోజ్ వాటర్ వాడినా మంచిదే. టమాటో లో కూడా శరీరం మీద మురికిని పోగొట్టే స్వభావం ఉంది. బాగా పండిన టొమాటోను మిక్సీచేసి పేస్టుగా మార్చాలి. ఈ గుజ్జులో చెంచా తేనె కలపాలి. దీన్ని మెడకు అప్లై చేసి.. సున్నితంగా మర్దనా చేయాలి. బాగా ఆరిన తర్వాత కడిగేయాలి.
బంగాళాదుంప రసం చర్మంపై చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది చర్మపు మచ్చలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే బ్లీచింగ్ గుణాలు మీకు నేచురల్ గ్లోని ఇస్తాయి.
బంగాళాదుంపను కట్ చేసి మిక్సీ చేసి రసాన్ని తీయండి. ఈ రసాన్ని కాటన్ సహాయంతో నల్లని మెడపై రాయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు చర్మం రంగు మెరుగుపడుతుంది.