ములక్కాయలు, సొరకాయలు, బీరకాయలు, కాకరకాయల వంటివి పొడవుగా పెరుగుతాయి. కానీ వంకరగా అవ్వవు. అరటి పండ్లు మాత్రం వంకరగా ఉంటాయి. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? 

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అధిక బరువు తగ్గిస్తుంది. ఎనర్జీ ఇస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కానీ అరటిపండ్లు వంకరగా ఎందుకు ఉంటాయన్నది ఆసక్తికర అంశం. దాని వెనుక ఉన్న కారణాన్ని మనం అర్థం చేసుకుందాం.

అరటిపండ్లు చెట్లపై పెరుగుతాయని మనందరికీ తెలుసు. మొదట చెట్టుకి అరటి పువ్వు వస్తుంది. తర్వాత ఆ పువ్వుల రేకల కింద చిన్న అరటి పండ్ల వరుసలు పెరగడం ప్రారంభమవుతుంది.  ఇలా అరటి పండు పెరిగే సమయంలో.. నెగెటివ్ జియోట్రోపిజం అనే ప్రక్రియ జరుగుతుంది.

నెగెటివ్ జియోట్రోపిజం అంటే.. సాధారణంగా భూమి దేన్నైనా తనవైపు లాక్కుంటూ ఉంటుంది. దాన్నే మనం ఆకర్షణ అంటాం. అరటి పండ్లు ఈ గ్రావిటీకి లొంగవు. అవి భూమికి రివర్సులో.. ఆకాశంవైపు తిరుగుతాయి. సూర్యకాంతి ఎటు ఉంటే అటు పెరుగుతాయి.

సూర్యరశ్మిని గ్రహించేందుకు అరటిపండ్లు పైకి పెరిగేందుకు ప్రయత్నిస్తాయి. ఆ క్రమంలో అవి వంకర అవుతాయి. పండు పూర్తిగా తయారయ్యేసరికి.. కొంత వంకరగా ఉండటం మనం చూస్తాం.

అరటి చెట్ల ఆకులు పెద్దగా ఉంటాయి. వాటి కింద పెరిగే అరటి గెలకు సూర్యకాంతి అంత త్వరగా రాదు. ఆ కాంతి కోసం అరటికాయలు పైకి పెరుగుతాయి.

ఇండియాలో అరటి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు. ఇందులో ప్రతీదీ మనకు ఉపయోగపడుతుంది.

ఆకుల్లో భోజనం చేస్తాం. అరటిపండ్లను ఇష్టదైవానికి నైవేద్యంగా పెడతాం. అలాగే అరటి కాండాన్ని ఆవులకు ఆహారంగా పెడతారు.

అరటి కాండం మధ్యలో మొవ్వ ఉంటుంది. ఇది తెల్లగా, తియ్యగా ఉంటుంది. పల్లెల్లో ఈ మొవ్వను తింటారు. ఇది కూడా ఆరోగ్యానికి మంచిదే.

పొద్దు తిరుగుడు పువ్వు కూడా అరటి లాంటిదే. ఈ పువ్వులు సూర్యుడు ఎటు ఉంటే అటువైపు తిరుగుతూ ఉంటాయి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది.

అరటి, సన్ ఫ్లవర్ మాత్రమే కాదు.. ఈ భూమిపై చెట్లన్నీ ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నాయి. సూర్యకాంతి కోసం అవన్నీ ఆకాశంవైపే పెరుగుతాయి. భూమివైపు పెరగవు.