ఈ ప్రపంచంలో నిత్యం ఏదో మూల యుద్ధం రావణ కాష్టంలా రగులుతూనే ఉంటోంది. అలాంటి మరో కాష్టమే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. నేటితో ఈ సమరం ప్రారంభమై ఏడాది పూర్తయింది. 

 గడిచిన సంవత్సర కాలంలో ఈ యుద్ధం సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. రెండు దేశాల సైనికులతోపాటు వేలాది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్తులు ధ్వంసమైపోయాయి.

ప్రపంచానికే ఓ విపత్తులా పరిణమించిన ఈ యుద్ధం.. ఏడాది కాలంలో మిగిల్చిన చేదు జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది.

 రష్యా చేస్తున్న యుద్ధం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనుకున్నది ప్రపంచమంతా. కేవలం రోజుల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ను తుడిచిపెట్టేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.

కానీ లెక్కలు మారిపోయాయి. ఉక్రెయిన్ సేనలు ధీటుగా పోరాడడం ఒకెత్తయితే.. అమెరికా, దాని మిత్ర దేశాలు అందిస్తున్న సహకారం మరో ఎత్తు. ఆర్థిక సహకారంతోపాటు ఆయుధ సహకారాన్ని కూడా దండిగా అందిస్తున్నాయి.

యూఎన్‌ లెక్కల ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకు ఉక్రెయిన్‌ దేశంలో 7,199 మంది సాధారణ జనం మరణించారు. మరో 11,800 మంది క్షతగాత్రులయ్యారు.

దాదాపు 80 లక్షల మంది ఉక్రెయిన్ వాసులు కట్టుబట్టలతో ఉన్న ఊరిని వదిలి వెళ్లిపోయారు. వీరిలో కొందరు దేశమే దాటిపోతే.. మరికొందరు దేశంలోనే సేఫ్ జోన్ అనుకున్న ప్రాంతంలో తల దాచుకుంటున్నారు.

ఇక ఈ రెండు దేశాల యుద్ధం కేవలం వాటిమీదనే కాదు.. యావత్ ప్రపంచం మీదనే ప్రభావం చూపించడం మొదలు పెట్టింది.

ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న ఆర్థిక మాంద్యం భయానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధమే ప్రధాన కారణం అంటున్నారు ఆర్థిక నిపుణులు.

 ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఆ దేశానికి మరింత సాయం ప్రకటించారు. ఆయుధాలను కూడా అందిస్తామని చెప్పారు. అమెరికా తమకు అండగా ఉంటుందని భావిస్తున్నామని జెలెన్ స్కీ అన్నారు.

 ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితికి పాశ్చాత్య దేశాలే కారణమని చెప్పారు. ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మాత్రమే కాదని, ఏదో రకంగా అమెరికా, దాని మిత్ర దేశాలూ ఈ యుద్ధంలో పాల్గొంటున్నాయని అన్నారు.

ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అన్ని దేశాలు రష్యా, ఉక్రెయిన్‌ను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఇప్పట్లో ముగుస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఏం జరుగుతుందన్నది చూడాలి.