మైగ్రేన్ తలనొప్పి చాలా మందిని బాధించే ఒక సాధారణ సమస్య. ఇది ఒక రకమైన తీవ్రమైన తలనొప్పి, ఇది తరచుగా తలకి ఒకవైపు మాత్రమే వస్తుంది. మైగ్రేన్ నొప్పి కొన్ని గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది.

మైగ్రేన్ నొప్పి వెలుతురు, శబ్దాలు, వాసనలకు సున్నితత్వాన్ని కలిగిస్తుంది. వికారం, వాంతులు కూడా సాధారణ లక్షణాలు. మైగ్రేన్‌ ప్రధానంగా తలకి ఒకవైపు తీవ్రమైన నొప్పి వస్తుంది. 

మైగ్రేన్ నొప్పితో ఒక్కొసారి కళ్ళకు మసకపట్టడం లేదా వెలుగుల్ని చూడలేకపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వాంతులు లేదా వాంతి భావన కలుగుతుంది. శరీరానికి బలహీనతకు గురవుతుంది. 

శబ్దం, వెలుతురుకు విపరీతమైన సున్నితత్వం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది. మైగ్రేన్‌కు కొన్ని జన్యుపరమైన కారణాలు కూడా ఉంటాయి. కుటుంబంలో ఒకరికి మైగ్రేన్ ఉంటే, ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. 

సెరోటోనిన్ వంటి న్యూరోట్రాన్స్‌మిటర్లలో మార్పులు మైగ్రేన్‌కు కారణమవుతాయి. అంతే కాకుండా వాతావరణ మార్పులు, ఒత్తిడి, నిద్రలేమి, కొన్ని రకాల ఆహారాలు, పానీయాలు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. 

మహిళల్లో, ఋతు చక్రం, గర్భం , రుతువిరతి సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల మైగ్రేన్ రావచ్చు. మానసిక ఒత్తిడి మైగ్రేన్‌కు ఒక సాధారణ కారణం అవుతుంది. నిద్ర విధానాలలో మార్పులు మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. 

కొన్ని రకాల ఆహారాలు (చాక్లెట్, చీజ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు) , పానీయాలు (ఆల్కహాల్, కెఫిన్) మైగ్రేన్‌ను ప్రేరేపిస్తాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం లేదా అకస్మాత్తుగా ఆపేయడం వల్ల తలనొప్పి వస్తుంది. 

వాతావరణలో మార్పులు, తుఫానులు, బలమైన గాలులు కూడా మైగ్రేన్‌కు కారణం కావచ్చు. మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నప్పుడు ప్రశాంతమైన, చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి. నొప్పి ఉన్న చోట చల్లటి కాపడం పెట్టాలి. పుష్కలంగా నీరు త్రాగాలి. 

మైగ్రేన్‌ వచ్చిన నప్పుడు యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజు ఒకే సమయంలో నిద్రపోవడం, మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. 

మైగ్రేన్‌ను ప్రేరేపించే ఆహారాలు , పానీయాలను గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్), ట్రిప్టాన్స్ మరియు ఇతర మందులు ఉపయోగించవచ్చు.

తరచుగా తీవ్రమైన మైగ్రేన్ వస్తున్నా, నొప్పి మందులకు తగ్గకపోయినా, చూపులో ఆకస్మిక మార్పులు, మాటల్లో తడబాటు, బలహీనత వంటి లక్షణాలు ఉంటే డాక్టర్ ను సంప్రదిండం చాలా ముఖ్యం.