కడుపులో ఉండే పెద్ద పేగుకు తోకలా అనుసంధానమై ఉండేదే అపెండిక్స్. దీనివల్ల ఏర్పడే సమస్యనే అపెండిసైటిస్ అని కూడా పిలుస్తారు.
అపెండిక్స్‌లో పూడిక, బ్యాక్టీరియా కారణంగా అపెండిక్స్ లోపలి గోడలు వాచిపోవడం వల్ల ఏర్పడే సమస్యే అపెండిసైటిస్.
అపెండిసైటిస్ సమస్యలో నూటికి 50 శాతం ఇతర లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.
కడుపులో ఎక్కడైనా, వీపు భాగంలో నొప్పి తీవ్రంగా రావడం, మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, విసర్జన చేయలేకపోవడం, మలబద్ధకం, గ్యాస్, తిమ్మిర్లు వంటి సమస్యలు. వీటిలో ఏది కనిపించినా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించాలి.
ప్రారంభంలో ఆకలి తగ్గడం, వికారం, వాంతులు, ఆరోగ్యం బాగాలేదన్న భావన కనిపిస్తాయి. తర్వాత దశలో బొడ్డు సమీపంలో లేదా పొట్ట పైభాగంలో నొప్పి కొద్దిగా మొదలవుతుంది. అక్కడి నుంచి పొట్ట కింది భాగంలోకి పాకి, మరింత తీవ్రతరం అవుతుంది.
నొప్పి ఎక్కడని అడిగితే మొదట్లో బొడ్డు చుట్టూ ఉన్నట్టు చెబుతారు కానీ, కచ్చితంగా ఫలానా చోట అన్న స్పష్టత ఉండదు. నొప్పి మొదలైన తర్వాత 24 గంటల వ్యవధిలో తార స్థాయికి చేరుతుంది. అందుకే 24 గంటల కడుపునొప్పిగానూ దీన్ని చెబుతారు.
అపెండిక్స్ వాపును తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ లేదా సీటీ స్కానింగ్ పరీక్షలు చేయించుకోవాలి.
అపెండిసైటిస్ ప్రారంభంలో తెల్లరక్త కణాలు సాధారణంగానే ఉంటాయి. కానీ, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వీటి సంఖ్య పెరిగిపోతుంది.
అపెండిసైటిస్ అన్నది వైద్యపరంగా సత్వరమే చికిత్స చేయాల్సిన సమస్య. అది కూడా దాదాపు చాలా కేసుల్లో సర్జరీ ద్వారా అపెండిక్స్‌ను తొలగిస్తుంటారు.
సత్వరమే శస్త్ర చికిత్స ద్వారా అపెండిక్స్ తొలగించకపోతే ప్రాణాంతకం అవుతుంది. సమస్య ఆరంభంలో గుర్తిస్తే సర్జరీ అవసరం లేకుండా యాంటీబయోటిక్స్ ద్వారా సమస్యను నివారించొచ్చని కొన్ని పరిశోధనలు తేల్చి చెప్పాయి.
అపెండిసైటిస్ సమస్య ఉందన్న అనుమానం ఉంటే ఫిజీషియన్ (ఎండీ)ను లేదా ఫ్యామిలీ డాక్టర్‌ను సంప్రదించాలి. అపెండిసైటిస్ ఉందని గుర్తిస్తే సంబంధిత నిపుణులకు సిఫారసు చేస్తారు.
అపెండిసైటిస్ రాకుండా నివారణ మార్గాలేవీ లేవు. కాకపోతే అధిక పీచు పదార్థాలను తినే వారిలో ఈ సమస్య తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు.