అలర్ట్ : మరో మూడు రోజులు భారీ వర్షాలు !

ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది ఐఎండీ. ఇవాళ, రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెల్పింది. వాయుగుండంపై బులెటిన్ విడుదల చేసింది ఐఎండీ. చెన్నైకి ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇవాళ ఉత్తర తమిళనాడు..దక్షిణ కోస్తా మధ్య చెన్నై-పుదుచ్చేరి దగ్గర తీరం దాటుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. వాయుగుండం ప్రభావంతో కడప, చిత్తూరు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ జారీ చేసింది.

ఈ రెండు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం వుంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. దేశంలోకి మే చివరి రోజుల నుంచి జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. క్రమంగా విస్తరించుకుంటూ దేశమంతటా వర్షాలు కురిపిస్తాయి.

అయితే తమిళనాడు తీరప్రాంతంలో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులోని తూర్పు ప్రాంతాలు, నెల్లూరు జిల్లా ప్రాంతాలపై ఈ రుతుపవనాల ప్రభావం ఉండదు. నైరుతి రుతుపవనాలు హిమాలయాలకు వెళ్లి వాటిని దాటలేక తిరిగి వెనక్కు వస్తాయి. అయితే వెళ్లిన దారిలో కాకుండా బంగాళాఖాతం మీదుగా పయనిస్తాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలు అనికూడా అంటారు. నవంబరు మాసంలో ఇవి బంగాళాఖాతానికి చేరుకుంటాయి. ఈ ప్రభావంతో అప్పుడప్పుడు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడుతాయి. దీంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఏటా ఇలాంటి వర్షపాతం నమోదు కాదు. గత మూడు, నాలుగేళ్లుగా అల్పపీడనాలు తోడు కావడంతో ఎక్కువ వర్షాలు కురుస్తున్నాయి.

Related Articles

Latest Articles