బిగ్ బ్రేకింగ్: టెస్ట్ కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై..!!

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం నాడు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఏడేళ్లుగా తాను టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించానని.. ప్రస్తుతం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ఏడేళ్లుగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని, తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు తెలిపాడు.

కెప్టెన్‌గా జట్టుకోసం సర్వశక్తులు ధారపోశానని… ఎంతో నిజాయతీగా వ్యవహరించానని కోహ్లీ తెలిపాడు. ప్రతి దానికి ఏదో ఒక దశలో ముగింపు అనేది ఉంటుందని… తన విషయంలోనూ అంతేనన్నాడు. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తన ప్రస్థానం ఇంతటితో ముగిసిందని అనుకుంటున్నట్లు కోహ్లీ తెలిపాడు. తన ప్రస్థానంలో ఒక్కసారి కూడా ప్రయత్నలోపం కానీ, నమ్మకం కోల్పోవడం కానీ జరగలేదన్నాడు. జట్టు కోసం ప్రతి సందర్భంలో 120 శాతం కష్టపడ్డానని… తాను ఏదైనా చేయలేకపోయుంటే, అది చేయదగ్గ పని కాదనే అర్థమన్నాడు. టెస్టు కెప్టెన్‌గా తాను వ్యవహరించిన విధానంపై తనకు ఎంతో స్పష్టత ఉందన్నాడు.

అటు తనలో కెప్టెన్‌ను గుర్తించి.. తనపై నమ్మకం ఉంచిన ధోనీకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాడు. రవిశాస్త్రితో పాటు టీమ్ మొత్తానికి థాంక్స్ చెప్పాడు. కాగా 2014 నుంచి 2022 వరకు 68 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లీ జట్టుకు 40 విజయాలు అందించగా… 17 మ్యాచ్‌లలో జట్టు ఓటమి పాలయ్యింది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 58.82 గెలుపు శాతంతో భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నీరాజనాలు అందుకున్నాడు.

కాగా భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ చేసిన ప్రకటనపై బీసీసీఐ స్పందించింది. కోహ్లీకి ధన్యవాదాలు తెలియజేసింది. అద్భుతమైన నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ఎన్నో శిఖరాలకు తీసుకెళ్లావని… 68 టెస్టుల్లో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచావని బీసీసీఐ కొనియాడింది.

Related Articles

Latest Articles