మూడో టెస్టుకు జట్టు కూర్పుపై కోహ్లీ క్లారిటీ

దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్‌టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్‌నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం చేశాడు.

Read Also: సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్.. నిరాశలో అభిమానులు

మరోవైపు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌తో తాము మాట్లాడామని.. పంత్ తన తప్పులు తెలుసుకుంటాడని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. కెరీర్‌లో ఎదుగుతున్న దశలో ప్రతి ఒక్కరూ తప్పుచేసిన వాళ్లమేనని… పంత్ కూడా తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటాడన్నారు. అటు సీనియర్లు పుజారా-రహానే జట్టుకు కీలకమని వ్యాఖ్యానించాడు. శతకాల నిరీక్షణ గురించి కూడా విరాట్ కోహ్లీ నోరువిప్పాడు. తన కెరీర్‌లో ఇలాంటి దశను ఎదుర్కోవడం ఇదేమీ కొత్త కాదన్నాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలోనూ తనకు చేదు అనుభవం ఎదురైందని… ఆటలో కొన్నిసార్లు తాము ఆశించినట్లు జరగదన్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు ఓ బ్యాట్స్‌మెన్‌గా తాను ఎన్ని భాగస్వామ్యాలు నెలకొల్పానన్నదే ముఖ్యమని విరాట్ కోహ్లీ వివరించాడు. కాగా విరాట్ కోహ్లీ చివరగా 2019లో సెంచరీ చేశాడు. 2020, 2021 సంవత్సరాల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు.

Related Articles

Latest Articles