వంద కోట్ల ఆఫర్ వద్దనుకున్న ‘విక్రాంత్ రోణ’ నిర్మాత!

క‌న్న‌డ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ‌’. ఈ త్రీ డీ సినిమాను నిర్మాతలు జాక్ మంజునాథ్‌, షాలిని మంజునాథ్‌, అలంకార్ పాండియ‌న్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాల్సిందిగా దిగ్గజ ఓటీటీ కంపెనీలు నిర్మాతలపై ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు వచ్చాయి. అందులో నిజం ఉందని జాక్ మంజునాథన్ తెలిపారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేస్తే ఏకంగా వంద కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారని, కానీ థియేటర్స్ లో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిన ఈ సినిమాను ఓటీటీకి ఇవ్వడం సబబు కాదని తిరస్కరించామని అన్నారు. ముందు అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 24న వరల్డ్ వైడ్ తమ చిత్రం’విక్రాంత్ రోణ’ను వివిధ భాషల్లో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

కిచ్చా సుదీప్‌, నిరూప్ భండారి, నీతా అశోక్‌, జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ గురించి ద‌ర్శ‌కుడు అనూప్ భండారి మాట్లాడుతూ ”థియేటర్స్ లో సినిమాను ఎంజాయ్ చేసేలా, ప్రేక్ష‌కుల‌కు అద్భుత‌మైన అనుభూతిని అందించ‌డానికి ‘విక్రాంత్ రోణ’ను తెరకెక్కించాం. త్రీ-డీ టెక్నాల‌జీతో రూపొందించిన ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌లోనే చూడాలి. ఈ మూవీ ద్వారా ప్ర‌పంచానికి స‌రికొత్త సూప‌ర్ హీరోను ప‌రిచ‌యం చేస్తున్నాం. పిల్ల‌ల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు విజువ‌ల్ ట్రీట్‌గా సినిమా అల‌రిస్తుంది” అని అన్నారు.

జీ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన ‘విక్రాంత్ రోణ’ మల్టీలింగ్వుల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌. 14 భాషల్లో 55 దేశాల్లో త్రీడీ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బి. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించిన ఈ చిత్రానికి విలియమ్ డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Related Articles

Latest Articles