టీఆర్ఎస్‌ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ప్రభుత్వానికి పట్టదా..?

సీఎం కేసీఆర్‌, తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… సోషల్‌ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆమె… వరుస ట్వీట్లతో ప్రభుత్వాన్ని ఎండగట్టారు.. ‘రాష్ట్రంలో రైతుల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చామని, రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని టీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా… రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మాత్రం కొనసాగుతున్నాయి. రైతులకు పంట రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’ అని మండిపడ్డారు. ‘2011–12 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో బ్యాంకులు తాము నిర్దేశించుకున్న లక్ష్యానికి మించి 115 శాతం పంట రుణాలు ఇచ్చాయి. ఆ ఏడాది రూ.10,233 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం కాగా… రూ. 11,787 కోట్లు ఇచ్చాయి. ఇక 2012–13లో ఏకంగా 121 శాతం, 2013–14లో 103 శాతం ఇచ్చాయి. అయితే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014–15లో పంట రుణాల లక్ష్యంలో 93 శాతమే ఇచ్చాయని ఆరోపించారు. అలా క్రమంగా రుణాల మంజూరు తగ్గిస్తూ వస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం రైతు బంధు ఇస్తున్నామన్న సాకుతో రైతులకు పెట్టుబడి కొరకు బ్యాంకు రుణాల మంజూరుకు ఎలాంటి సూచనలు చేయలేదు. దీంతో ఈ వానాకాలం సీజన్‌లో రైతులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాకపోవడంతో రైతులు గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, బ్యాంకుల తీరును ఎప్పటికప్పుడు సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన ప్రభుత్వం, వ్యవసాయశాఖ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం చూస్తుంటే రైతుల పట్ల తమకున్న వైఖరి అర్దమవుతుందని మండిపడ్డారు విజయశాంతి.. ఈ వానాకాలం పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.16 కోట్ల ఎకరాలు కాగా, 1.19 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో వరి 61.94 లక్షల ఎకరాల్లో సాగైంది. సాధారణం కంటే వరి ఏకంగా 182 శాతం సాగైంది. వాస్తవంగా వరి రైతులే ఎక్కువగా రుణాలు తీసుకుంటారన్న ఆమె.. అయితే, వరి సాగైనంత స్థాయిలో బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక పత్తి 46.42 లక్షల ఎకరాల్లో, కంది 7.64 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ పంట పెట్టుబడికి బ్యాంకులు ఇప్పటివరకు 43.45 శాతం మేరకే రుణాలు ఇచ్చాయంటే బ్యాంకుల తీరుకు ప్రభుత్వ వైఖరే కారణమని స్పష్టంగా అర్ధమవుతుందిని కామెంట్ చేశారు. 2018 ఎన్నికలప్పుడు లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ చేయకపోవడంతో…. ఉన్న అప్పు తీరక, కొత్త అప్పు ఇవ్వడానికి బ్యాంకులు ముందడుగు వేయడం లేదు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు నేడు తెలంగాణ రైతాంగం నిస్సహాయ పరిస్థితుల్లో ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్థుల వద్ద అప్పులు చేశారన్న విజయశాంతి.. ఒక అంచనా ప్రకారం రూ.5 వేల కోట్ల ప్రైవేట్‌ అప్పులు చేసినట్లు అంచనా ఉండగా… మరి ముఖ్యంగా రైతుబంధుకు కాని, బ్యాంకు రుణాలకు కాని నోచుకోని కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా ఉందన్నారు.. వీరికి ప్రైవేట్‌ రుణాలు తప్ప మరో ఆధారం లేదు. దీంతో పెట్టుబడి వ్యయం తలకు మించిన భారంగా మారి చేసిన అప్పులు తీర్చలేక ఉరికొయ్యల‌కు వేళాడుతున్నా వీరి చావులు ప్రభుత్వానికి కనబడుటలేదని.. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టింపులేనట్టుగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ సర్కార్‌కు రానున్న ఎన్నికల్లో యావత్ తెలంగాణ ప్రజానీకం తగిన బుద్ది చెబుతుంది అంటూ.. వరుస ట్వీట్లు చేశారు రాములమ్మ.

-Advertisement-టీఆర్ఎస్‌ సర్కార్‌పై రాములమ్మ ఫైర్.. ప్రభుత్వానికి పట్టదా..?

Related Articles

Latest Articles