మోహన్ లాల్ ను చూసి స్టన్ అయ్యాను: వెంకటేష్

విక్టరీ వెంకటేష్ హీరోగా, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ‘దృశ్యం 2’ చిత్రాన్ని ఆంటోని పెరంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. సూపర్ హిట్ థ్రిల్లర్ ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ చిత్రం నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో ముచ్చటించింది.

తొలుత వెంకటేశ్ మాట్లాడుతూ, ” ఇవాళ ‘దృశ్యం 2’ ట్రైలర్ లాంచ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ‘దృశ్యం’ తర్వాత అలాంటి సినిమా మరొకటి చేయాలని అనుకున్నాను. జీతూ ‘దృశ్యం-2’ తో నా వద్దకు వచ్చారు. అది మలయాళంలో చాలా పెద్ద హిట్. దాంతో వెంటనే అంగీకరించాను. పైగా ‘దృశ్యం 2’ చేసేటప్పుడు ఎలాంటికి ఒత్తిడికి గురికాలేదు. మలయాళంలో మోహన్‌లాల్, మీనా అద్భుతంగా చేశారు. తెలుగులో టీమ్ అంతా చాలా కష్టపడి.. చక్కగా చేశారు. సినిమా నేను చూశాను. చాలా బాగా వచ్చింది. ఇలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో రాలేదు. రాంబాబు క్యారెక్టర్ అందరికీ బాగా నచ్చుతుంది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ క్యారెక్టర్ తో, అతని ఫ్యామిలీతో జనం ముందుకు వస్తున్నాం. ఆ పాత్రల్లో ఇప్పటికీ ఓ కనిపించని భయం ఉంది. ఎప్పుడో జరిగిన ఓ హత్యకు సంబంధించి విచారణ ప్రారంభం కావడం… పోలీసుల ఎత్తుకు రాంబాబు పై ఎత్తులు వేయడం… చాలా థ్రిలింగ్‌గా ఉంటుంది సినిమా. నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ గెస్ చేయలేరు. చాలా ట్విస్ట్‌లు, మలుపులు ఉంటాయి. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. నా విషయానికి వస్తే…సెట్‌కు వెళ్లగానే రాంబాబు వచ్చేస్తాడు. ఆ క్యారెక్టర్‌లో బ్యూటీ అలాంటిది. ఒరిజినల్‌ క్యారెక్టర్ చేసిన మోహన‌లాల్‌ను చూసి స్టన్ అయ్యాను. చాలా సీన్స్ నా హృదయానికి దగ్గరగా ఉన్నాయి. కోవిడ్ కారణంగా ఒక్క చిన్న టౌన్‌లో ఉండి సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేశాం” అని చెప్పారు. జీతూ మాట్లాడుతూ.. ”దర్శకుడు రాజమౌళి నుంచి ఈ మూవీకి మాస్టర్ పీస్ అనే కాంప్లిమెంట్ రావడం నిజంగా నమ్మలేకపోయాను. నేను హైదరాబాద్‌లో నా ఫ్యామిలీతో ఉన్నప్పుడు రాజమౌళి నుంచి మెసేజ్ వచ్చింది. రాజమౌళి పేరు చెప్పకుండా నా భార్య, పిల్లలకు ఆ మెసేజ్ చదివి వినిపించాను. నా కూతురు ఎవరూ పంపారు? అని అడిగింది. నేను రాజమౌళి అని చెప్పాను. కానీ నేను ట్రిక్స్ ప్లే చేస్తున్నానని నవ్వింది. కానీ తర్వాత మెసేజ్ చూసి.. ఆశ్చర్యంతో జంప్ చేసింది. గొప్ప దర్శకుడి నుంచి అలాంటి మెసేజ్ రావడం.. ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. తర్వాత నేను వెంటనే దానిని ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశాను. నిజం చెప్పాలంటే.. తెలుగు వెర్షన్‌లో ఎలాంటి పెద్ద మార్పులు చేయలేదు. కల్చరల్‌గా కొన్ని మార్పులు చేశాం. ప్రజెంటేషన్‌లో కొంత మార్పు చేశాం. అంతే” అని అన్నారు.

మంచి ఫిల్మ్‌ ఎక్కువ కాలం హోల్డ్‌లో ఉంచకూడదని ‘దృశ్యం-2’ను అమెజాన్‌లో విడుదల చేస్తున్నామని, ఇంకా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి జంకుతుండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నిర్మాతల్లో ఒకరైన రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘దృశ్యం’ దర్శకురాలు శ్రీప్రియ, హీరోయిన్ మీనా, నటి ఎస్తర్, నరేశ్, సుజా, సంపత్ తదితరులు మాట్లాడారు.

Related Articles

Latest Articles