నిర్మాతల దర్శకుడు ఎ. మోహనగాంధీ

(మోహనగాంధీ బర్త్ డే సందర్భంగా)

ఏ తరహా కథ తన దగ్గరకు వచ్చినా దాన్ని ఆకళింపు చేసుకుని, విజయవంతమైన సినిమాగా మలచడానికి నూరు శాతం కృషి చేసే అరుదైన దర్శకులలో ఎ. మోహనగాంధీ ఒకరు. తెలుగు చిత్రసీమలో కమిట్ మెంట్ అనే పదానికి పర్యాయపదం ఆయన. అందుకే అగ్ర నిర్మాణ సంస్థలు ఆయన్ని తమ మనిషిగా భావించాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా అవకాశాలు ఇస్తూ వచ్చాయి. నిజం చెప్పాలంటే మోహనగాంధీకి లభించిన విజయాలు మరో దర్శకుడికి దక్కి ఉంటే… ఇంకో స్థాయిలో ఉండేవారు. కానీ విజయానికి పొంగిపోకుండా, అపజయానికి కృంగిపోకుండా తన పని తాను చేసుకు వెళ్ళడమే మోహనగాంధీకి అలవాటు. 1947 జూలై 7న విజయవాడలో జన్మించిన అన్నే మోహన గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణాన్ని తెలుసుకుందాం.

మురహరిరావు, రత్నమాణిక్యం దంపతుల కుమారుడైన మోహనగాంధీ విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్. కళాశాలలో బీఎస్సీ చదివారు. ఎన్టీఆర్ వంటి మహానటుడు చదివిన కళాశాల అది. నాటక రంగంలో కాస్తంత అనుభవం ఉన్న మోహనగాంధీ మనసు డిగ్రీ పూర్తి కాగానే సినిమాల మీదకు మళ్ళింది. అప్పటికే చిత్రసీమలో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబుకు తన బంధువు వెంకటరత్నంతో ఉన్న పరిచయాన్ని ఆధారం చేసుకుని చెన్నపట్నం చేరారు మోహనగాంధీ. 1967లో చెన్నయ్ వెళ్ళి, ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు పడ్డా… ఆ తర్వాత దర్శకత్వశాఖలో కుదురుకున్నారు. అక్కినేని సంజీవి, పి. చంద్రశేఖర్ రెడ్డి, తాతినేని రామారావు, ప్రత్యగాత్మ, వి. బి. రాజేంద్ర ప్రసాద్‌ తదితరుల దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి, ప్రావీణ్యం సంపాదించారు. కష్టపడే స్వభావం, ఏ విషయాన్ని అయిన వెంటనే గ్రహించగలిగే నేర్పుతో పాటు మంచితనం కారణంగా ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ లోనే ‘అర్ధాంగి’ సినిమాతో దర్శకుడయ్యారు. ఫ్యామిలీ సెంటిమెంట్ తో తెరకెక్కిన ‘అర్థాంగి’ ఆశించిన స్థాయిలో విజయం సాధించపోయినా, నిర్మాతకు మాత్రం లాభాలనే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘టెర్రర్’ లాంటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను రూపొందించిన మోహనగాంధీ తాను ఏ కథకైనా న్యాయం చేస్తానని నిరూపించుకున్నారు. ఆయన తెరకెక్కించిన ‘మంచి మనసులు’ చిత్రంలోని ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే… ‘ గీతం ఇప్పటికీ సంగీత ప్రియుల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటుంది. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో ‘పూజకు పనికిరాని పువ్వు’ చిత్రం చేసిన మోహన గాంధీ ఆ తర్వాత అదే బ్యానర్ లో రూపొందించిన ‘మౌనపోరాటం’తో ఘన విజయం అందుకున్నారు. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం సామాజికాంశాల దర్శకుడిగా మోహన గాంధీకి ఎనలేని గుర్తింపును తెచ్చిపెట్టింది.

ఏ నిర్మాత కాస్తంత భిన్నమైన చిత్రాన్ని తీయాలని అనుకున్నా ఆ రోజుల్లో వారి మొదటి ప్రాధాన్యం మోహన గాంధీనే అంటే అతిశయోక్తి కాదు. మరీ ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ కు మోహనగాంధీ చాలాకాలం పాటు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయారు. చిత్రం ఏమంటే విజయశాంతి నాయికగా ఆయన రూపొందించిన ‘కర్తవ్యం’, యమున హీరోయిన్ గా ఆయనే తెరకెక్కించిన ‘ఆడది’ సినిమా ఒకే రోజున విడుదలయ్యాయి. అందులో ‘కర్తవ్యం’ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు మోహనగాంధీ ఖ్యాతిని పదింతలు పెంచేసింది. ఓ పక్క లేడీ ఓరియంటెండ్ చిత్రాలు చేస్తూనే అగ్ర కథానాయకులతో, అగ్ర నిర్మాణ సంస్థలతో సినిమాలు తీశారు మోహనగాంధీ. అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మోహన్ బాబు, రాజశేఖర్ తదితరులతో విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఒకానొక సమయంలో భానుచందర్ – మోహనగాంధీ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్నారు. నటీనటుల నుండి తనకు కావాల్సిన హావభావాలను స్వయంగా చూపించి మరి తెప్పించుకోవడం మోహన గాంధీ ప్రత్యేకత. ఆయన చూపే అభినయాన్ని అనుకరిస్తే చాలు తమ పని సులువు అయిపోతుందంటారు కొందరు నటీనటులు. తెలుగుతో పాటు కన్నడలోనూ పలు చిత్రాలు రూపొందించారు మోహనగాంధీ. అయితే ఇప్పుడు కథల కంటే కాంబినేషన్స్ కే నిర్మాతలు ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆయన నిదానంగా చిత్రసీమకు దూరమయ్యారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఆయన దాదాపు నలభై చిత్రాలను రూపొందించిన నిర్మాతల దర్శకుడాయన. ప్రస్తుతం విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న మోహనగాంధీ తెలుగు సినీ రంగ దర్శకుల చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకోవడం విశేషం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-