ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూత..

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 7 : 30 నిమిషాలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయనకు రూరల్ యాస్పిరేషన్ ప్రొసీజర్ అనే ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందించారు వైద్యులు.

read also : మహిళలకు షాక్‌.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. 90 సంవత్సరాల వయసు ఉన్న దిలీప్ కుమార్… నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. అప్పట్లో యువతరాన్ని ఉర్రూతలూగించి.. బ్లాక్‌ బాస్టర్ హిట్ అందుకున్న దేవదాసు, ఆజాద్ వంటి సినిమాల్లో దిలీప్ కుమార్ హీరోగా నటించారు. కాగా… ఆయన మృతి పట్ల చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.

ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్! (ట్రాజెడి కింగ్ కు నివాళి)

భారతదేశం గర్వించదగ్గ నటుల్లో దిలీప్ కుమార్ స్థానం ప్రత్యేకమైనది. భారతీయ సినిమా స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో ఎందరో మహానటులు తమదైన అభినయంతో అలరించారు. అలాంటి వారిలో దిలీప్ కుమార్ ఒకరు. ఆ తరం మహానటుల్లో మిగిలివున్న ఏకైక నటుడు ఆయనే! అందుకే అందరూ దిలీప్ కుమార్ ను ‘ద లాస్ట్ థెస్సియన్’ అంటూ కీర్తిస్తారు. ఉత్తరాదిన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవానంద్ త్రిమూర్తులు జైత్రయాత్ర సాగిస్తున్న సమయంలో దక్షిణాదిన తెలుగులో యన్టీఆర్ – ఏయన్నార్, తమిళంలో ఎమ్జీఆర్ – శివాజీగణేశన్, కన్నడ నాట రాజ్ కుమార్, మళయాళ సీమలో ప్రేమ్ నజీర్ రాజ్యమేలారు. ఈ సూపర్ స్టార్స్ లో ఒకే ఒక్క ఎమ్జీఆర్ మాత్రమే దిలీప్ కంటే వయసులో పెద్దవారు. ఇక అందరూ దిలీప్ కంటే వయసులో చిన్నవారే!

దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11న అవిభాజ్య భారతంలోని పెషావర్ (ఇప్పుడు పాకిస్థాన్ లో ఉంది) జన్మించారు దిలీప్. సినిమా రంగంలో అడుగుపెట్టాకే, యూసఫ్ ఖాన్ కాస్తా దిలీప్ కుమార్ గా మారారు. 1944లో బాంబే టాకీస్ నిర్మించిన ‘జ్వార్ బాటా’తో దిలీప్ కుమార్ చిత్రసీమలో ప్రవేశించారు. ఆ తరువాత నుంచీ తన దరికి చేరిన పాత్రలను పోషిస్తూ సాగిన దిలీప్ కుమార్ “జోగన్, బాబుల్, దీదార్, దాగ్, దేవదాస్, నయాదౌర్, ఆన్, యాహుదీ, కోహినూర్, మొఘల్-ఏ-ఆజమ్, ఆజాద్,గంగ-జమున, రామ్ ఔర్ శ్యామ్, ఆద్మీ, గోపీ” వంటి చిత్రాలలో నటించి జనాన్ని అలరించారు. ముఖ్యంగా ఆయన నటించిన విషాద పాత్రలు దిలీప్ ను ‘ట్రాజెడీ కింగ్’గా నిలిపాయి. దిలీప్ మెథడ్ యాక్టర్ గానూ జేజేలు అందుకున్నారు. రాజ్ కపూర్ తో కలసి ‘అందాజ్’లో నటించిన దిలీప్, దేవానంద్ తో కలసి ‘ఇన్సానియత్’లో అభినయించారు. ఈ ‘ఇన్సానియత్’ తెలుగులో రూపొందిన ‘పల్లెటూరి పిల్ల’కు రీమేక్ కావడం విశేషం.

తనకంటే వయసులో 22 సంవత్సరాలు చిన్నదైన నటి సైరాబానును దిలీప్ వివాహమాడారు. 1981 చివరలో ఆస్మాసాహిబా అనే ఆమెను కూడా పెళ్ళాడారు. అయితే ఆ సమయంలో ఎంతోమంది దిలీప్ సన్నిహితులు సైతం సైరాబాను పక్షాన నిలిచారు. దాంతో 1983లో ఆస్మాకు విడాకులు ఇచ్చారు దిలీప్. ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఈ మహానటుణ్ణి గౌరవించింది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతోనూ దిలీప్ ను సన్మానించారు. 1997లో యన్టీఆర్ నేషనల్ అవార్డునూ దిలీప్ అందుకున్నారు. కళాకారుల విభాగంలో 2000 సంవత్సరంలో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన దిలీప్ ఆరేళ్ళ పాటు ఆ పదవిలో కొనసాగారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-