సినీ కార్మిక పక్షపాతి డా. ప్రభాకర్ రెడ్డి!

(జూన్ 1 డా. ప్రభాకర్ రెడ్డి జయంతి సందర్భంగా)
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానంటారు. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం డాక్టర్ అయిన తర్వాతే యాక్టర్ అయ్యారు. అప్పటి నల్గొండ జిల్లా సూర్యాపేట తుంగతుర్తిలో 1935 జూన్ 1న జన్మించిన ప్రభాకర్ రెడ్డికి నటన, రచన అనేవి యుక్తవయసు నుండి అబ్బిన విద్యలు. దానికి తోడు చదువులోనూ మొదటి నుండి ప్రథమ స్ధానంలో ఉన్న ఆయన ఎం.బి.బి.ఎస్. చదివారు. ఓ వైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే, అంతర్ విశ్వ విద్యాలయ నాటక పోటీలలో ప్రభాకర్ రెడ్డి పాల్గొనే వారు. అక్కడ ప్రత్యేక అవార్డులూ పొందేవారు. అలా ఓ నాటక పోటీలకు జడ్జిగా వెళ్ళిన గుత్తా రామినీడు దృష్టిలో ప్రభాకర్ రెడ్డి పడ్డారు. అప్పటికే ‘మా యింటి మహాలక్ష్మి’ చిత్రం రూపొందిస్తున్న ఆయన 1960లో తీసిన ‘చివరకు మిగిలేది?’ చిత్రంలో మానసిక వైద్యుడి పాత్రను ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారు. అలా చిత్రసీమలోకి అడుపెట్టిన ప్రభాకర్ రెడ్డి 37 సంవత్సరాలలో దాదాపు 500 చిత్రాలలో నటించారు.

ప్రభాకర్ రెడ్డి మంచి కథకుడు, అంతకు మించి అభిరుచి ఉన్న నిర్మాత. తన వదిన గారు జయప్రద పేరుతో ‘జయప్రద’ పిక్చర్స్ ను స్థాపించి పలు చిత్రాలు నిర్మించారు. పద్మాలయా సంస్థ నిర్మించిన ‘పండంటి కాపురం’కు ప్రభాకర్ రెడ్డి కథను అందించడంతో పాటు నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు. ఆ తర్వాత ‘గాంధి పుట్టిన దేశం, నాకూ స్వాతంత్రం వచ్చింది, పచ్చని సంసారం, కార్తీక దీపం, ధర్మాత్ముడు, గృహ ప్రవేశం, ప్రతిభా వంతుడు, ప్రచండ భారతం’ తదితర చిత్రాలను నిర్మించారు. ఈ చిత్రాలన్నింటికీ ఆయనే కథను, చిత్రానువాదాన్ని అందించారు. అలానే ‘మండలాధీశుడు, గండిపేట రహస్యం, ప్రచండ భరతం, కామ్రేడ్’ చిత్రాలకు ప్రభాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇందులో కొన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీయార్ పై సెటైరికల్ గా తీసిన సినిమాలు.

ప్రభాకర్ రెడ్డి తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 27 చిత్రాలను నిర్మించి, 21 చిత్రాలకు కథను అందించారు. ఉత్తమ నటుడిగా రెండు సార్లు, ఉత్తమ సహాయ నటుడిగా ఒకసారి, ఉత్తమ కథ రచయితగా ఇంకోసారి మొత్తం నాలుగు నంది అవార్డులను అందుకున్నారు. జయసుధను ‘పండంటి కాపురం’ ద్వారా; నటి జయప్రదను, రచయిత గణేశ్ పాత్రోను ‘నాకూ స్వాతంత్రం వచ్చింది’ ద్వారా; గీత రచయిత వెన్నెలకంటిని ‘శ్రీరామచంద్రుడు’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత ప్రభాకర్ రెడ్డికే చెందుతుంది. ప్రభాకర్ రెడ్డి సతీమణి సైతం ఆయనకు చేదోడు వాదోడుగా ఉండేవారు. కాస్ట్యూమ్ డిజైనింగ్ లో భర్తకు ఎంతో సహాయకారిగా ఉంటూ, తగిన సలహాలూ సూచనలు అందించే వారు.

బడుగు బలహీన వర్గాల వారంటే ప్రభాకర్ రెడ్డికి వల్లమాలిన అభిమానం. సినీ కార్మికులు, సాంకేతిక నిపుణులకు కాస్తంత వినోదాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అప్పట్లో ట్విన్ సీ క్లబ్ ను ఏర్పాటు చేశారు. నానక్ రామ్ గూడాలో సినీ కార్మికుల సొంత ఇంటి నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన చిత్రపురి హౌసింగ్ సొసైటీకి భూ కేటాయింపుల విషయమై ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన కృషి చేశారు. అందుకే ఆయన మరణానంతరం దాని పేరును యం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీగా మార్చారు. ఇప్పుడు అందులో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరూ… అందుకు కారకులైన ప్రభాకర్ రెడ్డిని నిత్యం తలుచుకుంటూనే ఉన్నారు. 1997 నవంబరు 26వ తేదీన తన 62వ యేట హైదరాబాదులో ప్రభాకర్ రెడ్డి కన్నుమూశారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-