రివ్యూ: వరుణ్‌ డాక్టర్ (తమిళ డబ్బింగ్)

‘రెమో, సీమరాజా, శక్తి’ వంటి చిత్రాలతో తమిళ హీరో శివ కార్తికేయన్ తెలుగువారికి చేరువయ్యాడు. అతనితో నెల్సన్ రూపొందించిన ‘వరుణ్ డాక్టర్’ మూవీ తమిళ, తెలుగు భాషల్లో శనివారం జనం ముందుకు వచ్చింది. నాని ‘గ్యాంగ్ లీడర్’, శర్వానంద్ ‘శ్రీకారం’ చిత్రాలలో నటించిన ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో హీరోయిన్.

వరుణ్ (శివ కార్తికేయన్) ఆర్మీ డాక్టర్. అతనికి పద్మిని (ప్రియాంక అరుల్ మోహన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. అయితే ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే వరుణ్ కు, తనకు పొసగదనే విషయం గ్రహించిన పద్మిని పెళ్ళికి ముందే బ్రేకప్ చెప్పేస్తుంది. అదే సమయంలో ఆమె అన్నయ్య కూతురు కిడ్నాప్ కు గురౌతుంది. పద్మినితో బ్రేక్ అప్ అయినా ఆ పాపను రక్షించడానికి ఈ ఆర్మీ డాక్టర్ ఏం చేశాడన్నదే ఈ చిత్ర కథ.

నయనతార, యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘కొలమావు కోకిల’ చిత్రంతో నెల్సన్ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా ‘బీస్ట్’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఈ మధ్యలో వచ్చిందే ‘వరుణ్ డాక్టర్’ మూవీ. ఐదేళ్ళ క్రితం ‘రెమో’లో నర్స్ వేషం వేసిన శివ కార్తికేయన్, ఇప్పుడు డాక్టర్ గా నటించాడు. చిత్రం ఏమంటే… నెల్సన్ ఎంచుకున్నది చాలా సీరియస్ సబ్జెక్ట్. హ్యూమన్ ట్రాఫికింగ్ చుట్టూ అతను ఈ కథను అల్లాడు. అయితే దాన్ని వినోదాత్మకంగా తెరకెక్కించాడు. స్కూల్ లో చదువుకునే పాపను కొందరు కిడ్నాప్ చేయడం, ఆ చిన్నారిని వెతుక్కుంటూ ఇంటి సభ్యులంతా డాక్టర్ వరుణ్ ప్లాన్ ప్రకారం గోవాకు వెళ్ళడం, అక్కడ విలన్ తో తలపడటం అంతా ఓ హై డ్రామాను తలపిస్తుంది. దీనికి తోడు ప్రతి సన్నివేశంలోనూ దర్శకుడు వినోదానికి ప్రాధాన్యమిచ్చాడు. కొన్ని చోట్ల సిట్యుయేషనల్ కామెడీని, మరికొన్ని చోట్ల డైలాగ్ కామెడీని ఆశ్రయించాడు. దాంతో ఎంచుకున్న కథ ఏమిటీ, దాన్ని చూపిస్తున్న విధానం ఏమిటనే ప్రశ్న ఆడియెన్స్ మనసులో కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రాక్టికల్ గా ఉండే డాక్టర్ వరుణ్… హీరోయిన్ తండ్రికి ‘నేను సాఫ్ట్ కాదు పొగరబోతుని’ అని చెప్పడంలో ఆంతర్యం అర్థం కాదు. అయితే, పొగరబోతు అని కాకుండా ‘నేనూ పట్టుదల కలవాడినే’ అని చెప్పి ఉంటే బాగుండేది. హీరోయిన్ తో బ్రేకప్ అయినా, మానవత్యంతో ప్రాణాలకు తెగించి, ఆమె అన్న కూతురు కోసం రకరకాల ప్లాన్స్ వేస్తాడు కాబట్టి!

నటీనటుల విషయానికి వస్తే శివ కార్తికేయన్ ఈ పాత్రను బాగానే చేశాడు కానీ ఎందులో నూరుశాతం ఇవ్వలేదనిపిస్తుంది. పైగా ఈ సినిమా తమిళ వర్షన్ కు అతనే నిర్మాత కూడా. కొన్ని చోట్ల ఏదో రోబోలా నటించాడు. పైగా క్లయిమాక్స్ మరీ చిత్ర విచిత్రంగా, ఏదో పాతికేళ్ళ క్రితం సినిమాలా అనిపించింది. ఇక హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కు కిడ్నాప్ డ్రామాలను వెతికి మరీ దర్శక నిర్మాతలు ఇస్తున్నట్టుగా ఉన్నాయి. నాని ‘గ్యాంగ్ లీడర్’లోనూ కిడ్నాప్ చేసే టీమ్ మెంబర్ గా ప్రియాంక నటించింది, ఇందులోనూ అదే తరహా పాత్రను పోషించింది. హీరోయిన్ మేనకోడలే కిడ్నాప్ కావడంతో హీరోకు, ఆమెకు మధ్య రొమాన్స్ ను క్రియేట్ చేయడానికి ఆస్కారం లేకపోయింది. పైగా సినిమా ప్రారంభంలోనే హీరోతో ఆమె మానసికంగా కటీఫ్‌ అయిపోతుంది. దాంతో ఓ చక్కటి పాటను చివరిలో వేశారు. కానీ అప్పటికీ సహనం కోల్పోయిన ప్రేక్షకులు సీట్ లోంచి లేచి బయటకు వెళ్ళిపోతున్నారు.

నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కామెడీకి లోటు లేదు. యోగిబాబుతో పాటు రెడిన్ కింగ్ల్సే తమ నటనతో బాగా నవ్వించారు. అంతేకాదు గోవాకు బయలుదేరే టీమ్ మెంబర్స్ తో పాటు, హీరోయిన్ ఇంటి సభ్యులూ డైలాగ్ కామెడీతో ఆకట్టున్నారు. చాలా రోజుల తర్వాత ‘వాన’ ఫేమ్ వినయ్ రాయ్ ను విలన్ పాత్రలో చూసే ఛాన్స్ దక్కింది. మిలింద్ సోమన్ వంటి చక్కని ఆర్టిస్టును దర్శకుడు సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ట్విన్ బ్రదర్స్ రఘురామ్, రాజీవ్ లక్ష్మణ్ పోరాట సన్నివేశాలలో కాస్తంత మెప్పించారు. ఈ సినిమాకు అనిరుధ్ నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. అలానే విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు కోటపాడి రాజేశ్, మహేశ్వరరెడ్డి తీసుకొచ్చారు. వినోదాత్మక చిత్రాలను ఇష్టపడేవారికి ఓ మాదిరిగా ‘వరుణ్ డాక్టర్’ నచ్చే ఆస్కారం ఉంది. కానీ ఇదేదో యాక్షన్ డ్రామా అనుకుని వెళితే మాత్రం నిరాశకు గురికాక తప్పదు.

ప్లస్ పాయింట్స్
ఆకట్టుకునే వినోదం
అనిరుధ్ నేపథ్య సంగీతం
విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ

మైనెస్ పాయింట్స్
ఆకట్టుకోని కథనం
నిరాశ పరిచే క్లయిమాక్స్

రేటింగ్ : 2.25 / 5

ట్యాగ్ లైన్: నవ్వులపాలైన డాక్టర్!

-Advertisement-రివ్యూ: వరుణ్‌ డాక్టర్ (తమిళ డబ్బింగ్)

SUMMARY

varun doctor movie review, varun doctor movie, varun doctor , movie review, varun doctor review,

Related Articles

Latest Articles