జనం మదిని గెలిచిన వందేమాతరం శ్రీనివాస్

(సెప్టెంబర్ 9న వందేమాతరం శ్రీనివాస్ పుట్టినరోజు)
పాటను ఇంటిపేరుగా మార్చుకున్న గాయకుడు వందేమాతరం శ్రీనివాస్. స్వరకల్పనతోనూ సంబరాలు చేసుకున్న ఘనుడు వందేమాతరం. ఒకప్పుడు లో బడ్జెట్ మూవీస్ కు కంచుకోట లాంటి సంగీత దర్శకుడు శ్రీనివాస్. ఇక ఎరుపు రంగు పులుముకున్న చిత్రాలకు వందేమాతరం తప్ప వేరే దారి కనిపించేది కాదు. వరుసగా రెడ్ మార్క్ సినిమాలకు సంగీతం సమకూర్చినా వైవిధ్యంతో చిందులేయించేవారు శ్రీనివాస్. ఆరు నందులు ఆయన ప్రతిభకు పట్టం కట్టాయి. గాయకునిగా మూడు సార్లు, సంగీత దర్శకునిగా మూడు మార్లు నందిని అందుకొని ఆనందించారు శ్రీనివాస్. ఇప్పటికీ తన దరికి చేరిన పాటనైనా, సినిమానైనా గళంతోనూ, సంగీతంతోనూ పరుగులు తీయించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్.

టి.కృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్, విజయశాంతి జంటగా నటించిన ‘వందేమాతరం’ చిత్రంతో శ్రీనివాస్ వెలుగు చూశారు. ఆ సినిమాకు సంగీత దర్శకుడు చక్రవర్తి. “వందేమాతరం… వందేమాతరం…” అంటూ శ్రీనివాస్ పాడిన ఆ పాట ఆ రోజుల్లో విశేషాదరణ చూరగొంది. సి.నారాయణ రెడ్డి రాసిన ఈ పాటలో “వందేమాతర గీతం వరస మారుతున్నది…” అనే పంక్తి ఉంది. ఆ పాట పాడిన తరువాత శ్రీనివాస్ రాతనే మారిపోయింది. తరువాత పలు చిత్రాలలో పాటగాడిగా సాగిన శ్రీనివాస్, ఆర్. నారాయణ మూర్తి నిర్మించిన కొన్ని చిత్రాలకు వరుసగా సంగీతం సమకూర్చారు. ఆ సినిమాలన్నీ రెడ్ మార్క్ వే అయినా, ప్రతి చిత్రంలోనూ వైవిధ్యం పలికించారు. దాంతో వందేమాతరం శ్రీనివాస్ బిజీ అయిపోయారు. కేవలం ఎర్ర సినిమాలకే కాకుండా అన్ని రకాల చిత్రాలకూ స్వరకల్పన చేయగలనని నిరూపించుకున్నారు శ్రీనివాస్. ఆ పై ఆర్ .నారాయణ మూర్తికే అందనంత బిజీగా మారిపోయారు వందేమాతరం.

వందేమాతరం శ్రీనివాస్ స్వరకల్పనలో రూపొందిన ఏకైక బిగ్ హిట్ ‘ఒసేయ్ రాములమ్మ’. ఈ చిత్రం ద్వారా ఉత్తమ సంగీత దర్శకునిగా నంది అవార్డును అందుకున్న శ్రీనివాస్, ఆ తరువాత ‘స్వయంవరం’, ‘దేవుళ్ళు’ చిత్రాలకూ వినసొంపైన స్వరరచన చేసి మరో రెండు నందులను సొంతం చేసుకున్నారు. ఇక ‘ఒరేయ్ రిక్షా’లోని “మల్లెతీగెకు పందిరివోలె…” అంటూ గద్దర్ పలికించిన పాట పాడి ఉత్తమ గాయకునిగా తొలి నందిని అందుకున్నారు శ్రీనివాస్. ఆ పై ‘శ్రీరాములయ్య’, ‘దండకారణ్యం’ చిత్రాలతోనూ వందేమాతరం ఉత్తమ గాయకునిగా నిలిచారు. తన పాటలతో జనం మదిని గెలిచిన వందేమాతరం శ్రీనివాస్ గీతం యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. నటునిగా ‘అమ్ములు’ చిత్రంలో కనిపించారు శ్రీనివాస్. ఆపై ‘బద్మాష్’ అనే చిత్రానికి మెగాఫోన్ పట్టి దర్శకత్వమూ వహించారు. తనలోని బహుముఖ ప్రజ్ఞను చాటుకోవాలని తపించే వందేమాతరం శ్రీనివాస్ మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.

Related Articles

Latest Articles

-Advertisement-