స్టార్ సినిమాలపై ‘వకీల్ సాబ్’ దెబ్బ

కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల సినిమాల లాంగ్ రన్ తగ్గిపోయింది. శతదినోత్సవాలు కరువై అర్థశతదినోత్సవాలే దిక్కయ్యాయి. ఇప్పుడు అదీ పోయింది ఓపెనింగ్ వీక్ లో ఎంత వస్తే అంతే. అయితే స్టార్ హీరోల సినిమాల వరకూ కొంత వెలుసుబాటు ఉండేది. కొంతలో కొంత బాగున్న స్టార్ హీరోల సినిమాలు 5, 6 వారాలు గట్టిగా నిలబడి 50 రోజులైనా ఆడేవి. కరోనా తర్వాత ఓటీటీ ట్రెండ్ తో అదీ కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇటీవల కాలం వరకూ పెద్ద హీరోల సినిమాలను 50 రోజుల తర్వాతే శాటిలైట్ ఛానెల్స్ లో విడుదల చేసేవారు. ఇప్పుడు ఓటీటీలో రెండో వారం మూడో వారం తర్వాత రిలీజ్ కి రెడీ అనేస్తున్నారు. దీని ప్రభావం రాబోయే స్టార్ హీరోల సినిమాలపై పడబోతుందంటున్నారు పంపిణీదారులు, ప్రదర్శనదారులు.

ఏప్రియల్ 9న థియేటర్లలో విడుదలై చక్కటి విజయాన్ని సాధించింది ‘వకీల్ సాబ్’. ‘పింక్’ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లాయర్ సత్యదేవ్ పాత్రతో అటు ఫ్యాన్స్ ను ఇటు ఆడియన్స్ ను అలరించారు పవన్ కళ్యాణ్‌. ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ప్రైమ్ ట్వీట్ చేసి నిర్ధారంచింది. ఇది థియేటర్ లో సినిమా చూడని వారికి ఆనందాన్ని కలిగిస్తే వందలకు వందలు వదిలించుకుని సినిమా చూసిన వారు అయ్యో ఒకటిరెండు వారాలు అగిఉంటే చాలా డబ్బులు ఆదా అయ్యేవని ఫీలవుతున్నారు.

ఇదే టాలీవుడ్ లో కొత్త చర్చకు కారణమవుతోంది. కనీసం 50 రోజుల గ్యాప్ కూడా లేకుండా ఇలా ఓటీటిలో రిలీజ్ చేస్తే త్వరలో రిలీజ్ అయ్యే పెద్ద హీరోల సినిమాలకు ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. సంక్రాంతికి వచ్చిన విజయ్ ‘మాస్టర్’… ఇప్పుడు ‘వకీల్ సాబ్’ మూడు వారాల్లోనే ఓటీటిలో వచ్చేయటంతో రాబోయే పెద్ద సినిమాలు కూడా అతి తక్కువ టైమ్ లో ఓటీటిలో వచ్చేస్తాయి… ఇక థియేటర్ కి వెళ్ళి డబ్బులు దండగ చేసుకోవడం ఎందుకు అని జనం థియేటర్లకు వెళ్లటం మానేస్తారు. అది పెద్ద సినిమాలపై దారుణమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు. గతంలో నిర్మాతలు కలసి మాట్లాడుకుని థియేటర్ రిలీజ్ కు ఓటీటి లేదా శాటిలైట్ ప్రీమియర్ రిలీజ్ కు మధ్య నాలుగు నుంచి ఆరు వారాల మినిమం గ్యాప్ ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడా నిబంధనకు నీళ్ళు వదిలేసినట్లే. ‘వకీల్ సాబ్’ ఓటీటీ విడుదల విషయంలో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఖండించిన దిల్ రాజు 50 రోజుల వరకూ ఓటీటీలో రాదని చెప్పారు. కట్ చేస్తే కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో ‘వకీల్ సాబ్’ను ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. ఒక వేళ ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే స్టార్ హీరోలు, పెద్ద సినిమాల థియేట్రికల్ బిజినెస్ పై భారీ ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. మరి కరోనా కాలం వరకే ఇలా చేస్తారా? లేక ఆ తర్వాత కూడా సినిమాలు విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఓటీటీలో రిలీజ్ చేస్తారా!? అన్నది చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-