ఇండియా – బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !

భారత్‌-యుకే మధ్య వ్యాక్సిన్‌ వార్‌ షురూ అయింది. భారత్‌లో తీసుకున్న కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ను తాము గుర్తించడం లేదంటూ…కొన్ని రోజుల క్రితం బ్రిటన్‌ ప్రకటించింది. కొవిషీల్డ్‌ రెండు డోసులు తీసుకున్నా…భారత్‌ నుంచి బ్రిటన్‌ వచ్చే వారికి 10రోజుల క్వారంటైన్‌ తప్పనిసరంటూ అక్కడి ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. దీన్ని ఖండించిన భారత్‌…ఈ నిబంధనలు వివక్షపూరితంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. బ్రిటన్‌ వెనక్కి తగ్గకపోవడంతో…భారత్‌ దీటుగా స్పందించింది. అక్కడ నుంచి వచ్చే పౌరులపైనా ఆంక్షలకు సిద్ధమైంది. బ్రిటన్‌ పౌరులను 10 రోజులు క్వారంటైన్‌లో ఉంచడంతోపాటు 3సార్లు కొవిడ్‌ టెస్టులు చేయాలని నిర్ణయించింది.

ఈ వారం నుంచే కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నెల 4వ తేదీ నుంచి భారత్‌కు వచ్చే బ్రిటన్‌ పౌరులు… 3 ఆర్‌టీ పీసీఆర్‌ రిపోర్టులు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. ప్రయాణానికి 72గంటల ముందు ఒకసారి, ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత మరోసారి, అనంతరం 8వ రోజు ఇలా మొత్తంగా మూడుసార్లు కొవిడ్‌ టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. భారత్‌కు చేరుకున్న తర్వాత ఇళ్లు లేదా హోటల్‌లో 10 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలి. వ్యాక్సిన్‌ తీసుకున్నారా? లేదా అనే విషయంతో సంబంధం లేకుండా… బ్రిటన్‌ పౌరులు ఈ నిబంధనలు పాటించాల్సిందేనని కేంద్రం తెలిపింది.

మరోవైపు కొవిషీల్డ్‌ టీకాను అధికారికంగా గుర్తించిన దేశాల జాబితాలో ఆస్ట్రేలియా చేరింది. కొవిషీల్డ్‌తోపాటు చైనాకు చెందిన సినోవాక్‌నూ గుర్తించింది. దేశానికి చెందిన ఔషధ నియంత్రణ మండలి థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు. టీకాలు పొందినవారు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం కానుంది. నవంబరు నుంచి స్థానికులు, శాశ్వత నివాసితులకు అంతర్జాతీయ రాకపోకలను పునరుద్ధరించనున్నట్లు మోరిసన్‌ ప్రకటించారు.

-Advertisement-ఇండియా - బ్రిటన్‌ మధ్య వ్యాక్సిన్‌ వార్‌ !

Related Articles

Latest Articles