ఆహా… బాలయ్య, రానా భలే సందడి!

నందమూరి బాలకృష్ణ ‘ఆహా’ ఓటీటీ కోసం నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్ 8లో దగ్గుబాటి రానా గెస్ట్ గా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో కూడా బాలకృష్ణ ఎప్పటిలాగే తన ఎనర్జీ లెవెల్స్ తో ఉత్సాహంగా కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సారి ముందుగా ప్రేక్షకుల్లోని వారితో ‘అన్ స్టాపబుల్’ గురించి చర్చిస్తూ ఈ ఎపిసోడ్ ను ఆరంభించడం విశేషం! రోజా అనే అమ్మాయి తాను పట్టుదలతో ఎలా డ్రైవింగ్ నేర్చుకున్నదో వివరించగా… తనదీ, రోజాతో బెస్ట్ కాంబినేషన్ అని బాలకృష్ణ గుర్తు చేసుకోవడం అందరినీ ఆకట్టుకుంది! ఇక నాగభూషణం అనే వ్యక్తి షోకి ‘అఖండ’ గెటప్ లో వచ్చి బాలయ్యనే ఆశ్చర్యపరిచారు.

రానా దగ్గుబాటి గతంలో నిర్వహించిన టాక్ షో ‘నంబర్ వన్ యారీ’లో బాలకృష్ణ గెస్ట్ గా రెండు సార్లు పాల్గొన్నారు. ఇప్పుడు బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్’కు రానా గెస్ట్ కావడం విశేషం! తన రెండు టాక్ షోస్ కు రాగానే బాలకృష్ణ గారే సొంతగా టాక్ షో పెట్టుకున్నారే అనిపించింది అంటూ రానా చెప్పటం… జనానికి వినోదం పంచింది. మొదట్లోనే తాను ఎందుకు స్పెషల్ ఎఫెక్ట్స్ తో సినీ యానం ప్రారంభించానో వివరించారు రానా. కొత్తవిషయాలతో ముందుకు సాగడమంటే తనకెంతో ఇష్టమని రానా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మీ బాబాయ్ మీ పెళ్ళికి సలహాలు ఏమైనా ఇచ్చారా అని బాలయ్య అడగ్గానే, “నేను పెళ్ళి చేసుకుంటున్నానని షాక్ అయ్యారు” అని రానా ఆన్సర్ ఇవ్వడంతో నవ్వులు పూశాయి. పెళ్ళయ్యాక బ్యాలెన్స్ వచ్చేసిందంటూ బాలయ్య కాంప్లిమెంట్ ఇచ్చారు. బాలయ్యనే రానా కొన్ని ప్రశ్నలు వేసి ఆకట్టుకున్నారు. ఆ ప్రశ్నల్లో భాగంగా ఫోన్ లో బాలకృష్ణ భార్య వసుంధరకు ఆయనతో ‘ఐ లవ్ యూ’ చెప్పించారు రానా. తరువాత బాలకృష్ణ తనదైన స్టైల్ లో రానాను అతని పర్సనల్ విషయాలు అడుగుతూ ఓ ఆట ఆడుకున్నారు. ఈ ప్రోగ్రామ్ షూట్ బహుశా డిసెంబర్ 24న జరిగిందేమో! ఎందుకంటే, రానాతో వాళ్ళ నాన్న సురేశ్ బాబుకు ఫోన్ చేయించారు బాలకృష్ణ. ఈ రోజు మానాన్న బర్త్ డే అంటూ రానా చెప్పారు. బాలయ్య ఫోన్ లో విషెస్ చెప్పారు. ఆ సమయంలో బాలయ్య అడిగిన ప్రశ్నకు, “రానా ఈజ్ ఏ సెల్ఫ్ మేడ్ సన్…” అని సురేశ్ బాబు ఫోన్ లో సమాధానమిచ్చారు. తన జీవితం తన తండ్రి, తనయుడు ఇద్దరు రామానాయుడుల మధ్య సెట్ అయిందని చెప్పారు సురేశ్ బాబు.

బాలకృష్ణతో కలసి ‘యన్టీఆర్ బయోపిక్’లో నటించారు రానా. అందులో చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించారు. ఆ ముచ్చట్లను ఇద్దరూ షేర్ చేసుకున్నారు. ఓ ప్రశ్నకు సమాధానంగా తాను అహ్మదాబాద్ ఐఐఎమ్ కు వెళ్ళి, వ్యాపారాన్ని ఎలా సాగించాలో నేర్చుకున్నానని రానా చెప్పారు. ఈ షోలో తెలంగాణ తొలి తెలుగు మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి ఏవీ ప్రదర్శించారు. ఆమె ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ అన్ స్టాపబుల్ గా సాగాలని బాలయ్య, రానా ఆశించారు. ఈ సందర్భంగా బాలయ్యతో ఆదిలక్ష్మి “యా…యా…జై బాలయ్యా…” పాటకు స్టెప్స్ వేయడం అందరినీ అలరించింది. తరువాత ఓ బోషాణంలోని వస్తువులను తీస్తూ, వాటికి సంబంధించిన డైలాగ్స్ చెప్పమన్నారు బాలయ్య. అందుకు రానా స్పందించిన తీరు కూడా భలేగా ఆకట్టుకుంది. అందులో భాగంగానే కిరీటం పెట్టుకొని ‘దానవీరశూర కర్ణ’లోని దుర్యోధనుని డైలాగ్స్ చెప్పారు రానా. తరువాత రానా చేతికి రామ్ చరణ్ బొమ్మ వచ్చింది. మీ ఇద్దరి మధ్య జరిగే గొడవల గురించి చెప్పమ్మా అన్నారు బాలయ్య. అందుకు రానా ఇచ్చిన సమాధానం కూడా ఆకట్టుకుంది.

బాలయ్య, రానా మధ్య సాగిన సంభాషణలు భలే సరదాగా సాగాయి. గతంలో మీడియా రానాను ఆయన అఫైర్స్ గురించి ప్రశ్నిస్తే సీరియస్ గా లేచిపోయారు. అలాంటి రానాను ఈ సారి బాలయ్య అఫైర్స్ గురించి గుర్తు చేసినప్పుడల్లా “సార్…” అంటూ దీర్ఘాలు తీస్తూనే ఎంజాయ్ చేయడం గమనార్హం! ఏది ఏమైనా మునుపటి ఎపిసోడ్స్ కంటే భిన్నంగా ‘అన్ స్టాపబుల్’ ఎనిమిదో ఎపిసోడ్ సాగిందని చెప్పవచ్చు.

Related Articles

Latest Articles