17 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు నిధుల విడుదల.. ఏపీకి ఎన్నంటే..?

17 రాష్ట్రలకు రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటన చేసింది.. “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” (పీడీఆర్‌డీ) గ్రాంట్ కింద ఆరో విడత నిధులు విడుదల చేసింది.. దేశంలోని 17 రాష్ట్రాలకు 6వ విడత కింద రూ. 9,871 కోట్లు విడుద‌లయ్యాయి.. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వ‌ర‌కు అర్హత కలిగిన రాష్ట్రాలకు “పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్” గ్రాంట్ కింద రూ. 59,226 కోట్లు విడుదలైనట్టు అయ్యింది.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు పీడీఆర్‌డీ రెవెన్యూ లోటు గ్రాంట్‌ను కేంద్రం ఇవ్వాల్సి ఉంది.. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం 17 రాష్ట్రాలకు రెవిన్యూ లోటు నిధులను సిఫార్సు చేసింది ఆర్థిక సంఘం..

ఇక, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1438 కోట్లు రెవెన్యూ లోటు నిధులు విడుదలయ్యాయి.. ఏపీకి రెవెన్యూ లోటుకు సంబంధించి ఆరో విడత కింద రూ.1,438.08 కోట్లు విడుద‌ల చేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. దీంతో ఇప్పటి వ‌ర‌కు రెవెన్యూ లోటుకు సంబంధించి ఏపీకి మొత్తం రూ.8,628.50 కోట్లు విడుదలయ్యాయి… కాగా, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 17 రాష్ట్రాలకు రూ.1,18,452 కోట్లు ఇవ్వాల్సి ఉండ‌గా, ఇందులో రూ. 59,226 కోట్లు అంటే ఇప్పటి వరకు 50 శాతం నిధులు విడుదల చేసింది.. ఆర్థికసంఘం సిఫార్సు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, అసోం, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

Related Articles

Latest Articles

-Advertisement-