హుజురాబాద్ ఎన్నికలపై నిరుద్యోగుల ఎఫెక్ట్‌…

త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో నిరుద్యోగులు ప్రధాన భూమిక పోషించనున్నారా? టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ వారి నుంచే తగలనుందా? షర్మిల పార్టీ నిరుద్యోగులను ఏకం చేసి టీఆర్‌ఎస్‌ విజయావకాశాలను దెబ్బతీస్తుందా? రేపటి ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోషించబోయే పాత్ర గురించి రాజకీయ వర్గాల్లో విశేషంగా చర్చ జరుగుతోంది. షర్మిల పార్టీతో తమకు ఎలాంటి నష్టం ఉండదని టీఆర్‌ఎస్‌ అంటోంది. మరోవైపు అది తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ అంచనా వేస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగలను పోటీ చేయించాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ -YSRTP బావిస్తోంది. ఈ మేరకు నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చింది. ఉద్యోగం పోగొట్టుకుని నిరుద్యోగులుగా మారిన యవత రేపటి ఎన్నికలకు నామినేషన్‌ వేయాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో పోటీ చేసి తమ డిమాండ్‌ను అందరికి తెలిసేలా చేయాలన్నది దాని ఎత్తుగడ. తద్వారా తెలంగాణ యూత్‌కు దగ్గరకావాలన్నది దాని ప్లాన్‌. అందుకే దాదాపు 200 మంది నిరుద్యోగులతో నామినేషన్‌ వేయించి అందరి దృష్టిని తమవైపు తిప్పుకోవాలని చూస్తోంది ఆ పార్టీ.

నిరుద్యోగులకు అండగా నిలిచి వారితో నామినేషన్లు వేయించాలని షర్మిల పార్టీ బావిస్తోంది. అందుకు గతంలో వారణాసి, నిజామాబాద్‌ తరహా వ్యూహాన్ని అనుసరించనుంది. నిరుద్యోగులు, ఉద్యోగం పోయిన వారిపైనే తమ ఫోకస్‌ అంటోంది YSRTP. కేసీఆర్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నవారు ముందుకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆహ్వానిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు.

రాష్ట్రంలో ఖాలీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవటం వల్లే నిరుద్యోగం పేరుకుపోయిందని YSRTP ఆరోపిస్తోంది. జాబ్స్‌ లేక తెలంగాణ యూత్‌ తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉంది. ఈ ఎన్నికల ద్వారా వారి కోపాన్ని, అసంతృప్తిని ప్రభుత్వానికి గట్టిగా చెప్పటమే ఆ పార్టీ ప్లాన్‌. అయితే వారు ఆశించిన స్థాయిలో యువత నుంచి స్పందన వస్తుందా అన్నది ప్రశ్న. ఒక వేళ అలా వస్తే 200 మందిని బరిలో దించేందుకు షర్మిల పార్టీ రెడీ అయింది. పోటీ చేయటానికి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా పార్టీయే సమకూర్చనుంది.

పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని నిరసిస్తూ 178 మంది రైతులు నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. సిట్టింగ్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత అప్పట్లో వారి టార్గెట్‌. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన 185 మంది అభ్యర్థులలో 178 మంది నిజామాబాద్‌ జిల్లా రైతులే. అలాగే 50 మంది రైతులు ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసిలో నామినేషన్లు వేశారు. అది వారి డిమాండ్ పై చర్చకు దారితీసింది. ఇక నిజామాబాద్‌లో సీఎం కూతురు కవిత ఓటమి పాలయ్యారు. హామీలు విస్మరిస్తే ఎంతటివారైనా తగిన మూల్యం చెల్లించాల్సిందే అనే సందేశం ఇవ్వగలిగారు. ఐతే, పసుపు బోర్డు హామీ నెరవేరక పోవటానికి కారణం కేంద్రమేనంటూ కవిత మద్దతుదారులు అప్పట్లో ఎదరుదాడికి దిగారు. అది వేరే సంగతి.

YSRTP ఎత్తుగడను టీఆర్‌ఎస్‌ కొట్టి పారేస్తోంది. ఉద్యోగాలు భర్తీ చేయలేదన్నది అబద్ధమని అంటోంది. గత ఏడేళ్లలో లక్షా ముప్పయ్‌ వేల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందని..కావాలంటే లెక్కలు తెప్పించుకుని చూసుకోవచ్చాని కౌంటర్‌ ఇస్తున్నారు. YSRTPకి 200 మంది అభ్యర్థులు దొరకటం కూడా కష్టమే అంటున్నారు వారు. షర్మిల ఎక్కడికి వెళ్లినా స్పందనే లేదని, ఆమె పోరాటం తెలంగాణ కోసం కాదన్న విషయం ఇప్పటికే యువతకు అర్థమైందని అంటున్నారు. కేవలం తన ఉనికి కోసమే పోరాడుతున్నారని విమర్శిస్తోంది గులాబీ పార్టీ.

మరోవైపు, బీజేపీ మాత్రం హుజూరాబాద్‌ ఉప ఎన్నికలపై YSRTP ఎంతో కొంత ప్రభావం చూపుతుందని నమ్ముతోంది. అది తమకు అనుకూలంగా మారుతుందని కమల దళం ఆశిస్తోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకమైన ఏ చర్య అయినా తమకు లాభమే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. తెలంగాణ నిరుద్యోగంపై పోరాటం చేస్తున్నామని, దీపావళి లోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వకుంటే మిలియన్‌ మార్చ్‌ నిర్వహిస్తామని ఇప్పటికే ఆ పార్టీ హెచ్చరించింది. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగమిస్తామన్న కేసీఆర్, ఏడేళ్లలో ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ విమర్శలను టీఆర్‌ఎస్‌ సమర్ధవంతంగా తప్పికొడుతోంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నిస్తోంది.

హుజురాబాద్ పోరు ప్రధానంగా బిజెపి, టిఆర్ఎస్ మధ్యనే ఉన్నందున YSRTP ఎత్తుగడ పనిచేయదని గులాబీ పార్టీ భావిస్తోంది. బీజేపీ ఎంత ప్రయత్నించినా హుజూరాబాద్‌లో గెలుపు తమదే అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఏదో ఒక పథకం ద్వారా వారు ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన వారే కనుక తమకు ఓటు వేస్తారని బలంగా నమ్ముతున్నారు. అందుకే YSRTP ట్రిక్కులు ఇక్కడ పనిచేయవని చెబుతున్నారు. బిజెపి దానిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ హుజూరాబాద్‌లో పోటీ చేయడానికి 20 మంది అభ్యర్థులు కూడా శర్మిల పార్టీకి దొరకరంటున్నారు టీఆర్‌ఎస్‌ నేతలు. ఏం జరుగుతుందో చూద్దాం ..ఇంకా టైం ఉందిగా నామినేషన్లకు.

-Advertisement-హుజురాబాద్ ఎన్నికలపై నిరుద్యోగుల ఎఫెక్ట్‌...

Related Articles

Latest Articles