నమస్తే ఇండియా అంటున్న హాలీవుడ్ హీరో!

ప్రపంచంలో అమెరికా తరువాత భారతదేశం సినిమాలను ఉత్పత్తి చేయడంలో మేటిగా నిలుస్తోంది. కొన్నిసార్లు అమెరికాతోనూ పోటీకి సై అంటోంది. ప్రస్తుతం మన ఇండియన్ మూవీస్ కు ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ చిత్రాలకు అమెరికాలో విశేషాదరణ లభిస్తోంది. అదే తీరున హాలీవుడ్ మూవీస్ కూడా మన దేశంలో పలు భారతీయ భాషల్లో అనువాదమై ఆదరణ సంపాదిస్తున్నాయి. అసలు సిసలు సినీ అభిమానులు భారతదేశంలో ఉన్నారన్న సత్యం ప్రపంచానికి బోధపడింది. అందువల్ల మన భారతీయులన ఆకర్షించడానికి, మన దేశాన్ని కీర్తిస్తూ సాగుతున్నారు పాశ్చాత్యులు. తాజాగా హాలీవుడ్ యంగ్ హీరో టామ్ హాలాండ్ తన కొత్త సినిమా ‘అన్ ఛార్టెడ్’ సినిమా ట్రైలర్ విడుదలలో ‘నమస్తే ఇండియా’ అంటూ మన సంస్కృతిని గౌరవిస్తూ నమస్కారం పెట్టడం విశేషంగా మారింది.

Read Also : వారం రోజుల్లో ‘ఎలిజిబుల్ బ్యాచిలర్’కు 40 కోట్లు!

పాతికేళ్ళ టామ్ హాలాండ్ అంటే ప్రస్తుతం అమెరికాలోని అందాల ముద్దుగుమ్మలు మనసు పారేసుకుంటున్నారు. “ది ఇంపాజిబుల్, కెప్టెన్ అమెరికా, స్పైడర్ మేన్” వంటి చిత్రాలతో టామ్ హాలాండ్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. అతని తాజా చిత్రం ‘అన్ చార్టెడ్’ 2017లోనే సెట్స్ కు వెళ్ళింది. కరోనా కారణంగా జనం ముందుకు రావడంలో ఆ సినిమా ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు 2022 ఫిబ్రవరి 18న ‘అన్ ఛార్టెడ్’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఈ సందర్భంగానే ‘అన్ ఛార్టెడ్’ ట్రైలర్ ను విడుదల చేస్తూ, ఆ ట్రైలర్ కు ముందు టామ్ హాలాండ్ తన సహ నటుడు మార్క్ వాల్ బెర్గ్ తో కలసి ‘నమస్తే ఇండియా’ అంటూ నమస్కరిస్తున్నాడు. ఈ సినిమా ఇంగ్లిష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

‘అన్ ఛార్టెడ్’ చిత్రంలో సోఫియా అలీ, తతి గాబ్రెయెల్లీ ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు ప్రపంచ ప్రఖ్యాత నటుడు ఆంటోనియో బెండరాస్ సైతం ఇందులో ఓ కీలక పాత్ర ధరించాడు. అందువల్ల ఈ సినిమాకు సర్వత్రా మంచి క్రేజ్ నెలకొంది. మన భారతీయ ప్రేక్షకులను ముందుగానే ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో భాగంగా టామ్ ‘నమస్తే ఇండియా’ అని వల్లించాడు. మరి ‘అన్ ఛార్టెడ్’ మన దేశంలో ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

Related Articles

Latest Articles