ఉద్ధవ్ థాక్రే ‘యూటర్న్’ తీసుకోబోతున్నారా?

మహారాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ఆయన యూటర్న్ తీసుకోబోతున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం శివసేన పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు మరోసారి మారుతాయనే ప్రచారం జోరందుకుంది. ఇందుకు తగ్గట్టుగానే ఉద్దవ్ థాక్రే వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు శివసేన, బీజేపీ మిత్రపక్షంగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో శివసేనకు ఎక్కువ స్థానాలు వచ్చాయి. అయితే బీజేపీ మాత్రం తక్కువ సీట్లు వచ్చిన శివసేనకు ముఖ్యమంత్రి పీఠం ఇచ్చేందుకు విముఖత చూపింది. దీంతో శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి మహారాష్ట్ర సీఎంగా ఆయన మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకోనున్నారు. ఇదేక్రమంలోనే ఆయన ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో విసుగు చెందారనే వార్తలు విన్పిస్తున్నాయి.

ఉద్దవ్ థాక్రే ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్ అనుమతి తప్పనిసరిగా మారింది. మరోవైపు కాంగ్రెస్ నాయకుల్లో వర్గపోరు ఆయనకు రుచించడం లేదట. దీంతో ఆయన ఈ కూటమితో ఎక్కువ కాలం కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. ఈమేరకు ఆయన ఆలోచనల్లో మార్పు వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. ఇటీవల సామ్నా పత్రికలో ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ కథనాలు రావడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు.

ఉద్దవ్ థాక్రే మళ్లీ బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పడానికి ఈ కథనాలనే సంకేతమని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శివసేన క్యాడర్ నుంచి సైతం ఆ దిశగా ఆయనపై ఒత్తడి వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి బీజేపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ కూటమికి అవకాశం లేకుండా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇక కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకున్న పార్టీలు ఎప్పుడు కూడా స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. ఆపార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుంది.

కర్ణాటకలోనూ జేడీఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ నేతల కుప్పిగంతుల కారణంగా అక్కడ సుస్థిర ప్రభుత్వం లేకుండా పోయింది. ఇప్పుడు మహారాష్ట్రలోనూ ఇదే కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీ రాజకీయాలకు విసిగిపోయిన ఉద్దవ్ థాక్రే తాజాగా బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి దీనిపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరీ ఆయన బీజేపీతో వెళుతారా? లేదో వేచిచూడాల్సిందే..!

-Advertisement-ఉద్ధవ్ థాక్రే ‘యూటర్న్’ తీసుకోబోతున్నారా?

Related Articles

Latest Articles