కొత్త హీరోల చిత్రమైన బాక్సాఫీస్ పోరు!

ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు కొత్త కథానాయకులను తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. విశేషం ఏమంటే ఈ ఇద్దరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులైన వారి వారసులే. అందులో ఒకరు కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మరొకరు ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్. గల్లా అశోక్ గుంటూరు టీడీపీ ఎం.పి. గల్లా జయదేవ్, కృష్ణ కుమార్తె పద్మావతి కుమారుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ పద్మావతి గల్లా, జయదేవ్ గల్లా ‘హీరో’ పేరుతో సినిమాను నిర్మించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ నెల 15న జనం ముందుకు వస్తోంది. అయితే… అశోక్ గల్లా సినిమా ప్రయాణం చాలా చిత్రంగా సాగింది. నిజానికి ‘దిల్’ రాజు అశోక్ ను హీరోగా మూడేళ్ళ క్రితమే పరిచయం చేయాలని అనుకున్నాడు. టర్కిష్ మూవీ ‘లవ్ లైక్స్ కోఇన్సిడెన్స్’ రీమేక్ హక్కులు కొని, రాజమౌళి శిష్యుడు కృష్ణారెడ్డి దర్శకత్వంలో ‘అదే నువ్వు – అదే నేను’ పేరుతో 2018 దసరా రోజు పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించాడు. కారణాలు ఏవైనా ఆ ప్రాజెక్ట్ ఆ తర్వాత ఆగిపోయింది. అందులో ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఒక కథానాయికగా నటించిన నభా నటేశ్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇప్పుడు జనం ముందుకు రాబోతున్న ‘హీరో’లో ‘ఇస్మార్ట్ శంకర్’లో నటించిన మరో భామ నిధి అగర్వాల్ హీరోయిన్!

ఇక ఆశిష్‌ రెడ్డి విషయానికి వస్తే… ‘దిల్’ రాజు తన సోదరుడు, సహ నిర్మాత శిరీష్ తనయుడు ఆశిష్ ను హీరోగా చేయాలని రెండు మూడేళ్ళ క్రితమే అనుకున్నాడు. రకరకాల కాంబినేషన్స్ సెట్ చేసి, చివరకు ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష చేతిలో పెట్టాడు. గత యేడాదిగా ఈ సినిమాను టైమ్ చూసి విడుదల చేయాలని చూస్తున్న ‘దిల్’ రాజు చివరకు హఠాత్తుగా సంక్రాంతి బరిలో ఆశిష్‌ ‘రౌడీ బాయ్స్’ను రిలీజ్ చేస్తున్నాడు. అనుపమా పరమేశ్వరన్ ఇందులో హీరోయిన్.

చిత్రం ఏమంటే… ‘దిల్’ రాజు పరిచయం చేయాల్సిన అశోక్ గల్లా ఇప్పుడు దిల్ రాజు సోదరుడు ఆశిష్ తో సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాడు. ‘రౌడీ బాయ్స్’ 14న వస్తుంటే, ‘హీరో’ 15న వస్తోంది. ఈ రెండు సినిమాలూ ఈ యువ హీరోలకు సొంత చిత్రాలే. వాళ్ళ ఓన్ బ్యానర్ లో నిర్మితమైనవే. సో…. ఈ ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుంది? జనం ఎవరివైపు మొగ్గు చూపుతారు? అనేది వేచి చూడాలి.

Related Articles

Latest Articles