గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్‌…?

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఎంపికలో మళ్లీ ట్విస్ట్‌ నెలకొందా? రోజులు గడుస్తున్నా ఈ అంశంపై ఉలుకు లేదు.. పలుకు లేదు. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ ఉత్కంఠ రేకెత్తించడంతో.. ఇప్పుడేం జరుగుతుందా అని టీఆర్‌ఎస్‌ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

మధుసూదనాచారి ఎమ్మెల్సీ ఫైల్‌పై కబురు లేదా?

గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ నియామకం తెలంగాణలో మళ్లీ చర్చగా మారుతోందా? గతంలో కేబినెట్‌ ఆమోదించి పంపిన కౌశిక్‌రెడ్డి ఫైల్‌ను అనుమానాల నివృత్తికోసం గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారు. సోషల్‌ సర్వీస్‌ కింద కౌశిక్‌రెడ్డి పేరును నాడు నామినేట్‌ చేసింది ప్రభుత్వం. అయితే మరికొంత స్టడీ చేయాల్సి ఉందని చెబుతూ ఆ ఫైల్‌ను పక్కన పెట్టారు గవర్నర్‌. ఇంతలో ఎమ్మెల్యే కోటాలో కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో పాత ప్రతిపాదనను విత్‌డ్రా చేసుకున్న సర్కార్‌.. గవర్నర్‌ కోటాలో కొత్తగా మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి పేరును కేబినెట్‌లో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించింది. ఆ ఫైల్‌ వెళ్లింది కానీ.. అక్కడిని కబురు లేదని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు.

గవర్నర్‌ దగ్గరే ఫైల్‌ పెండింగ్‌?

మధుసూదనాచారి పేరును నామినేట్‌ చేసి వారం అవుతున్నా ఇంకా అధికారికంగా గెజిట్‌ విడుదల కాలేదు. దాంతో మళ్లీ ఏమైంది అనే చర్చ జరుగుతోంది. కౌశిక్‌రెడ్డి ఫైల్‌ తరహాలోనే మాజీ స్పీకర్‌ ఫైల్‌పైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఫైల్‌ గవర్నర్‌ దగ్గరే పెండింగ్‌లో ఉందా? ఎక్కడ ఆగిపోయింది? అని పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయట.

ఎన్నికల కోడ్‌ కారణంగా గెజిట్‌ విడుదల కాలేదా?
కోడ్‌ ముగిశాక గెజిట్‌ విడుదలవుతుందా?

రాజ్‌భవన్‌ వర్గాల సమాచారం ప్రకారం.. మధుసూదనాచారి ఫైల్‌ను గవర్నర్‌ క్లియర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని టాక్‌. అయితే గెజిట్ విడుదల కాకపోవడంతో ప్రశ్నలు.. అనుమానాలు తెరపైకి వస్తున్నాయట. గెజిట్‌ విడుదల కాకపోవడానికి తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడే కారణమన్నది రాజ్‌భవన్‌ వర్గాల వాదన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ రాష్ట్రంలో అమలులో ఉంది. అందుకే ఎన్నికల కమిషన్‌ వివరణ కోసం ఫైల్‌ను పంపించారని తెలుస్తోంది. ఎన్నికల కమిషన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే గెజిట్‌ విడుదలవుతుందని టాక్‌. ఒకవేళ ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. ఎన్నికల కోడ్‌ ముగిశాక గెజిట్‌ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఈ విషయం తెలియక.. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్‌ను తలచుకుని కలవర పడుతున్నాయి పార్టీ వర్గాలు.

Related Articles

Latest Articles