‘విజయగర్జన’తో ప్రజల్లోకి వెళ్లనున్న టీఆర్ఎస్?

 టీఆర్ఎస్ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు ఆపార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. వచ్చే నెల 15న వరంగల్ శివారులో ‘విజయగర్జన’ పేరుతో టీఆర్ఎస్ భారీసభను ఏర్పాటు చేయనుందని తెలుస్తోంది. దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సన్నహాక సభను ఏర్పాటు చేసి విజయవంతం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈమేరకు ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ‘విజయగర్జన’ సభ మొదలు నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా టీఆర్ఎస్ ప్రజల్లోకి ఉండేలా ప్లాన్ చేస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది.

గత ఏడేళ్లుగా తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎదురులేకుండా పోయింది. వరుసగా టీఆర్ఎస్ రెండుసార్లు అధికారంలోకి రావడంతో సహజంగానే ప్రజల్లోకి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికితోడు కరోనా ఎంట్రీ తర్వాత టీఆర్ఎస్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన టీఆర్ఎస్ పార్టీనే జెట్ స్పీడుతో దూసుకెళుతోంది. అయితే ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక టీఆర్ఎస్ స్పీడుకు బ్రేక్ వేసింది. ఆ వెంటనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ సీట్లను సాధించింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం అనే ప్రచారం జరిగింది.

ఈ పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చేలా చేశాయి. దీనికితోడు కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యారు. తొలి నుంచి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేస్తూ పావులు కదుపుతున్నారు. ఇక పీసీసీ అయ్యాక ఆయన మరింత దూకుడు పెంచారు. ఈ రెండు పార్టీలు టీఆర్ఎస్ కు ధీటుగా మారుతుండటంతో గులాబీ బాస్ అలర్ట్ అవుతున్నారు. టీఆర్ఎస్ పై కొన్ని వర్గాల్లో ఉన్న వ్యతిరేకతను పారద్రోరేలా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏడేళ్లలో టీఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతోపాటు శ్రేణుల్లో జోష్ నింపేలా సీఎం కేసీఆర్ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

దీనిలో భాగంగానే వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ విజయగర్జన సభను నిర్వహించబోతుంది. ఈ వేదిక నుంచి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలను వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయంలో ఉన్న నేపథ్యంలో గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే కేసీఆర్ జిల్లాల పర్యటనలపై పార్టీలో చర్చ జరుగుతుంది. హుజూరాబాద్ ఉప ఎన్నికతో ప్రారంభం కానున్న కేసీఆర్ ప్రచారం ఆ తర్వాత కొనసాగేలా ఆపార్టీ ప్లాన్ చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా నేతలు ప్రజల్లో ఉండేలా టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్థులకు షాకిచ్చేందుకు రెడీ అవుతుందని సమాచారం.

Related Articles

Latest Articles