హైటెక్ లో ‘గులాబీ’ ధగధగలు.. ప్లీనరీకి సర్వం సిద్ధం..!

టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపేలా ఆపార్టీ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయి. కరోనా, ఇతరత్రా కారణాలతో గడిచిన మూడేళ్లుగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరుగలేదు. ఆ లోటును భర్తీ చేసేలా ఈసారి ప్లీనరీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ అధిష్టానం ప్లాన్ చేసింది. దీనిలో భాగంగానే భాగ్యనగరం గులాబీ మయంగా మారుతోంది. హైదరాబాద్ లోని హైటెక్స్ వేదిక ‘పింక్’ రంగు పులుముకుందా? అన్నట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ఆపార్టీ శ్రేణులు, నేతల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొందనే టాక్ విన్పిస్తోంది.

టీఆర్ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 25న ప్లీనరీ వేడుకలు జరుగున్నాయి. హైదరాబాద్లోని హైటెక్ వేదికగా జరిగే ఈ ప్లీనరీ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతోపాటు దాదాపు 6వేల మంది హాజరు కానున్నారు. ప్లీనరీ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్లీనరీకి వచ్చే టీఆర్ఎస్ నేతలంతా గులాబీ దుస్తులను ధరించి రావాలని మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా కోరడం ఆసక్తిని రేపుతోంది. ఇక ఈ ప్లీనరీ సమావేశాల్లో ఆపార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు.

టీఆర్ఎస్ అధ్యక్ష పదవీకి గతంలో మాదిరిగానే ఈసారి ఒకే ఒక నామినేషన్ దాఖలైంది. దీంతో పదోసారి కూడా కేసీఆరే ఆపార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం లాంఛనంగా కన్పిస్తోంది. ఇక ప్లీనరీలో ఏర్పాట్లలో భాగంగా హైదరాబాద్ రోడ్లన్నీ కేసీఆర్ కటౌట్లు, టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరించే ప్లెక్సీలతో దర్శనమిస్తున్నాయి. దీనిలో భాగంగానే ప్రముఖ శాండ్‌ ఆర్టిస్ట్‌ కాంత్‌ రిసా 20మీటర్ల వెడల్పు కాన్వాస్‌పై  ఇరవై ఏళ్ల టీఆర్‌ఎస్‌ ప్రస్థానాన్ని వివరిస్తూ చిత్రాలను గీయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ ప్లీనరీలో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే లక్ష్యంగా సరికొత్త ప్రయోగానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా కోట గుమ్మాన్ని తలపించేలా భారీ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల థీమ్‌లతో ఎల్‌ఈడీ ధగధగలు, కళ్లకు కట్టినట్లు చూపేలా వేలాది ఫొటోలతో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ జీవిత చరిత్రను చూపించనున్నారు. టీఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగే ప్లీనరీకి వచ్చేవారి కోసం ఆకట్టుకునే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ప్లీనరీకి హాజరయ్యే ఆరువేల మంది కోసం దాదాపు 29 రకాల ప్రత్యేక వంటకాలను సిద్ధం చేయనున్నారని సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ ఏర్పాట్లు చూస్తుంటే యావత్ భాగ్యనగరం గులాబీమయంగా మారిపోవడం ఖాయంగా కన్పిస్తోంది.

Related Articles

Latest Articles