వనమా కుటుంబంపై వరస వివాదాలు

వరస వివాదాలతో ఆ సీనియర్ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్‌కు చీకట్లు అలముకున్నాయా? పరిణామాలు అనూహ్యంగా మారిపోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో కుటుంబ సభ్యులకూ టికెట్‌ కష్టమేనా? గేర్‌ మార్చడానికి సిద్ధంగా ఉన్నది ఎవరు? ఆందోళన చెందుతున్నదెవరు? లెట్స్‌ వాచ్‌..!

వనమా కుటుంబానికి రాజకీయ చీకట్లు..!
వనమా వెంకటేశ్వరరావు. నాలుగుసార్లు ఎమ్మెల్యే. ఒకసారి మంత్రి. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు 18 ఏళ్లపాటు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వనమా.. ప్రస్తుతం అధికార టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు. వయసు పైబడుతున్న తరుణంలో రాజకీయంగా తన ఇద్దరు కుమారుల్లో ఒకరిని వారసుడిగా ప్రకటించేందుకు వనమా చేయని ప్రయత్నం లేదు. ఈ విషయంలో ఆయన ఒకటి తలిస్తే.. వనమా కుమారులను ముసురుకుంటోన్న వివాదాలు మరొకటి. దీంతో రానున్న రోజుల్లో వనమా కుటుంబానికి రాజకీయ వేదికపై చోటు కష్టమేనని చర్చ జరుగుతోంది.

వనమా రాఘవ తీరుపై టీఆర్ఎస్‌ పెద్దలకు ఫిర్యాదులు..!
వనమా వెంకటేశ్వరరావును అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుండటంతో ఆయన కుమారుడు వనమా రాఘవేంద్ర షాడో ఎమ్మెల్యేగా మారినట్టు విమర్శలు ఉన్నాయి. దీంతో రాఘవ తీరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతోపాటు టీఆర్‌ఎస్‌కూ ఇబ్బందిగా మారినట్టు కొత్తగూడెంలో వినిపిస్తున్న టాక్‌. గత ఆరు నెలల కాలంలోనే రెండు కేసులు రాఘవేంద్రపై నమోదయ్యాయి. వీటికితోడు భూ తగాదాలు.. ఆర్థిక లావాదేవీలలో రాఘవ పాత్ర తరచూ వినిపిస్తుంది. వీటిల్లో కొన్ని పంచాయితీలు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం వరకు వెళ్లినట్టు చెబుతారు. తండ్రి ఎమ్మెల్యేగా ఉండటంతో నియోజకవర్గంలోని పోలీసులు, రెవెన్యూ అధికారులను రాఘవేంద్ర గుప్పిట్లో పెట్టుకున్నారని ప్రగతి భవన్‌కు ఫిర్యాదులు వెళ్లాయట. తాజాగా ఒక కుటుంబం ఆత్మహత్యలో రాఘవ పాత్రపై వస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.

రాజకీయంగా సమాధేనని చర్చ..!
ఈ కేసులు.. వివాదాలు.. వనమా కుటుంబానికి ఇక్కట్లు తెచ్చిపెట్టేవేనని జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్న మాట. చివరకు ఇవే సంఘటనలు వనమా కుటుంబానికి రాజకీయంగా సమాధి అవుతాయనే చర్చ మొదలైంది. ఆరు నెలల క్రితం వెంకటేశ్వర్లు.. ఇప్పుడు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలపై టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్టు చెబుతున్నారు. వనమా కుటుంబం నుంచి వెళ్తున్న ఫోన్లను పార్టీ పెద్దలు రిసీవ్‌ చేసుకోవడం లేదట.

2018లో తన చివరి ఎన్నికలని వనమా ప్రచారం..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం నియోజకవర్గానికి రాజకీయంగా ప్రత్యేకం స్థానం ఉంది. 2014లో జిల్లాలో టీఆర్ఎస్‌ ఈ ఒక్క నియోజకవర్గంలోనే గెలిచింది. 2018లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఓడిపోవడం.. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి వనమా వెంకటేశ్వరరావు గెలిచారు. తర్వాత వనమా టీఆర్‌ఎస్‌లోకి రావడంతో బ్యాలెన్స్‌ అయిందని అనుకున్నారు. కానీ.. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి.

గత ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని వనమా జనాల్లోకి వెళ్లడంతో అది సెంటిమెంట్‌గా వర్కవుట్‌ అయింది. మరోసారి వనమా పోటీచేసేది లేదు. వనమా కుమారుడు రాఘవ బరిలో దిగుతారని అనుకున్నారంతా. ఇంతలో పరిస్థితులు మారిపోయాయి. కొత్తగూడెం టీఆర్‌ఎస్‌లో మళ్లీ జలగం వెంకట్రావు శకం ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. వనమా కుటుంబానికి రాజకీయంగా చీకట్లు ముసురుకున్నట్టేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

Latest Articles