విజయగర్జన సభ ఏర్పాట్లలో టీఆర్ఎస్‌..!

రాజకీయాల్లో గెలుపు కీలకం. లేదా చేతిలో ఏదైనా పదవి ఉండాలి. అవేమీ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం టీఆర్ఎస్‌లో అలాంటి నాయకుల పరిస్థితి దుర్భరంగా మారిందట. ఒకప్పుడు వెలుగు వెలిగినా.. ఒకే ఒక్క ఓటమి పొలిటికల్ స్క్రీన్‌పై లేకుండా చేసేసింది. పార్టీ కార్యక్రమాల్లోనూ వారి పాత్ర లేకుండా పోయిందా?

సన్నాహక సమావేశాల్లో కనిపించని ఓడిన ముఖ్య నేతలు..!

టీఆర్ఎస్‌ ప్రయాణం ప్రారంభమై 20 ఏళ్లు. ఈ సందర్భంగా భారీ శక్తి ప్రదర్శనకు సిద్ధమవుతోంది పార్టీ. ముందుగా ప్రజాప్రతినిధుల సభ.. ఆ తర్వాత తెలంగాణ విజయగర్జనకు ముహూర్తాలు ఫిక్స్‌ అయ్యాయి. ఈ కార్యక్రమాల కోసం తెలంగాణ భవన్‌లో గత కొన్నిరోజులుగా వరసగా సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ భేటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో ఒక్కటే సందడి. ఈ మీటింగ్స్‌కు టీఆర్ఎస్‌ మండల అధ్యక్షులు, పార్టీ తరఫున ఎన్నికైన ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేషన్‌ ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను పిలుస్తున్నారు. వీరంతా వస్తున్నారు సరే.. ఈ సన్నాహక సమావేశాల్లో గత ఎన్నికల్లో ఓడిన ముఖ్యనేతలు మాత్రం కనిపించడం లేదు. అదే ఇప్పుడు పార్టీలో చర్చగా మారింది.

ఎన్నికల్లో ఓడి.. చేతిలో పదవిలేని వారికి ప్రాధాన్యం లేదా?

2018 అసెంబ్లీ ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, అప్పటి స్పీకర్‌ మధుసూదనాచారితోపాటు పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నారు కొందరు. మరికొందరికి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరించినా పార్టీని వీడలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన 13 మంది.. టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. అధికారపార్టీలో నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలే సుప్రీం. దీంతో ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలే నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తున్నారు. ఓడిన వారికి ప్రాధాన్యం లేకుండా పోయింది. వీరిలో కొందరికి ఇతరత్రా పదవులతో సర్దుబాటు చేసినా.. కీలకంగా భావిస్తున్న ముఖ్యనేతలు మాత్రం చేతిలో ఏ పదవీ లేకుండా ఉండిపోయారు. జూపల్లి, తుమ్మల, మధుసూధనాచారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం వెంకట్రావు, వేముల వీరేశం తదితరులు ఈ కోవలోకే వస్తారు.

మీటింగ్స్‌కు ఎందుకు పిలవడం లేదని ఆరా..!

ప్రస్తుతం తెలంగాణ భవన్‌లో నిర్వహిస్తున్న నియోజకవర్గాల వారీ సమావేశాల్లో వీరికి ఆహ్వానాలు లేవు. ఎందుకు పిలవలేదు అని కొందరు.. పిలవాలి కదా అని అనుచరులు ప్రశ్నిస్తున్నారట. ఎన్నికల్లో ఓడినా.. పార్టీలో చురుకైన పాత్ర పోషిస్తున్నప్పుడు టీఆర్ఎస్‌ సమావేశాలకు పిలవాలి కదా అన్నది వారి అభిప్రాయమట. మున్సిపాలిటీ, పంచాయతీ, పరిషత్‌, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేసినా గుర్తింపు లేదా అని అనుచరుల దగ్గర చెప్పి వాపోతున్నారట. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఓ సందర్భంలో ఓపెన్‌ అయిపోయారు. తమను పార్టీ ఉపయోగించుకోవడం లేదని ఓ సభలో కామెంట్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌లో ఉన్నట్టు గుర్తిస్తున్నారా.. లేదా అని ప్రశ్న..!

టీఆర్‌ఎస్‌ 20 ఏళ్ల ప్రయాణం సందర్భంగా నవంబర్‌ 15న వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభను పెద్ద ఎత్తు నిర్వహించే పనుల్లో ఉన్నారు. ఈ కార్యక్రమాలకు కేవలం గెలిచిన ప్రజాప్రతినిధులపైనే నమ్మకం ఉంచి.. ఓడిన ముఖ్య నాయకులను దూరం పెట్టడంతో క్షేత్రస్థాయిలో గుసగుసలు ఎక్కువయ్యాయట. అసలు పార్టీలో ఉన్నట్టు గుర్తిస్తున్నారో లేదో అని అనుచరులు అనుమానిస్తున్నారట. ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇచ్చి.. పొమ్మనలేక పొగబెడుతున్నారా అని ఇంకొందరు సందేహిస్తున్నారట. ప్రజాప్రతినిధులతో భేటీలు ముగిసిన తర్వాత పార్టీలో ముఖ్యనేతలు, ఓడినవారిని పిలిచి మాట్లాడతారో లేదో కానీ.. ఇప్పటికైతే కీలక నేతలు సందేహాలు.. ప్రశ్నలతో కాలం వెళ్లదీస్తున్నారు. మరి.. పార్టీ ఆలోచన ఏంటో చూడాలి.

Related Articles

Latest Articles