దళితేతర ఓటర్లకు టీఆర్‌ఎస్‌ గాలం..

హుజురాబాద్ ఉప ఎన్నికల సీఎం కేసీఆర్‌ ప్రతిష్టకు సవాలుగా మారింది. అలాగే ఈటెల రాజేందర్‌కు కూడా ఇది అగ్నిపరీక్ష. దాంతో ఇక్కడ ఎవరు జెండా ఎగరేస్తారన్నది ఆసక్తిగా మారింది. గులాబీదళం.. కమలదళం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధికార పార్టీ నియోజకవర్గాన్ని నిధులతో ముంచెత్తుతోంది. కోట్ల వ్యయంతో దళితబంధు ప్రోగ్రామ్‌ తెచ్చింది. అలా దళిత ఓటర్లకు దగ్గరవుతుంది. అందులో అనుమానం లేదు. ఇక ఈటెల బీసీ వర్గానికి చెందిన వారు కాబట్టి..టీఆర్‌ఎస్‌ కూడా యాదవ కులస్తుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ని బరిలో దించింది. ఇక కాంగ్రెస్‌ నుంచి వెలమ సామాజిక వర్గానికి చెందిన బల్మూరి వెంకట్‌ పేరు ఖాయమైనట్టు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ విషయమే చూస్తే…మొదటి నుంచీ చాలా ప్లాన్‌గా ముందుకు వెళుతున్నారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలకు తనదైన శైలిలో గాలం వేస్తోంది. ఈ నియోజకవర్గంంలో దాదాపు 40 వేలకు పైగా దళిత ఓటరులున్నారు. దళిత బంధు స్కీంతో వారిని కట్టిపడేసింది. ఇక మిగిలింది బీసీలు.

నియోజకవర్గంలో రెండు లక్షల 36 వేల ఓట్లున్నాయి. వారిలో లక్షా 30 వేల ఓట్లు బీసీలకు చెందినవే. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునే పనిలో పడింది. భవిష్యత్‌లో బీసీలకు బీసీ బంధు పథకం తెస్తామంటూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. రెడ్డి , బ్రాహ్మణ, వెలమ సామాజిక వర్గాలకు చెందిన నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు బీసీ వర్గాలైన మున్నూరు కాపు, పద్మశాలి,గౌడ,ముదిరాజ్, యాదవ, రజకులతో వేరు వేరుగా సమావేశాలు పెట్టి వారి మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీసీ మంత్రులు గంగుల కమలాకర్‌, వీ.శ్రీనివాస్‌ యాదవ్‌, జి.జగదీశ్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి తదితరులు ప్రచారంలో భాగంగా ఆయా కుల నాయకులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక ఎస్టీకి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్‌ , అలాగే మైనార్టీకి చెందిన మంత్రి మహమూద్‌ అలీ తమ తమ సామాజిక వర్గాలతో సమావేశాలు నిర్వహించాలరని పార్టీ ఆదేశించింది. హుజూరాబాద్‌లో 4,220 మంది ఎస్టీ ఓటర్లు, ఐదు వేల ఒక వంద మైనార్టీ ఓటర్లు ఉన్నారు.

దళిత బంధు వల్ల దళితుల సంపూర్ణ మద్దతు లభిస్తుందని టిఆర్ఎస్ విశ్వసిస్తోంది. దళిత బంధు తరహా ప్రయోజనాన్ని ఇతర కులాలకు విస్తరించలేదనే ప్రచారంతో దళితేతరులను ఏకం చేయటానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. నియోజకవర్గంలో 46,700 మంది దళిత ఓటర్లు ఉన్నారు, వీరిలో మాదిగలు 35,600, మాలలు 11 వేల 100 మంది ఉన్నారు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో దాదాపు 21 వేల దళిత కుటుంబాలు ఉన్నాయి. టీఆర్ఎస్‌కు అనుకూలంగా దళితులు మూకుమ్మడిగా ఓటు వేస్తారని పార్టీ నాయకత్వం గట్టిగా నమ్ముతోంది.ఈ కుటుంబాలన్నీ దళిత బంధు కిందకు రావటమే ఆ నమ్మకానికి కారణం. వీరి కోసం ప్రభుత్వం ఇటీవల వారి బ్యాంకు ఖాతాలకు 10 లక్షల చొప్పున 2,000 కోట్లు బదిలీ చేసింది. దీనితో, టీఆర్ఎస్ ఇప్పుడు నియోజకవర్గంలోని ప్రధాన ఓటర్లను కలిగి ఉన్న ఇతర కులాలపై దృష్టి పెట్టింది. OC లలో రెడ్డి ఓటర్లు 22 వేల 600, బ్రాహ్మణులు, వెలమలు ఇతరులు కలిసి 12 వేల 150 మంది ఓటర్లు ఉన్నారు.

ఈ ఓట్లను తమ వలలో వేసుకునేందుకు టీఆర్ఎస్ రెడ్డి నాయకులను రంగంలోకి దించింది. నియోజకవర్గాల్లో రెడ్డి కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణానికి మంత్రులు ఇటీవల పునాది వేశారు,. దీనికి రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా సెప్టెంబర్ 25 న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించారు. ఇందులో టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రశంసించారు. ఐతే, రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ రాజకీయ కార్యకలాపాలలో ఎలా పాల్గొంటారని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. అయితే, తాను స్పీకర్‌గా కాకుండా “రెడ్డి” గా వచ్చానని పోచారం తనను తాను సమర్థించుకున్నారు. ఏదేమైనా ఇప్పుడు హుజూరాబాద్‌లో ఓటర్లకు గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది అధికార పార్టీ. దాని ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి!!

-Advertisement-దళితేతర ఓటర్లకు టీఆర్‌ఎస్‌ గాలం..

Related Articles

Latest Articles