టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ !

ఎంకిపెళ్లి సుబ్బిచావుకు రావడం అంటే ఇదే. ఏదో ఆశించి ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తే.. అది అధికారపార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను ఇరకాటంలో పడేసిందట. ‘రాజీనామా చేయండి సార్‌..!’ అంటూ.. సోషల్‌ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్‌తో శాసనసభ్యులకు తలబొప్పి కడుతోందట. అదేంటో లెట్స్‌ వాచ్‌!

హుజురాబాద్‌లో దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు

దళితుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ స్కీమ్‌పై వివిధ వర్గాలతో సమాలోచనలు చేశారు సీఎం కేసీఆర్‌. పథకాన్ని పట్టాలెక్కించే పనిలో ఉన్నారు. హుజురాబాద్‌ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా చేపట్టబోతున్నట్టు ప్రకటించారు. ఆ నియోజకవర్గానికి చెందిన వారితో భేటీ నిర్వహించి.. పథకంపై వారికి అవగాహన కల్పించారు ముఖ్యమంత్రి. రోజంతా వారితో చర్చించి.. దళితబంధు అమలు విధానం.. లక్ష్యాలు.. ఫలితాలు ఎలా రాబట్టుకోవాలో వెల్లడించారట. ఒక్కో లబ్ధిదారుడికీ ఈ స్కీమ్‌ కింద 10 లక్షలు అందజేస్తారు.

రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యేలపై పోస్టింగ్‌లు
ఉపఎన్నిక వస్తే నిధులు వస్తాయని సెటైర్లు

ఇంత వరకు బాగానే ఉన్న.. అధికారపార్టీలోని ఎమ్మెల్యేలను ఈ స్కీమ్‌ టెన్షన్‌ పెట్టిస్తోందట.
హుజురాబాద్‌ ఉపఎన్నిక వల్లే నిధులు… స్కీమ్‌లు అంటూ రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతుండటంతో నియోజకవర్గాల్లోని స్వపక్షీయులు.. వైరిపక్షాలకు చెందిన వారు తమ ఎమ్మెల్యేలను సోషల్‌ మీడియాలో ఏకి పాడేస్తున్నారు. ఎమ్మెల్యే గారూ.. మీరు రాజీనామా చేయండి. ఉప ఎన్నిక వస్తుంది. నియోజకవర్గానికి కోట్ల రూపాయల నిధులు వస్తాయి. బై ఎలక్షన్‌లో మళ్లీ మీరే గెలిచేలా ఓట్లు వేస్తాం.. అంటూ సామాజిక మాధ్యమాల్లో శాసనసభ్యులను ట్యాగ్‌ చేస్తూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. రాజీనామా చేయండి సార్‌ అని సెటైర్లూ వేస్తున్నారు. తెలంగాణలోని సోషల్‌ మీడియా వేదికలపై గత నాలుగైదు రోజులుగా ఇదే చర్చ.

ఎవరు మొదలుపెట్టారో కానీ.. రాష్ట్రమంతా ఒక్కటే చర్చ

టీఆర్‌ఎస్‌కే చెందిన వారు తమ ఎమ్మెల్యేలను ట్యాగ్‌ చేస్తూ పెడుతున్న పోస్టింగ్‌లు కాస్త గౌరవప్రదంగా ఉంటే.. విపక్ష పార్టీలకు చెందిన వారు పెడుతున్న పోస్ట్‌లు ఓ రేంజ్‌లో ఉంటున్నాయి. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఎవరు.. ఎక్కడ మొదలుపెట్టారో కానీ.. అధికారపార్టీ ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయట. ప్రస్తుతం హుజురాబాద్‌ ఉపఎన్నిక ఉండటంతో ఈ ప్రచారానికి ఎక్కడలేని ప్రాధాన్యం లభిస్తోంది. ఎవరిని కదిపినా ఇదే చర్చ. ఈ పోస్టింగ్‌లను కొందరు శాసనసభ్యులు లైట్‌ తీసుకుంటున్నారట. అరే.. మనపై కూడా జోకులు వేస్తున్నారుగా అని నవ్వు కుంటున్నారట. కానీ.. సీరియస్‌గా భావిస్తున్న వారు మాత్రం ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాల టాక్‌.

Related Articles

Latest Articles

-Advertisement-