ప్రముఖ దర్శకుడు, స్వర్గీయ కె. బాలచందర్ భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించుకున్నారు. 2014 డిసెంబర్ లో ఆయన కన్నుమూసినా, వారి సినిమాలు, టీవీ సీరియల్స్ చూస్తూ, అభిమానులు నిత్యం స్మరించుకుంటూనే ఉన్నారు. బాధాకరం ఏమంటే… బాలచందర్ మరణానికి నాలుగైదు నెలల ముందు ఆయన కుమారుడు బాల కైలాసం కన్నుమూశారు. బహుశా ఆ దిగులుతోనే బాలచందర్ కూడా చనిపోయి ఉండొచ్చు. బాలచందర్ జీవించి ఉన్నపుడు ఆయన సొంత బ్యానర్ లో నిర్మించిన సీరియల్స్, సినిమాల నిర్మాణ వ్యవహారాలను కోడలు గీత పర్యవేక్షిస్తుండేవారు. సి. ఎ. చదివిన ఆవిడ మామగారికి చిత్ర నిర్మాణంలో సహకరిస్తుండేది.
Read Also : బాలయ్య కోసం తమన్ మ్యూజిక్ సెషన్ స్టార్ట్
చిన్నప్పటి నుండి నటన మీద మక్కువ ఉన్న గీతా కైలాసం ఎప్పుడూ ఆ విషయాన్ని తన మావగారు బాలచందర్ కు చెప్పలేదట. కాకపోతే, ఇప్పుడు ఆ కోరికను తీర్చుకుంటోంది. భర్త మరణానంతరం రంగస్థలంలోకి అడుగుపెట్టిన గీత మొదట ‘కత్తిల్’ చిత్రంలో హీరో తల్లి పాత్రను పోషించింది. గణేశ్ బాబు హీరోగా నటించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కాగా… తాజాగా విడుదలైన ‘సార్పట్ట పరంపర’ చిత్రంలోనూ గీతా కైలాసం నటించింది. ప్రముఖ నటుడు పశుపతి ఈ సినిమాలో హీరో ఆర్యకు గురువుగా నటించారు. ఆయన భార్య పాత్రను చిత్ర పోషించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కు పెద్దంత స్కోప్ లేకపోయినా… తెర మీద కనిపించే రెండు, మూడు సన్నివేశాలలోనూ సహజ నటన ప్రదర్శించింది గీత. మరీ రొటీన్ క్యారెక్టర్స్ కాకుండా ఛాలెంజ్ పాత్రలు వస్తే పోషించి, నటిగా సత్తా చాటాలనుకుంటున్నట్టు గీత తెలిపింది. ఆమెలో మంచి రచయిత్రి కూడా ఉంది. ఇప్పటికే కొన్ని కవితలు, నాటకాలు రాసిన అనుభవాన్ని గీతా కైలాసం కైవసం చేసుకోవడం విశేషం.