సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందింది. అంతా స్మార్ట్ ఫోన్లతో రకరకాల యాప్‌లతో బిజీగా మారిపోయారు. సైబర్ స్కాంలు కూడా బాగా పెరిగిపోయాయి. ఈజీమనీకి అలవాటుపడ్డ వారు వివిధ రకాల మెసేజ్‌లతో బురిడీ కొట్టిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకోవడంతో పాటు టెక్నాలజీ పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉన్నా తగిన మూల్యం చెల్లించక తప్పదని గ్రహించాలి.
మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్ స్కాంలు చేసేవారు కూడా బాగా అప్ డేట్ అవుతూ వలపన్ని మోసాలకు పాల్పడుతున్న రోజులివి. వాట్సాప్ వేదికగా జరుగుతున్న ‘ఫ్రెండ్ ఇన్ నీడ్’ అనే స్కామ్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. మనకు తెలిసిన వాళ్ల నంబర్ల నుంచి సందేశాలు పంపుతూ ఎక్కడో ఇరుక్కుపోయామని, లేదా తామే కష్టాల్లో ఉన్నామని నమ్మబలికి డబ్బులు లాగేస్తున్నారు. డబ్బు మాత్రమే కాకుండా కొన్ని సున్నితమైన వివరాలను కూడా సేకరించి మనల్ని నిలువునా ముంచేయడానికి స్కెచ్చేశారు సైబర్ నేరగాళ్ళు.
వాట్సాప్ ద్వారా అత్యంత సులభంగా సందేశాలు పంపుకునే అవకాశం వుంది. అలాగే త్వరగా మోసపోయేందుకు కూడా వీలుంది. స్కామర్లు వాట్సాప్ బాగా వుపయోగించేవారిని టార్గెట్ చేస్తున్నారు. బ్రిటన్‌కు చెందిన ఓ మహిళ తన కుమారుడి ఫోన్ నుంచి డబ్బులు కావాలంటూ సందేశం వచ్చింది. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా అడిగిన మొత్తం పంపేసింది. తీరా చూస్తే ఆ సందేశం పంపింది తన కొడుకు కాదని, తాను మోసపోయానని గ్రహించింది. బ్రిటన్‌లో ఈ తరహా మోసాలు బాగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలిసిన వారి నుంచి డబ్బులు కావాలనే సందేశాలతో పాటు, ఇతర వ్యక్తిగత వివరాలు కూడా స్కామర్లు అడిగితే అప్రమత్తంగా వుండాలి. అడిగారు కదా తక్కువ మొత్తమే కదా అని మీరు డబ్బులు పంపితే మీ అకౌంట్ బ్యాలెన్స్ కరిగిపోతుంది. స్కామర్ల పంట పండుతుంది. తస్మాత్ జాగ్రత్త!