ప్రస్తుతం నందమూరి నటసింహాం బాలకృష్ణ ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీనుతో బాలకృష్ణ చేస్తున్న మూడో సినిమా ఇది. దీని తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు బాలకృష్ణ. వాస్తవ సంఘటన ఆధారంగా రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని తర్వాత అంటే తన 108వ చిత్రాన్ని బాలకృష్ణ ఎవరితో చేస్తాడనే ప్రశ్న ఒకటి ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే బాలకృష్ణ ఇప్పటికే ముగ్గురు నలుగురు దర్శకులతో సినిమాలు చేయడానికి కమిట్ అయ్యారు. అందులో బాలకృష్ణతో ‘పైసావసూల్’ చేసిన పూరి జగన్నాథ్ కూడా ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం తన 108వ చిత్రాన్ని అప్రతిహత విజయాలతో సాగిపోతున్న అనిల్ రావిపూడితోనే చేయబోతున్నారన్నది తాజా సమాచారం.
Read Also : పవన్, రానా మూవీ షూటింగ్ రీస్టార్ట్
నిజానికి బాలకృష్ణకు అనిల్ రావిపూడి గతంలోనే ఓ కథ చెప్పి ఒప్పించారు. దానికి ‘రామారావు గారు’ అనే టైటిల్ కూడా అనుకున్నారు. కానీ అనుకున్న సమయంలో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కకపోవడంతో… ఇప్పుడు ఆ టైటిల్ ను రవితేజ హైజాక్ చేసేశారు. తన కొత్త సినిమాకు రవితేజ ‘రామారావు’ అనే టైటిల్, ‘ఆన్ డ్యూటీ’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు. ఈ చిత్రానికి రవితేజ నిర్మాణ భాగస్వామి కూడా కావడం విశేషం. ఇక… బాలకృష్ణ సినిమాల వరుస విషయానికి వస్తే… అనిల్ రావిపూడి సినిమా తర్వాత పూరి జగన్నాథ్ తో మూవీ ఉంటుందని, ఆ తర్వాతే తన కొడుకు హీరోగా, బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తూ ‘ఆదిత్య 369’కు సీక్వెల్ చేస్తారని సమాచారం. మరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి ఫస్ట్ కాంబినేషన్ సెట్స్ పైకి వెళితే మాత్రం ఆ బజ్ మామూలుగా ఉండదు.