చెట్ల మీద ప్రయాణం…

ప్రకృతిని చూసి పరవశించన వాళ్లుంటారా? పచ్చని ప్రకృతిలో కాసేపు సేదతీరినా మనసుకు ఎంతో హాయిగా ..ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి నేచర్‌లో ..అందునా చెట్ల పైన ఏర్పాటు చేసిన దారిలో నడుచుకుంటూ వెళితే ఎలా వుంటుంది? అసలు అలాంటివి ఉంటాయా అంటే…ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లోని అటవీ ప్రాంతంలో ప్రపంచంలోనే పొడవైన ట్రీ టాప్‌ వే ఏర్పాటు చేశారు. అది పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ట్రీ టాప్‌వే అంటే చెట్ల పైనుంచి దారి. ఇది స్విట్జర్లాండ్‌లోని పేరు సెండా డిల్‌ డ్రాగున్‌. అంటే డ్రాగున్‌ కు దారి అని అర్థం. ఈ ట్రీటాప్‌వే పొడవు 1.5 కిలో మీటర్లు. రెండు గ్రామాలను కలుపుతుంది. పర్యాటకుల కోసం గత జులైలో దీనిని ప్రారంభించారు. ఈ పొడవైన నడక మార్గం లాక్స్ ముర్షెట్గ్, లాక్స్ డోర్ఫ్ అనే గ్రామాలను కలుపుతుంది. రెండు యాక్సెస్‌ టవర్స్‌ నుంచి పర్యాటకులు ఈ దారిలోకి ప్రవేశించవచ్చు. అక్కడి నుంచి అడవి పైభాగం నుంచి నడిచి వెళ్లవచ్చు. అంత ఎత్తు నుంచి ప్రకృతి అందాలను తిలకిస్తూ ప్రయాణిస్తారన్న మాట.

ఈ దారిలో మొత్తం నాలుగు ఫ్లాట్‌ఫామ్స్‌ ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌ ఫామ్‌ దగ్గర అడవికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. అందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. దారి మధ్య మధ్యలో ఆగుతూ ఈ అడవి గురించి తెలుసుకుంటూ సాగిపోవచ్చు. అడవిలోని పక్షులు, జంతువుల ప్రత్యేకతలను తెలుసుకోవచ్చు. కాంస్య యుగం నుండి ఇక్కడ నివసిస్తున్న మనుషుల గురించి కూడా తెలుసుకునే ఏర్పాటు వుంది.

చుట్టూ పచ్చదనం ఆవరించి ఉంటే సుందర దృశ్యం ఈ ట్రీ టాప్‌వే. అక్కడికి వెళితే ప్రకృతి ప్రేమికులకు పండగే. స్విట్జర్లాండ్ లోని అత్యుత్తమ సహజ ప్రకృతి దృశ్యాలలో ఇప్పుడు ఇదీ ఒకటి. ప్రపంచంలోనే పొడవైన ట్రీటాప్‌వే నుంచి కునుచూపు మేరలో అడవి అంతా కనిపిస్తుంది.ఈ దారిలో వెళ్లటానికి టికెట్‌ ధర పెద్దలకు 1,291 రూపాయలు..పిల్లలకైతే 645 రూపాయలు. గత మూడు నెలల్లో ఇప్పటి వరకు 45 వేల మంది ప్రయాణీలు ఈ చెట్లపై దారిలో ప్రయాణించారు.
ట్రీటాప్‌వే లతో పాటు ట్రీటాప్‌ రిసార్ట్స్‌ కూడా నేచర్‌ లవర్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తున్నాయి. అమెరికా, యూరప్‌తో పాటు మన దేశంలో కూడా ఈ ట్రెండ్‌ నడుస్తోంది. టాప్‌ ట్రీ హోటల్స్‌ టూరిస్టులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముంబయికి సమీపంలోని లోనావాలాలో ఇలాంటి రిసార్ట్స్‌ని చూడొచ్చు. ముంబయి నుంచి రెండున్నర గంటల ప్రయాణం. అక్కడి పశ్చిమ ఘాట్ పర్వత ప్రాంతంలో దట్టమైన అడవిలో ట్రీటాప్‌ రిసార్టులు ఉన్నాయి. అతిధులను ఎంతో ఆకర్షిస్తుంది. వారాంతాలలో ముంబై నుంచి ఇక్కడకు పెద్ద సంఖ్యలో విహారానికి వస్తారు.

రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని ట్రీ హౌస్ రిసార్ట్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది సిరి వ్యాలీ నేచర్ ఫామ్స్ వద్ద ఉంది. కేరళలో కూడా ఇలాంటి రిసార్ట్స్‌ చూడొచ్చు. అలాగే హిమాచల్‌ ప్రదేశ్ లోని సిమ్లా పరిసర ప్రాంతాల్లో కూడా వీటిని చూడవచ్చు. అలాగే మనాలీ ట్రీహౌస్‌ కాటేజెస్ కూడా టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తాయి. దేశ వ్యాప్తంగా ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

వాస్తవానికి చెట్లపై ఆవాసం ఇప్పటిది కాదు. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పడు ఇవి మనకు ఫ్యాన్సీ ..కానీ అప్పటి వారికి ఓ అవసరం. ముఖ్యంగా కొన్ని జంతువుల నుంచి ప్రమాదాలను తప్పించుకునేందుకు చెట్లపై ఇళ్లు కట్టుకునేవారు. అయితే ఇప్పటికీ కొన్ని అటవిక జాతులు చెట్ల మీదే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారంటే ఆశ్యర్యం కలుగుతుంది. న్యూగినియాలోని కోరోవోయ్‌ జాతి అలాంటిదే.

1990ల నుంచి అమెరికా, యూరప్‌ దేశాలలో ట్రీహౌస్‌లకు ఆదరణ మొదలైంది. వాటి ద్వారా మంచి మంచి ఆదాయం వస్తోంది. దాంతో నిర్వాహకులు సదుపాయాలు అందిస్తినున్నారు. సోషల్‌ మీడియా చానెల్స్ , వెబ్‌సైట్స్‌, టీవీ చానెల్స్‌ ద్వారా వాటికి విపరీతమైన ప్రచారం వచ్చింది. వాటికి ఆదరణ పెరగటానికి ఇది కూడా ఒక కారణమే.

Related Articles

Latest Articles

-Advertisement-