గుప్తనిధుల తవ్వకాలు అనంతం.. చారిత్రక ఆనవాళ్ళు మాయం

ఈజీ మనీ కోసం కొందరు వ్యక్తులు.. పురాతన కట్టడాలను, చారిత్రక సంపదను ధ్వంసం చేస్తున్నారు. రాజుల కాలం నాటి కట్టడాలు కింద.. నిధులు ఉన్నాయన్న నమ్మకంతో వాటిని సర్వ నాశనం చేస్తున్నారు. ఎన్నో చారిత్రక కట్టడాలకు నిలయమైన అనంతలో చారిత్రక సంపద ధ్వంసమవుతోంది. చివరికి లేపాక్షి క్షేత్రాన్ని కూడా వదలకుండా ధ్వంసం చేస్తుంటే, అధికార యంత్రాంగం ఏం చేస్తోందని పురావస్తు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

అనంతపురం జిల్లా పేరుకి కరువు ప్రాంతమైనప్పటికీ.. గతంలో రాజులు పాలించిన ఒక చారిత్రక ప్రదేశం. జిల్లావ్యాప్తంగా ఇందుకు సజీవ సాక్ష్యంగా ఎన్నో కట్టడాలు మనకి కనిపిస్తాయి. ఇందులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లేపాక్షి, విజయనగర రాజులు పాలించిన పెనుకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా చారిత్రిక కట్టడాలు కనిపిస్తాయి. వీటికీ తోడు వందల ఏళ్ళ క్రితం నిర్మించిన ఆలయాలు కూడా చాలా ఉన్నాయి.

అయితే వీటి సంరక్షణ విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం శాపంగా మారింది.. ఇప్పటికే చాలా కట్టడాలు కనుమరుగయ్యాయి. మరి కొన్నింటిని కొందరు స్వార్థపరులు గుప్తనిధుల కోసం నిలువునా ధ్వంసం చేస్తున్నారు. ఇందులో పెనుకొండ గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక్కడ పదుల సంఖ్యలో ఆలయాలు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. అయితే ఇప్పుడు వేటగాళ్ల దృష్టి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలపై పడింది. విజయనగర రాజుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం ఇప్పటికే చాలావరకు ఆక్రమణకు గురైంది. తాజాగా గుప్తనిధుల వేటగాళ్లు.. ఉన్న ఆలయాన్ని కూడా ధ్వంసం చేసే సాహసం చేస్తున్నారు.

విజయనగర రాజుల కాలంలో ప్రముఖ వాణిజ్య పట్టణంగా పేరొందిన లేపాక్షి కోదండ రామస్వామి ఆలయ ప్రాంగణంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. కల్యాణ గోపురంలో స్థానికుల సహకారంతో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే యునెస్కో గుర్తింపు కోసం లేపాక్షి రేస్ లో ఉంది. ఇలాంటి సమయంలో కూడా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నా రంటే.. అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి లేపాక్షి ఆలయ సంరక్షణ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.

ప్రస్తుతం లేపాక్షి క్షేత్రానికి ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇలాంటి ఆలయాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఈ ఘటన వెనక ఎవరో ఉన్నారన్న దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి, మరెప్పుడు గుప్తనిధుల తవ్వకాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే.

Related Articles

Latest Articles