ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై చార్జిషీట్.. ఏ1గా సీఎం కేసీఆర్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడేళ్ల పాలనపై ప్రచా చార్జిషీట్‌ పేరుతో ఓ పత్రాన్ని విడుదల చేసింది టి.పీసీసీ.. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వారికి నష్టం కలిగించారంటూ.. ఆ చార్జిషీట్‌లో సీఎం కేసీఆర్‌ను ఏ1గా చేర్చారు.. ప్రజాకోర్టులో నెంబర్ 1 దోషి కేసీఆర్‌కు శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది కాంగ్రెస్‌ పార్టీ.. తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి హోదాలో రాజ్యాంగంపైన ప్రమాణం చేసి తాను ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం నేరం. .అందుకే కేసీఆర్ నేరస్థుడు అని పేర్కొంది కాంగ్రెస్‌ పార్టీ.. కేసీఆర్ సీఎం అయ్యి ఏడున్నర ఏళ్లు అయ్యింది. 2014 ఎన్నికల ముందు దళిత, గిరిజనులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించిన కాంగ్రెస్‌. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్ అనేక హామీలు ఇచ్చినా అవి అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించింది. హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.. కానీ, అమలు చేయరని పేర్కొన్న కాంగ్రెస్‌.. కేసీఆర్ హామీలు నెరవేర్చినట్టు అయితే.. దళిత, గిరిజనులకు ఎంతో లాభం జరిగేది. వాళ్లు ఆత్మగౌరవంతో దర్జాగా బతికేవాళ్లు.. ఏడున్నర ఏళ్లలో లక్షలాది దళిత, గిరిజన కుటుంబాలకు భరోసా కలిగేదన్నారు.. ఇవాళ అవన్నీ జరగకపోవడానికి దళిత, గిరిజనులు ఇంకా అలాగే ఆత్మన్యూనతతో బతుకీడుస్తున్నారు. అందుకు కేసీఆరే దోషి.. అని.. తెలంగాణ ప్రజల పక్షాన చార్జిషీట్ విడుదల చేస్తున్నామని పేర్కొంది.

ఇక, కేసీఆర్‌ నేరాల చిట్టను కూడా పొందుపర్చింది కాంగ్రెస్‌ పార్టీ.. 1. తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని ప్రకటించి విస్మరించడం నేరం కాదా?, 2. భూమి లేని ప్రతీ దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానని హామీ ఇచ్చి నెరవేర్చకపోవడం నేరం కాదా?, 3. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్న హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?, 4. నియామకాలే నినాధంగా సాగి రాష్ట్రాన్ని సాధించిన నిరుద్యోగులను నిండా ముంచడం నేరం కాదా?, 5. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం నేరం కాదా?, 6. ఎస్టీ, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ల హామీ అమలు చేయకపోవడం నేరం కాదా?, 7. కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్యా విధానాన్ని నీరు గార్చడం నేరం కాదా?, 8. అమలుకు ఆమడ దూరంలో ఫీజు రీయంబర్స్మెంట్ నేరం కాదా?, 9. దళిత గిరిజనులపై హత్యలు, అత్యాచారాలు అడ్డుకోకపోవడం నేరం కాదా?, 10. ఆర్థిక సహకార సంస్థలు దళిత, గిరిజనులను ఆదుకోకపోవడం నేరం కాదా? అంటూ ఆరోపణలు గుప్పించింది.. ఇక, ప్రజాకోర్టులో దోషిగా నిరూపించి ప్రజల చేత శిక్షిస్తాం… ప్రజా దండు కడతాం దళిత, గిరిజన దండోరా మోగిస్తాం.. కేసీఆర్ గుండెల్లో దడ పుట్టిస్తాం.. ప్రజా తెలంగాణ నిర్మిస్తాం అంటూ టి.పీసీసీ ప్రచార కమిటీ ప్రకటించింది.

-Advertisement-ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనపై చార్జిషీట్.. ఏ1గా సీఎం కేసీఆర్..!

Related Articles

Latest Articles