టాలీవుడ్ స్టార్స్ బ్రేకప్స్…

చూడముచ్చటైన జంట అంటూ వేనోళ్ళ కీర్తించిన నాగచైతన్య, సమంత జంట విడాకులు తీసుకుంది. గత కొద్ది రోజులుగా చైతూ, సామ్ విడిపోతారని వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం అధికారికంగా వారిద్దరూ విడిపోయినట్టు నాగచైతన్య తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఆ వెంటనే సమంత సైతం తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ధ్రువీకరించింది. టాలీవుడ్ ఓ స్టార్ జంట విడిపోవడం కొత్తేమీ కాదు. సినిమా జంటలు పెళ్ళయ్యాక బ్రేకప్ అయినవి కొన్ని అయితే, కొందరు వివాహ నిశ్చితార్థం అయిన తరువాత కూడా బ్రేకప్ అయినవారు ఉన్నారు.

అక్కినేని నాగేశ్వరరావు నటవారసుడు నాగార్జున మొదట లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు. నాగచైతన్య పుట్టిన తరువాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు చిత్రంగా ఆయన తనయుడు నాగచైతన్య సైతం అదే తీరున ప్రేమించి పెళ్ళి చేసుకున్న సమంతతో విడాకులు తీసుకోవడం గమనార్హం! ఇక నాగార్జున చిన్నకొడుకు అఖిల్ కు అప్పట్లో జీవీకే వారి మనవరాలు శ్రియా భూపాల్ తో వివాహ నిశ్చితార్థం జరిగింది. అయితే పరస్పర అంగీకారంతోనే ఆ నిశ్చితార్థం రద్దయింది. ఇక ఏయన్నార్ మనవడు సుమంత్ నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. వారి వివాహం కూడా కొద్ది రోజులకే విడాకులకు దారి తీసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రెండు వివాహాలు బ్రేక్ చేసుకున్నారు. ప్రస్తుతం మూడో భార్యతో కొనసాగుతున్నారు. తొలుత విశాఖకు చెందిన ఓ అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్, తరువాత కొంతకాలం నటి రేణూ దేశాయ్ తో సహజీవనం చేశారు. మొదటి వివాహం రద్దయిన తరువాతే రేణూ దేశాయ్ ను పెళ్ళాడారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చి అన్నా లెజ్నేవాను వివాహం చేసుకున్నారు.

ఒకప్పుడు హీరోగా అలరించి, ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గా సాగుతున్న సీనియర్ నరేశ్ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తొలుత నృత్య దర్శకుడు హీరాలాల్ కూతురుతో వివాహం జరిగింది. ఆమెకు విడాకులు ఇచ్చాక దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు, బుజ్జాయి కూతురుతో పెళ్ళయింది. ఆ వివాహం కూడా ముగిశాక, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సమీపబంధువును నరేశ్ వివాహం చేసుకున్నారు.
మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఒంటరిగానే ఉంటున్నారు.

ఇక తెలుగు చిత్రసీమతో ఎంతో అనుబంధం ఉన్న కమల్ హాసన్ సైతం రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. తొలుత ప్రఖ్యాత నర్తకి వాణీ గణపతిని వివాహం చేసుకున్న కమల్, తరువాత ఆమెకు విడాకులు ఇచ్చారు. కొంతకాలం సారికతో సహజీవనం చేశాక, ఇద్దరు పిల్లలు పుట్టాక, ఆమెను పెళ్ళాడారు. ఆమెకు కూడా విడాకులు ఇచ్చిన తరువాత నటి గౌతమితో కొన్నాళ్ళు సహజీవనం సాగించారు.

నటి రాధిక తొలుత నటదర్శకుడు ప్రతాప్ పోతన్ ను పెళ్ళాడారు. తరువాత విడిపోయాక రిచర్డ్ హార్డీ అనే విదేశీయునితో ఆమెకు వివాహమయింది. రిచర్డ్ ద్వారా రాధిక ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అతనికి విడాకులు ఇచ్చిన తరువాత నటుడు శరత్ కుమార్ ను పెళ్ళాడారు రాధిక. ప్రస్తుతం రాధిక,శరత్ కుమార్ కలసే ఉన్నారు. శరత్ కుమార్ సైతం తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, కొన్నాళ్ళు నగ్మాతో కొనసాగారు. ఇప్పుడు రాధిక భర్తగా ఉన్నారు.

నయనతారతో వివాహం కోసం మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్, యాక్టర్ డైరెక్టర్ ప్రభుదేవా. కానీ, నయన్ ను ఆయన పెళ్ళాడలేక పోయారు.

విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మొదట శ్రీహరి భార్య డిస్కో శాంతి చెల్లెలును పెళ్ళాడారు. ఆమెకు విడాకులు ఇచ్చిన తరువాత ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ ని వివాహం చేసుకున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న రష్మిక మందన్న కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో వివాహ నిశ్చితార్థం చేసుకుంది. తెలుగులో ఆమె బిజీగా మారడంతో వారిద్దరూ కూడా కెరీర్ లో కొనసాగాలనే నిర్ణయించుకొని పరస్సర అంగీకరాంతోనే ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. ఇక త్రిష కూడా పెళ్ళిపీటల దాకా వెళ్ళి నిశ్చితార్థం కేన్సిల్ చేసుకుంది.

ఇలా పలువురు టాలీవుడ్ స్టార్స్ జీవితాల్లో బ్రేకప్ చోటు చేసుకుంది. ఎవరైనా పెళ్ళి పెటాకులు కాకూడదనే కోరుకుంటారు. కానీ, చైతూ, సామ్ విడిపోవడం వారి ఫ్యాన్స్ కు విచారం కలిగిస్తోంది. తమ నటనతో ఎంతోమందిని ఇన్ స్పైర్ చేసే స్టార్స్ అంటే అభిమానులకు ఎంతో ఇష్టం. వారిని విచారానికి గురిచేయడమూ సబబు కాదు. ఇక ముందు తారలు తమ వివాహ విషయంలో లోతుగా ఆలోచించి, ఓ నిర్ణయానికి వచ్చిన తరువాత పెళ్ళి చేసుకుంటే బాగుంటుందని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. ఏది ఏమైనా అది తారల వ్యక్తిగత జీవితం దానితో మాకు అవసరం లేదని, వారు తమను అలరిస్తే చాలనీ కొందరు కోరుకుంటున్నారు.

-Advertisement-టాలీవుడ్ స్టార్స్ బ్రేకప్స్…

Related Articles

Latest Articles