సినీ పరిశ్రమ పెద్దలు స్పందించేదేమైనా ఉందా.. లేదా?

టాలీవుడ్ కు.. ఏపీ సీఎం జగన్ షాక్ ఇచ్చి 2 రోజులు దాటుతోంది. సినిమా టికెట్లకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. తమ అదుపులోకి టాలీవుడ్ ను రప్పించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విధానంపై.. థియేటర్ల యజమానులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు.. సినిమా టికెట్ల ఆదాయాన్ని పంచుకునే అన్ని విభాగాల ప్రతినిధులు.. టెన్షన్ పడుతున్నారు.

వెబ్ సైట్ పెట్టినందుకు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాల్సి ఉంటుంది. అది ఎంత ఉంటుంది.. టికెట్ల మొత్తంలో ఎంత మేర ప్రభుత్వ ఖజానాకు చేరుకుంటుంది? ఆ తర్వాతి ఆదాయం.. ఎంత వరకూ మిగిలిన విభాగాలకు అందుతుంది? అది ఎప్పటిలోగా చేరుతుంది? ఇలాంటి ప్రశ్నలకు ప్రస్తుతానికైతే స్పష్టమైన సమాధానం లేదు. కానీ.. ఓ విషయం మాత్రం.. ఈ సందర్భానికి సంబంధించి.. పరిశీలకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రెండు రోజులు గడుస్తున్నా కూడా.. సినీ వర్గాల నుంచి ఈ ప్రతిపాదనపై ఎలాంటి స్పందన రాకపోవడమే చర్చకు కారణం అవుతోంది. ఓ రకంగా చూస్తే.. ప్రస్తుతం సినీ పరిశ్రమలో.. చిరంజీవి అనధికారిక పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆ తర్వాత.. నాగార్జున, వెంకటేశ్ కుటుంబం చొరవ తీసుకుంటూ.. ముందుకు వెళ్తోంది. ఎలాంటి సమావేశమైనా ఈ మూడు కుటుంబాల కలయికగా జరుగుతోంది. కారణాలు పక్కనబెడితే.. బాలకృష్ణ ఇలాంటి వాటికి దూరంగానే ఉంటున్నారు.

వీరిలో.. చిరంజీవి, నాగార్జున ఇద్దరూ.. సీఎం జగన్ కు అనుకూలంగా నడుచుకునేవారే అని అందరికీ తెలుసు. మిగిలిన వెంకటేశ్ కుటుంబం.. సినిమా వ్యాపారంలో అగ్రభాగంలో ఉంది. మరి.. వీరందరికీ తెలిసే.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా.. లేదంటే సడన్ గా ప్రకటన చేసి అందరినీ షాక్ కు గురి చేసిందా అన్నది స్పష్టత లేకుండా పోతోంది. అంతకుమించి.. వీళ్లెవరూ ఈ విషయమై స్పందించకపోవడం.. చర్చనీయంశంగా మారుతోంది.

కాకపోతే.. ఈ వారంలోనే చిరంజీవి నేతృత్వంలోని బృందం.. జగన్ ను కలిసి.. తమ అభిప్రాయాన్ని మాత్రం వివరించే అవకాశం ఉందన్న గుసగుస వినిపిస్తోంది.

Related Articles

Latest Articles

-Advertisement-