ఆన్లైన్ టికెటింగ్ కు సినిమా నిర్మాతల మద్దతు: మంత్రి పేర్ని నాని

సినిమా పరిశ్రమ తప్పు లేకపోయినా తెలుగు చిత్రసీమకే నష్టం కల్గించే సంఘటనలు కొందరి ద్వారా ఇటీవల ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో తామంతా ఆ నటుడు చెబుతున్న అభిప్రాయంలో ఏకీభవించడం లేదని, సినిమా టిక్కెట్ల విషయంలో ఆన్లైన్ విధానంకు మద్దతు ఇస్తున్నామని, తమ ఆర్ధిక ఇబ్బందులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సినిమా నిర్మాతలు తనను అభ్యర్ధించినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. బుధవారం మచిలీపట్నం లోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో మంత్రి పేర్నినానితో తెలుగు సినీ నిర్మాతలు దిల్ రాజు, డి వి వి దానయ్య, బన్ని వాసు, సునీల్ నారంగ్, వంశీ రెడ్డి తదితర నిర్మాతల బృందం సమావేశమయ్యారు. దాదాపు రెండు గంటలకు పైగా చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై కూలంకుషంగా చర్చించారు.

అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో కరోనా తగ్గుముఖం పట్టిందన్న నేపథ్యంలో 50 శాతం ఉన్న సదుపాయాలను వంద శాతంకు పెంచమని ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో కోరారని, అలాగే నిర్వహణ వ్యయం, తమ పెట్టుబడులు తదితర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం టిక్కెట్ల ధర విషయంలో మరోమారు యోచించాలని నిర్మాతలు అడిగారన్నారు. ఏకాభిప్రాయంపై ఆన్లైన్ విధానం తామే అడిగామని, తమకే ఆ పద్ధతి ఎంతో అవసరమని నిర్మాతలు కోరినట్టు మంత్రి తెలిపారు. ఆన్లైన్ టిక్కెటింగ్ విధానం ఈనాటిది కాదని, 2005వ సంవత్సరం నాటికే తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ విధానం కొనసాగిందని, ఈ విషయం ఎందరికో తెలియని సంగతని, పలు థియేటర్లలో ‘బుక్ మై షో , పే టీఎం , జస్ట్ టికెట్స్ పేరిట ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కొనసాగుతోందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. ఒక నిర్దిష్టమైన విధానం ఉంటే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వానికి ఎంతో మంచిదని నిర్మాతలు కోరినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ, ”తెలుగు సినిమా చిత్ర పరిశ్రమ ఎంతో సున్నితమైనదని, లేనిపోని వివాదాస్పద అంశాలు లేవనెత్తి గందరగోళ పరిస్థితులు దయచేసి లేవనెత్తవద్దని, చిత్ర పరిశ్రమకు సంబంధించిన వివిధ సమస్యలు ప్రభుత్వానికి విన్నవించుకొంటున్నామ’ని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాలు చిత్ర పరిశ్రమ బాగుండాలనే కోరుకొంటాయని, తమ పట్ల ఎంతో సానుకూలంగా ఉంటున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు, జరుగుతున్న వ్యతిరేక పరిణామాలు తమ అభిప్రాయం కాదని, ముఖ్యమంత్రికి తమ అభిప్రాయం దయచేసి తెలియచేయాలని మంత్రి పేర్ని నానికి వివరించినట్లు ‘దిల్’ రాజు పేర్కొన్నారు.

ఆన్లైన్ టికెటింగ్ కు సినిమా నిర్మాతల మద్దతు: మంత్రి పేర్ని నాని
-Advertisement-ఆన్లైన్ టికెటింగ్ కు సినిమా నిర్మాతల మద్దతు: మంత్రి పేర్ని నాని

Related Articles

Latest Articles