అలుపెరుగని ‘స్రవంతి’ రవికిశోర్

(జూలై 11న రవికిశోర్ పుట్టినరోజు)

బ్యానర్ పేరును ఇంటి పేరుగా మార్చుకున్న నిర్మాతల్లో ‘స్రవంతి’ రవికిశోర్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. మూడున్నర దశాబ్దాలుగా చిత్రాలను నిర్మిస్తున్నారు రవికిశోర్. తన మనసుకు నచ్చిన కథను సినిమాగా తెరకెక్కించడంలోనూ, మెచ్చిన పరభాషా చిత్రాన్ని తెలుగులోకి అనువదించడంలోనూ రవికిశోర్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. విలక్షణ దర్శకుడు వంశీతో రవికిశోర్ చిత్రప్రయాణం ఆరంభించారు. వంశీ దర్శకత్వంలో ‘లేడీస్ టైలర్’ నిర్మించి, ఆ సినిమాతోనే తన అభిరుచి ఏమిటో చాటుకున్నారు. జనానికి తగిన వినోదం పంచడమే లక్ష్యంగా రవికిశోర్ కొన్ని చిత్రాలు నిర్మించారు. అలాగే మనసులు తాకే కథలనూ సినిమాలుగా తెరకెక్కించారు. ఏది చేసినా వాటిలో తన ముద్ర ఉండేలా చూసుకున్నారాయన.

‘శ్రీస్రవంతి మూవీస్’ పతాకంపై రవికిశోర్ నిర్మించిన ‘లేడీస్ టైలర్’ వంశీ మార్కు కామెడీతో, ఇళయరాజా సంగీతంతో జనాన్ని భలేగా కట్టి పడేసింది. ఆ తరువాత అదే వంశీతో రవికిశోర్ తెరకెక్కించిన ‘మహర్షి’ అంతగా అలరించలేకపోయింది. ఆ తరువాత సింగీతం శ్రీనివాసరావు కన్నడలో రూపొందించిన ‘పుష్పక విమాన’ మూకీని, తెలుగులో ‘పుష్పక విమానం’గా అనువదించారు రవికిశోర్. ఈ సినిమాతో రవికిశోర్ పేరు జనానికి భలేగా గుర్తుండి పోయింది. ఆ తరువాత కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రాన్ని తెలుగులో ‘నాయకుడు’గా అందించీ విజయం సాధించారు. వెంకటేశ్, సుహాసిని జంటగా మోహన్ గాంధీ దర్శకత్వంలో రవికిశోర్ నిర్మించిన ‘వారసుడొచ్చాడు’ మంచి ఆదరణ పొందింది. ఉప్పలపాటి నారాయణరావును దర్శకునిగా పరిచయం చేస్తూ నాగార్జున హీరోగా ‘జైత్రయాత్ర’ నిర్మించారు రవికిశోర్. ఈ సినిమా మంచిపేరు సంపాదించి పెట్టింది కానీ, ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. తమిళంలో విజయం సాధించిన ‘చేరన్ పాండ్యన్’ను తెలుగులో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘బలరామకృష్ణులు’గా రీమేక్ చేశారు రవికిశోర్. ఈ సినిమా మంచి ఫలితాన్నే అందించింది. ఆ తరువాత వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా రవికిశోర్ నిర్మించిన ‘లింగబాబు లవ్ స్టోరీ’ ఆట్టే ఆకట్టుకోలేకపోయింది. విజయాలు లభించినా, పరాజయాలు పలకరించినా రవికిశోర్ ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు. ప్రయత్నం మాత్రం విరమించలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రవికిశోర్ నిర్మించిన “మావిచిగురు, ఎగిరే పావురమా” రెండూ మంచి విజయాలను చూశాయి. “గిల్లికజ్జాలు, పిల్లనచ్చింది, మనసులో మాట” వంటివి ఫరవాలేదనిపించాయి.

మళయాళంలో విజయం సాధించిన ‘నిరమ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని హక్కులు సంపాదించారు రవికిశోర్. అదే చిత్రం కోసం రామోజీ రావు సైతం ప్రయత్నించారు. ఆ సమయంలోనే రామోజీ ఫిలిమ్ సిటీ తొలి అడుగులు వేస్తోంది. ‘నిరమ్’ రైట్స్ ను రవికిశోర్ నుండి రామోజీరావు తీసుకోవాలని భావించారు. అయితే రవికిశోర్ ఆ సినిమాను తాను రీమేక్ చేయడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నానని చెప్పారు. దాంతో రామోజీరావు, రవికిశోర్ ను అసోసియేట్ ప్రొడ్యూసర్ గా చేసుకొని, తానే ఆ సినిమాను నిర్మించారు. అదే ‘నువ్వే కావాలి’. ఆ సినిమాతో తరుణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, రిచా పల్లాడ్ తెలుగు తెరకు పరిచయం అయింది. ‘నువ్వే కావాలి’ అనూహ్య విజయం సాధించింది. ఆ చిత్రానికి రచన చేసిన త్రివిక్రమ్, దర్శకత్వం వహించిన విజయ్ భాస్కర్ స్టార్స్ గా మారారు. త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కాంబోలో వెంకటేశ్ హీరోగా రవికిశోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ కూడా మంచి విజయం సాధించింది. తరువాత త్రివిక్రమ్ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రవికిశోర్ ‘నువ్వే నువ్వే’ నిర్మించారు. ఈ సినిమా త్రివిక్రమ్ కు దర్శకునిగానూ మంచి మార్కులు సంపాదించింది. తరువాత “ఎలా చెప్పను, గౌరీ, యువసేన, ప్రేమంటే ఇంతే, క్లాస్ మేట్స్” వంటి చిత్రాలను తెరకెక్కించారు రవికిశోర్.

తన సోదరుని తనయుడు రామ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవికిశోర్ నిర్మించిన ‘రెడీ’ మంచి విజయం సాధించింది. ఇంట్లోనే హీరో ఉండడంతో రవికిశోర్ ఇక వేరే హీరోల కోసం వెదుక్కోలేదు. రామ్ తో ఆయన నిర్మించిన “గణేశ్- జస్ట్ గణేశ్, ఎందుకంటే ప్రేమంట!, మసాలా, శివమ్, నేను-శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ, రెడ్” చిత్రాలలో కొన్ని నిరాశ పరచినా, అధికశాతం ఆనందం పంచాయి. మధ్యలో ధనుష్ ‘రఘువరన్ బీ.టెక్’ అనువాదం కూడా మంచి విజయాన్నే అందించింది. ఈ యేడాది ‘రెడ్’తో జనాన్ని పలకరించిన రవికిశోర్, రాబోయే రోజుల్లో మళ్ళీ తన మార్కు చిత్రాలతో అలరించే ప్రయత్నంలో ఉన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-