ఎస్పీ బాలుకు ఘనంగా స్వర నీరాజనం

శ్రీ పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం అంటే అందరికి తెలియకపోవచ్చు .. కానీ ఎస్పీ బాలు అంటే చాలు.. మధురమైన గీతాలే గుర్తొస్తాయి. ఒక్క తెలుగులోనే కాదు దాదాపు అన్ని భాషల్లో కలిపి నలభైవేలకు పైగా పాటలు పాడిన మహా గాయకుడు బాలు!! బాలసుబ్రహ్మణ్యం ఆకస్మిక మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన లేని లోటు ఎప్పటికి తీర్చ లేనిది. జూన్ 4న శుక్రవారం ఆయన 75వ పుట్టినరోజు. ఆయన జయంతి సందర్బంగా యావత్ తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులర్పించింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమం ప్రారంభమైంది. ‘ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్’ యూట్యూబ్ ఛానల్, మరియు ‘సంతోషం సురేష్’ యూట్యూబ్ చానెల్స్‌లో 12 గంటల పాటు లైవ్ ప్రోగ్రామ్ కంటిన్యూగా ప్రసారం అయింది.

‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ కార్యక్రమాన్ని డైలాగ్ కింగ్ సాయికుమార్ దీపోత్సవగీతంతో ప్రారంభించి ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేశారు. జీవితారాజశేఖర్, ఆర్పీపట్నాయక్, కేఎల్ దామోదర్ ప్రసాద్, ఎన్ శంకర్, ప్రసన్నకుమార్, సురేష్ కొండేటి తదిరుతలు బాలుగారి చిత్ర పటానికి దీపారాధన నిర్వహించారు. అనంతరం యువ గాయనీ గాయకులు బాలుకు నివాళులర్పిస్తూ గీతాలాపన చేశారు.

ఈ కార్యక్రమంలో సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో గాయకుడిగా, గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా 29 నంది అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మవిభూషణ్ లాంటి ఎన్నో అవార్డులు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పాడిన తొలి చిత్రం ‘మర్యాదరామన్న’. అందరూ మాట మీద నిలబడితే ఈ గానగంధర్వుడు పాట మీద నిలబడతారు. ఆంధ్రులు మరచిపోలేనివి ఎన్నో ఉన్నాయి. వాటిలో రెండు నన్నయ్య కంఠం, అన్నయ్య కంఠం. ఆబాలగోపాలాన్ని తన మధుర గాత్రంతో అలరించిన ఆ మహా గాయకుడి 75వ జయంతి సందర్భంగా ఈ రోజును బాలుగారికి అంకితం చేసి చిత్రసీమ స్వరనీరాజనం తెలుపుతోంది.’’ అంటూ మెగాస్టార్ చిరంజీవిని మాట్లాడాలని ఆహ్వానించారు.

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..‘‘మనందరికీ అభిమాన పాత్రుడైన మన అందరి అన్నయ్య ఎస్పీ బాలుగారి జయంతిని అందరూ కలిసి ఒక వేదికపై ఘనంగా సెలబ్రేట్ చేయలేకపోతున్నామనే బాధగా ఉంది. ఈ 75వ జయంతి సందర్భంగా మీ అందరితో పాటు నేను కూడా ఇలా నివాళులర్పిస్తున్నా. అన్నయ్యతో నాకు 1980 నుంచి సాన్నిహిత్యం ఉంది. కుటుంబ పరంగా, సినిమా పరంగా బాగా దగ్గరగా ఉండేవాళ్లం. నేను బాలుగారు అంటే ఆయనకు నచ్చదు. అన్నయ్య అని పిలవమనేవారు. నా సినిమాలకు పాటలు పాడాలంటే ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. ఆయన గాత్రానికి నా బాడీ లాంగ్వేజ్ మ్యాచ్ చేసేందుకు చాలా కష్టపడ్డాను. నా సినిమా జీవితంలో నా సక్సెస్‌కి సగం దోహదపడ్డ బాలుగారికి నేను నివాళుర్పిస్తున్నా. స్టాలిన్, శంకర్ దాదా ఎంబీబీఎస్ వరకు ఆయన నా సినిమాలకు పాడారు. అందుకే నా సక్సెస్‌లో ఆయనకు సగభాగం ఇస్తా. నన్ను కమర్షిల్ సినిమాలే కాకుండా కళాత్మక సినిమాలు కూడా చేయమని చెప్పేవారు. కానీ అలాంటి సినిమాలు నేను చేస్తే నాకున్న ఇమేజ్ ప్రకారం నిర్మాతలకు నష్టం వాటిల్లుతుందేమోనని నేను వెనకడుగు వేసేవాణ్ని. వ్యక్తిగతం బాలు అన్నయ్యతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. వాళ్లంతా నన్ను కుటుంబ సభ్యుడిగా భావించేవారు. మొన్న అన్నయ్య ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఎస్పీ వసంతతో, శుభలేక సుధాకర్‌తో ఎప్పటికప్పుడు మాట్లాడి ఆయన పరిస్థితి తెలుసుకున్నా. కానీ మనందరి దురదృష్టం ఆయన మనందరికీ దూరంగా వెళ్లిపోయారు. అన్నయ్య కోసం వసంత స్వయంగా రాసి పాడిన పాట ఎంతో బాగుంది. ఆ పాటను ఆమె అనుమతితో ఈ రోజు విడుదల చేస్తున్నాం. ఈ రోజు హనుమాన్ చాలీసా పాట వింటున్నప్పుడు ఆయన పాడిందేనని గుర్తొచ్చింది. ఆ రకంగా సంగీతం ఉన్నంత వరకు ఆయన చిరంజీవులై మనందరి మనస్సుల్లో ఉంటారు. ఆయన ఎక్కడున్న శాంతంగా ఉండాలి. ఆయన అజరామరుడు.’’ అని మెగాస్టార్ చిరంజీవి తెలియజేశారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ..‘‘ఇంత గొప్ప కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరిగుంటే ఆయన ఎంతో సంతోషించేవారు. అందరూ ఇలా కలిసి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో చిరంజీవిగారు పాల్గొన్నందుకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అందరూ చెప్తున్నట్టుగానే నాన్నగారు పై నుంచి మనకు ఆశీర్వాదాలు అందిస్తుంటారు. ’’ అన్నారు.

కళాతపస్వి కే విశ్వనాథ్ మాట్లాడుతూ.. ‘‘బాలసుబ్రహ్మణ్యం కారణ జన్ముడు, అమరగాయకుడు. మళ్లీ నేను సినిమా తీస్తే పాటలు ఎవరు పాడుతారు అని అనిపించే లోటును క్రియేట్ చేసిన మహా వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదు. అది జన్మజన్మలకు ఒక రుణానుబంధంగా ఉండిపోతుంది.’’ అన్నారు.

దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మాట్లాడుతూ..‘‘మామూలుగా పాటకు ప్రాణం పల్లవి అంటారు. కానీ నా దృష్టిలో బాలు గాత్రమే పాటకు, పల్లవికి ప్రాణం. రక్తి గీతమైనా, భక్తి గీతమైనా ఏది పాడాలన్నా బాలు ఒక్కడికే సాధ్యం. అలాంటి బాలు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. మా ఇద్దరిదీ 50 ఏళ్ల అనుబంధం. ఎంతో ప్రేమగా రాఘవా అని పిలిచేవాడు. ఇప్పటికీ అతని మాటలు నాకు వినిపిస్తుంటాయి. భక్తి పాటలు పెట్టినప్పుడల్లా అతని గొంతు వినిపిస్తుంటుంది. బాలు ఎప్పటికీ మనతోనే ఉంటాడు. అతని సంగీతం వింటూనే ఉంటాము.’’ అన్నారు.

కోదండరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘బాలు గారి గురించి ఇలా మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. ఆయన చాలా గొప్పవ్యక్తి. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అలాంటి మనిషి మనమధ్య లేకుండా పోవడం చాలా దురదృష్టం. ఎన్నో గొప్ప పాటలు పాడడమే కాకుండా ఆయన ఏదైనా కార్యక్రమం చేస్తే నిండుగా ఉంటుంది. ఎంజీఆర్ గారికి సాంగ్ పాడాల్సి వచ్చినప్పుడు ఆయనకు జ్వరం వస్తే వేరేవాళ్లతో పాడిద్దామని అంతా అనుకుంటుంటే ఎంజీఆర్ గారు లేదు బాలుయే పాడలని చెప్పారంటే అలాంటి గొప్ప గాయకుడు బాలు గురించి ఎంత చెప్పినా తక్కువే. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి లాస్ట్ ఫిల్మ్ వరకు అన్నింట్లోనూ ఆయన పాడారు. ఒక పాటను జనంలోకి తీసుకెళ్లాలంటే స్వరం మధురంగా ఉండాలి. అలాంటి స్వరం ఉన్న బాలుగారికి హ్యాట్సాఫ్. ఆయన ఏ హీరోకి పాడినా, ఏ కమెడియన్‌కు పాడినా ఆ హీరోలు పాడినట్లే ఉండేది. అలా ఎలా అనుకరించేవారో కానీ చాలా అద్భుతంగా ఉండేది. చాలా గొప్ప వ్యక్తి. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ..‘‘బాలు గారి గురించి మాట్లాడడానికి నాకు వయసు, అనుభవం ఏమీ సరిపోవు. ఆయనతో నాకు ఎక్కువ అనుబంధం లేదు. ఎందుకంటే నేను వచ్చేలోపే ఆయన ట్రాకులు పాడి వెళ్లిపోవడం, లేదా ఆన్‌లైన్‌లో పాడి పంపించడం జరిగేది. ఆయనతో ఎక్కువ కలవలేకపోవడాన్ని రిగ్రెట్‌గా ఫీలవుతున్నా. ‘అతడు’ సినిమాకు నాజర్ క్యారెక్టర్‌కు ఆయనతోనే డబ్బింగ్ చెప్పించా. ఆ టైమ్‌లో కమల్ హాసన్ లాంటి స్టార్లకు మాత్రమే ఆయన చెప్పేవారు. కానీ నాకోసమే ఆయన ఒప్పుకున్నారు. ఆయన ఎంత సాధించినా చాలా సింపుల్‌గా ఉంటారు. సినిమా క్రాఫ్ట్ మీద ఉన్న అండర్‌స్టాండింగ్‌తో ఆయన అందరికంటే ప్రత్యేకంగా మారారు. బాలు గారు టాలెంట్ ఒక్కటే కాదు.. ఆయన చాలా ఇంటలిజెంట్. ఆయన ఆఖరి క్షణాల వరకు పాడుతూనే ఉన్నారు. ఇప్పుడు సౌతిండియాలో పాటలు పాడుతున్న దక్షిణాది వారిలో 60 శాతం మంది ఆయన దగ్గరి నుంచి వచ్చినవారే. ఆయన గెలవడమే కాదు.. మన తర్వాతి తరాలను కూడా గెలిపించారు. ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్న బాలు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’’ అన్నారు.

సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ..‘‘బాలసుబ్రహ్మణ్యం గారు చిత్ర పరిశ్రమలో తొలిసారి నా చిత్రం ‘నేనంటే నేనే’కు పూర్తి పాటలు పాడారు. ఆ తర్వాత నా అన్ని సినిమాలకు ఆయనే పాడారు. మాది 50 సంవత్సరాల అనుబంధం. ఆయన 16 భాషల్లో 4 వేల పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన కళాకారుడు. అటువంటివాడు మన తెలుగువాడు అవడం మనందరి అదృష్టం.’’ అన్నారు.
వీకే నరేష్ మాట్లాడుతూ..‘‘ఎస్పీ బాలు గారికి మతాలకు, కులాలకు అతీతంగా కోట్లమంది అభిమానులున్నారు. ఆయన ఒక అజాతశత్రువు. నా ఏడో ఏట నుంచి ఆయన పరిచయం. నా సినిమాలకు పాడడమే కాకుండా నేను హీరోగా నటించిన మొదటి సినిమాకు డబ్బింగ్ చెప్పిన దేవుడు. ’’ అని అన్నారు.

ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ మాట్లాడుతూ … ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి థాంక్స్ చెబుతున్నాను. బాలు కు నాకు ఒకే ఒరినుండి వచ్చాము. నేను అయన ఒకే ఆర్గనైజేషన్ నుండి వచ్చాము, గూడూరులో కాళిదాస్ కళా ఆర్గనైజేషన్ అనే సంస్థ ద్వారానే వచ్చాము. మా అనుబంధం ఈ కారణాల వల్ల ఎక్కువగా పెరిగింది. సినిమా పరిశ్రమకు చాలా మంది గాయకులూ రావాల్సిన అవసరం ఉంది. అని స్టార్ట్ చేసిన మహత్తర కార్యక్రమమే పాడుతా తీయగా . రామోజీరావు ఆ కార్యక్రమాన్ని చేయడం . దానిద్వారా ఎంతోమంది సింగర్స్ ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఈ రోజు బాలుగారు లేరంటే నమ్మశక్యంగా లేదు .. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు. అయన ఎక్కడున్నా మనతోనే ఉంటాడు. కరోనా సమస్య వల్ల బాలుగారికి ఇండస్ట్రీ చేయవలసిన సేవ … ఎస్టాబ్లిష్మెంట్ చేయలేదు. పరిశ్రమకు అయన ఎంతో చేసారు… కానీ మన పరిశ్రమ మాత్రం ఆయనకు చేయాల్సినవి చేయలేదు. మొన్న దాసరి నారాయణ రావ్ గారి పుట్టినరోజు విషయంలో కూడా 30 న జరిగిన వర్థంతి విషయంలో కూడా మనిషి లేకుంటే ఎంత తొందరగా మరచిపోతారు అన్నది తెలిసింది. మనిషి ముందున్నప్పుడో, లేక ఎవరికైనా అవసరం వచ్చినప్పుడో దాసరిగారు ఉంటె బాగుండేది అని అంటారు .. కానీ ఇది కరెక్ట్ కాదు. డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ శంకర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇలా ఎదో కార్యక్రమం చేపట్టి . చేయడం కాదు తెలుగు ఇండస్ట్రీ నుండి కానీ లేదా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ తరపున కానీ ఆయనకు ఓ గొప్ప కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది. ముక్యంగా అయన చిరకాలం గుర్తుండేలా అయన పేరుమీద ఓక మ్యూజిక్ అకాడమిని ఏర్పాటు చేయడమో చేయాలి. ప్రతి రాష్ట్రంలో అయన పేరుమీద ఉండేలా ప్లాన్ చేయాలి . తెలుగు వాళ్ళుగా మనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ వచ్చే అయన పుట్టినరోజు వరకు ఒక అకాడమీ ని స్టార్ట్ చేసేలా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ప్రతి సంవత్సరం కొత్త విద్యార్థులను పరిచయం చేసేలా చేయాలి, దీనికోసం తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాలతో మాట్లాడదాం. మన అందరం తప్పకుండా ఈ విషయాన్నీ లీడ్ తీసుకుని చేస్తే తప్పకుండా ప్రయత్నాలు జరుగుతాయి. ఈ విషయంలో తప్పుగా అర్థం చేసుకోవద్దు అన్నారు.

సీనియర్ నిర్మాత ఆచంట గోపినాధ్ మాట్లాడుతూ … ఎస్పీ బాలు గారు కరణ జన్ములు. ఈ భూ మండలంలో భారతదేశానికి గర్వకారణమైన వ్యక్తిని కని , వాళ్ళమ్మగారు .. పిలుచుకున్నట్టుగా బాలు మని గా అన్ని భారతీయ భాషల్లో సినిమాలు పాడి దేశం గర్వించే గాయకుడిగా పేరు తెచ్చుకుని, తనకు ఎవరు సాటి లేరని నిరూపించుకున్న మహోన్నత గాయకుడూ బాలుగారు. బాలుగారు పాడిన పాటలకు మరణం లేదు. అంత గొప్ప పాటలు పాడిన బాలుగారు మన తెలుగువాడైనందుకు గర్వాంగా ఉంది. అయన కీర్తి ఎనలేనిది. బాలుగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ రోజు బాలుగారి జన్మదినం సందర్బంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.

ప్రముఖ రచయితా జేకే భారవి మాట్లాడుతూ .. ఆనాటి ఆస్నేహమనంద గీతం …. పాట పడినతరువాత బయటికి వచ్చారు బాలుగారు .. ఆ పాటలో ఈ కన్నీళ్లకు తుది ఎక్కడరా అంటే … కర్చీఫ్ తో తుడిచేయాలిరా అంటూ చెప్పిన పదం బాగా నచ్చిందని కళ్ళల్లో నీళ్లుతిరిగాయని అన్నారు. ఈ రోజు హనుమాన్ జయంతి అలాగే బాలుగారి జయంతి. హనుమంతుడు గొప్ప గాయకుడూ. కానీ బాలుగారు గాన గంధర్వుడు. హనుమంతుడికంటే బాలు గొప్పవాడని చెప్పగలను. ఆంజనేయుడికంటే ఒక మార్కు ఎక్కువ సంపాదించుకున్న వ్యక్తి నాకు ఆయనతో చాలా అనుభందం ఉంది. నేను అప్పట్లో రంగవల్లి అనే సినిమా చేశాను … దాంట్లో ప్రేమా తెలిసింది నీ అంటూ ఓ పాట ఉంటుంది. ఆ పాట పాడినతరువాత .. ఆత్రేయగారి శిష్యుడివని తెలుస్తుందంటూ అన్నారు. కన్నడలో 28 సినిమాలు జయశ్రీ గారు నిర్మిస్తే అన్ని సినిమాల్లో కూడా అయన పాటలు పాడారు. అన్నమయ్య సినిమా క్లైమాక్స్ లో బాలుగారు గుర్తొస్తారు. ఆయనతో 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎన్ని జ్ఞాపకాలని చెప్పను.

గీత రచయితా అనంత్ శ్రీరామ్ మాట్లాడుతూ … అందరికి బాలుగారి చేత పాడించుకోవాలని ఉంటుంది. అయితే నేను రాసిన మొట్టమొదటి సినిమా, మొట్ట మొదటి పాట పడింది బాలుగారు అవ్వడం నా పూర్వజన్మ సుకృతం. ఆ పాట అనుకోకుండా మెడ్రాస్ లో ప్లాన్ చేసినప్పుడు తెల్లవారుజామున ఆ సాంగ్ ని అక్కడ ఉదయం 7 గంటలకు రికార్డ్ చేయించాం .. ఆ తరువాత చిత్రాగారు కూడా రావడంతో ఆమెతో కూడా పాడించాం. అలా నా మొదటి పాటకు దక్కిన గౌరవం అని భావిస్తాను. బాలుగారు చాలా సలహాలు ఇచ్చారు. పుస్తకాలూ ఎక్కువగా చదవమని చెప్పారు. ఆ మాట చెప్పిన మనిషి మనతో లేరు కానీ ఆ మాట నాతోనే ఎప్పటికి ఉంటుంది .. అలాగే మా గురువు వేటూరి గారి గురించి కూడా చెబుతూ .. ఈ పాట రాసినా కూడా శ్రీ గురుబ్యో నమః అని వేటూరి గారి పేరు స్మరించుకో అని చెప్పారు. ఆ తరువాత కే విశ్వనాద్ గారి స్వరాభిషేకం సినిమాకు రాసె అవకాశం దక్కింది. అలాే పాడుతా తీయగా కార్యక్రమంలో తన పక్కనే మాలాంటి వారిని గౌరవిస్తుండేవారు. బాలుగారు ఎప్పటికి మన పాటల్లో జీవించే ఉంటారని అన్నారు.

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మాట్లాడుతూ … ఈ రోజు బాలు పుట్టిన రోజు .. పాటలకి మాటలు నేర్పిన మనిషి. బాలు ఎంత గొప్ప వాడు అంటే దేశమంతా అయన పాటలు విని సంతృప్తి పడిన ప్రేక్షకులు ఉన్నారు. బాలుగారు లేరు అనడానికి లేరు.. ఎప్పుడు మనతోనే ఉంటారు. బాలసుబ్రహ్మణ్యం పాటలు, శంకరాభరణం పాటలు ఎక్కువగా వినేవాడిని. అయన పాటలంటే అంత బాగుండేవి. బాలు నాకు చాలా మంచి మిత్రుడు. ఇద్దరం కలిసి సెటిల్ కూడా ఆడుకునేవాళ్ళం. ఆయనతో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. వైజాగ్ లో స్వరాభిషేకం కార్యక్రమంలో అయన గురించి చెబితే .. వెంటనే వచ్చి నా కాళ్ళకు దండం పెట్టాడు .. వెంటనే లేపి .. నువ్వు సరస్వతి పుత్రుడివి… నీలో సరస్వతి ఉంది.. మేము నీకు దండం పెట్టాలి అని అంటే .. లెద్దూ అంటూ హత్తుకున్నాడు. అయన ఏంతో మంచి మనిషి అన్నారు.

నేను శైలజ అనే సింగర్ ఉన్నానంటే కారణం .. ఆయనే. నేను చిన్నప్పటినుండి ఆయనతోనే పెరిగాను. ఇండస్ట్రీ లో ఎలా నడుచుకోవాలి అన్ని తండ్రిగా చుకున్నారు. ప్రతి విషయంలో ఆయనను చూసే నేర్చుకునేదాన్ని. ఇంతమంది అయన గురించి గొప్పగా మాట్లాడడం నిజంగా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు చాలా విషయాలు ఉన్నాయి.. పంచుకున్నవి. అయన పక్కన లేడన్న దిగులు లేదు నాకు … ఎప్పుడు నా పాటలో ఉంటాడు .. నా నోట్స్ లో ఉంటాను.. నా మైక్ లో ఉన్నాడు .. నాలోనూ ఉన్నాడు. తాను ఎప్పుడుఅందరికి స్ఫూర్తిగా ఉంటాడు .. నేను కూడా ఆయనలా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటాను.. ఎప్పుడు కూడా నవ్వుతు అందరితో ఆనందంగా గడిపే వారు.. అయన పుట్టినరోజున ఆంజనేయ స్వామి జయంతి రావడం .. చాలా సంతోషంగా ఉంది .. ఆంజనేయస్వామి గుడి ఎక్కడ కనిపించిన మొక్కేవారు.. అయన ఎప్పటికి , ఇప్పటికి మనతోనే ఉంటారు.

సీనియర్ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ .. ఇలాంటి ఒక రోజు వస్తుందని కానీ, ఇలాంటి ఒక కార్యక్రమం చేస్తామని అనుకోలేదు. ఏంతో బంగారు భవిష్యత్తు ఉన్న బాలుగారు ఇంత త్వరగా వెళ్ళిపోతారని అనుకోలేదు. అయన 75 వ జయంతిలో పాల్గొనటం అన్నది చాలా బాధాకరం. బాలుగారు ఎప్పటికి మన మధ్యలోనే ఉన్నారని నా అభిప్రాయం. ఎందుకంటే మనం టివి పెట్టిన ఎక్కడ చుసిన అయన పాటలే వినిపిస్తున్నాయి. ఘంటసాల గారి తరువాత సింగర్ గా ఎవరు అనుకున్న సమయంలో బాలుగారు రావడం .. ఒక్కో మెట్టు ఎక్కుతూ గొప్ప సింగర్ గా ఎదిగారు. ఘంటసాల గారు అప్పట్లో హీరోలకు పాడితే .. మిగతా ఆర్టిస్టులకు వేరేవాళ్లు పాడేవారు .. అలా బాలుగారు కూడా పాడారు .. ఆ తరువాత అయన హీరోలకు పడుతూ.. అన్నిరకాల పాటలు పాడి సింగర్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. నేను హీరోగా వస్తున్నా సమయంలో కల్పనా సినిమా సమయంలో బాలుగారు లేకపోవడం వల్ల ఆనంద్ గారితో రికార్డ్ చేయించారు .. అయితే ఆ పాట రాత్రి విని . .. ఈ పాట ఆనంద్ వాయిస్ బాగుంది .. మురళీమోహన్ వాయిస్ కు సెట్ అవుతుందని బాలుగారు అన్నారు. దురదృష్టం ఏమిటంటే .. వారిద్దరూ కూడా కరొనతో చనిపోవడం. బాలుగారు లేకపోవడం తెలుగు వారికే కాదుఅన్ని బాషల వారికీ తీరని లోటు. ముక్యంగా పాడుతా తీయగా కార్యక్రమంలో బాలుగారితో చేయించడం చాలా పాపులర్ అయినా ప్రోగ్రాం ఇది. అయన చేసిన ప్రతి కార్యక్రమంలో బాలుగారు తప్పకుండా ఉండేలా చేసేవారు రామోజీరావు గారు. బాలుగారి ద్వారా ఎంతోమంది కొత్త గాయకులూ పరిచయం అయ్యారు. అచ్చమైన తెలుగు భాషలో అయన చెప్పే మాటలు కూడా ఏంటో స్ఫూర్తినిస్తాయి. అయన లేని లోటు తీర్చలేనిది. బాలును ఒక్క తెలుగు వాడే అనేలా కాదు .. తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ, మలయాళం ఇలా అన్ని భాషలవాళ్ళు బాలు మావాడే అనుకునేలా ఆయా భాషల్లో అద్భుతంగా పాడి ఆకట్టుకున్నారు. గాంధీ సినిమాకు డబ్బింగ్ చెప్పినప్పుడు నేను ఆ సినిమా చూసి .. వెంటనే ఫోన్ చేసి బాలుగారు ఎంత అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు..గాంధీ గారు తెలుగులో మాట్లాడితే ఇలాగే ఉంటుందేమో అనిపించేలా ఉంది అన్నాను. ఇక ఇప్పటికే పద్మభహుశా అవార్డు ఇచ్చారు.. కానివెంటనే ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.

సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ .. నాన్నగారికి బాలు గారితో మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. నేను చిన్నప్పటినుండి బాలుగారి పాటలు విని పెరిగాము. బాలుగారు ఇన్ని వేల పాటలు పాడారు, అన్నింటికంటే ముక్యంగా ఎన్నిరకాల ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేరో అందరికి తెలుసు. నేను చిన్నప్పటినుండి బాలుగారి పాటలే, ముక్యంగా అప్పట్లో మహర్షి సినిమాలోని సాంగ్స్ బాగా పాపులర్. బాలుగారితో నాకున్న అనుబంధం కంటే ఎక్కువ చనువు ఉండేది. నేను చేసిన మొదటి సాంగ్ ని ఆయనతో పడించడం నాకు మరచిపోలేని అనుభూతి. నేను మ్యూజిక్ డైరెక్టర్ గా చేసిన దేవి సినిమాలో ఓ సాంగ్ ని ఫస్ట్ సాంగ్ ని బాలుగారి స్టూడియో లో రికార్డ్ చేసాం. అప్పటికే బాలుగారిని డాడీ తో చూస్తూండేవాణ్ణి. బాలుగారు మా ఇంటికి వస్తున్నారంటే పెద్ద పెద్ద కార్లు వచ్చేవి.. హంగామా ఉండేది.. అది నాకు చాలా ఇగ్జైట్ గా ఉండేది. ఆ తరువాత ఆయనతో చాలా పాటలు పాడించాను. నా పాటల విషయంలో చాలా అభినందించేవారు. నాకు బాలుగారిని చూసినప్పుడల్లా సెల్ఫీ తీసుకోవాలని అనిపిస్తుంది.. అలాగే చిరంజీవి గారు ,కమల్ హాసన్ ఇలా వాళ్ళను ఎప్పుడు చుసిన కొత్తగా అనిపిస్తుంది. బాలుగారు అంతే అయన ఎప్పుడు చుసిన కొత్తగానే కనిపిస్తారు. మా ఫ్యామిలీతో ఆయనకు చాలా అనుబంధం ఉండేది. గొప్ప గొప్ప వాళ్లలో ఓ చిన్నపిల్లాడు ఉంటాడు.. అది బాలుగారిలో చూసాను. ఆయన గ్రేట్ లెజెండరీ సింగర్. ఆయనతో పనిచేయడం గొప్ప అదృష్టాంగా భావిస్తున్నాను. అయనను నిజంగా మిస్ అవుతున్నాం. లవ్ యు బాలుగారు అన్నారు. హీరో నాని, హీరో శ్రీకాంత్, సురేష్ బాబు, భువనచంద్ర ఇలా పరిశ్రమకు సంబంధించి మరెందరో ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-