రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించింది: సురవరం

ప్రధాని నరేంద్రమోడీ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో దూకుడుగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసే విధంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారు. ఈ మూడు నల్ల చట్టాల ను రద్దు చేయాలని కోరుతూ.. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లోనే కొన్ని నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్న విషయం తెల్సిందే.. అయితే ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఆ వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ.. మోదీ ప్రకటించడంతో… ఈ దేశ రైతుల సుదీర్ఘ పోరాటం ఫలించిందని సీపీఐ సీనియర్‌ నాయకులు సురవరం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు శాంతి యుతంగా చేస్తున్న ఉద్యమాన్ని చెదరగొట్టేందుకు కేంద్రం ఎన్నో కుట్రలు చేసిందన్నారు. ఈ సందర్భంగా రైతుల పోరాటంలో 700 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.

ఇన్ని నెలలుగా రైతులపై కర్కశంగా వ్యవహరించినందుకు.. రైతులకు మోదీ క్షమాపణ చెబితే సరిపోదు… చనిపోయిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్టే… ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల ప్రైవైటీకరణను కూడా ఆపాలన్నారు. అలాగే కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, చమురు ధరలు కూడా తగ్గించాలని డిమాండ్‌ చేశారు. దేశానికి ప్రమాదంగా ఉన్న మతోన్మాదుల మూర్ఖపు దాడులను అదుపులో పెట్టాలని సురవరం సుధాకర్‌రెడ్డి సూచించారు.

Related Articles

Latest Articles