అప్ఘన్ తో కశ్మీర్ కు ముప్పు.. రష్యాకూ ప్రమాదమే?

ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను మాత్రమే ప్రకటించడం చూస్తుంటే ఇవన్నీ కూడా భారత్ కు రాబోయే రోజుల్లో ఇబ్బందులు కలిగించే అంశాలుగా మారబోతున్నాయి. ఉగ్రవాదంపై తొలి నుంచి పోరాడుతున్న భారత్ కు తాలిబన్లు కంట్లో నలుసుగా మారే అవకాశం ఉంది. దీంతో వీరి విషయంలో భారత్ ఎలాంటి వ్యూహాంతో ముందుకెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

భారత్ ఇటీవల తాలిబన్లతో చర్చలు జరిపిన సందర్భంలోనూ ఆఫ్ఘనిస్తాన్ భూభాగం భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగ పడకూడదని సూచించింది. అయితే ఆ చర్చలు జరిగిన కొద్దిసేపటికే ఒక తాలిబన్ నాయకుడు ముస్లింల హక్కుల కోసం కాశ్మీర్లో అయినా సరే తమ గళాన్ని వినిపిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం మరువకముందే తాజాగా రష్యా రాయబారి మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. దీంతో ఇరుదేశాలు ఆఫ్ఘన్ పరిణామాలపై చర్చించాల్సిన అవశ్యకత ఏర్పడింది.

ఆఫ్ఘన్లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ మరియు రష్యాకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. రష్యన్ భూభాగంతోపాటు కశ్మీర్‌ల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా ఈ పరిణామాలు ఉన్నాయి. దీంతో ఇరుదేశాలు అఫ్ఘన్లోని పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తో కలిసి ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడానికి రష్యా సిద్ధమమని సంకేతాలు పంపుతున్నారు. తాలిబన్లు కశ్మీర్ విషయంలో తలదుర్చేందుకు ప్రయత్నిస్తుండటంతో భారత్ కు కంటగింపుగా మారింది. అప్ఘన్ పరిణామాలు భారత్ కు వ్యతిరేకంగా మారుతుండటంతో భారత సర్కారు తదుపరి చర్చల్లో వీరితో తాడోపెడో తేల్చుకునేందుకు సిద్ధమవుతుందనే వాదనలు విన్పిస్తున్నాయి.

మరోవైపు రష్యా భూభాగంలోనూ తాలిబన్ల చర్యలు ఉగ్రవాదం పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో రష్యా సైతం తాలిబన్ల నుంచి తమకు ముప్పు రాకుండా చర్యలు తీసుకుంటోంది. కశ్మీర్, రష్యా భూభాగాల్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించేలా తాలిబన్లు వ్యవహారిస్తుండంతో వీరిని సమిష్టి ఎదుర్కోవాలని రష్యా, భారత్ భావిస్తున్నట్లు కన్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య చర్చలు సైతం నడుస్తాయి. అయితే అప్ఘన్ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇరుదేశాలు సైతం అక్కడి ప్రజల భద్రతను కోరుకుంటున్నాయి.

ఈక్రమంలోనే అప్ఘన్లో స్థిరత్వంతో కూడిన ప్రభుత్వం ఉంటే బాగుంటుదని భావిస్తున్నాయి. అయితే కాబూల్‌లో ప్రస్తుత కొత్త పాలనను గుర్తించడంపై ఇరుదేశాలు ఆసక్తి చూపడంలేదు. మరోవైపు ఆఫ్ఘన్ కేంద్రంగా ఉగ్రవాదం ఇరుదేశాల వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతుండటంతో భారత్, రష్యా అలర్ట్ అవుతున్నాయి. తమ భూభాగంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే చర్యలు చేస్తే మాత్రం ఎవరినీ వదిలే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఉగ్రవాదంపై రష్యా, భారత్ ఉమ్మడి పోరుకు సిద్ధమవుతుండటంతో తాలిబన్లు వెనక్కి తగ్గుతారా? లేదంటే కాలుదువ్వుతారా? అనేది సస్పెన్స్ గా మారింది.

Related Articles

Latest Articles

-Advertisement-