45 ఏళ్ళ ‘తూర్పు – పడమర’

(అక్టోబర్ 23న ‘తూర్పు-పడమర’ 45 ఏళ్ళు పూర్తి)
ఒకప్పుడు తెలుగునాట దాసరి నారాయణరావు, తమిళనాట కె.బాలచందర్ పబ్లిసిటీలో తమ పేర్లను మబ్బుల్లో వేసుకొనేవారు. వారిద్దరి చిత్రాల్లోనూ స్త్రీ పక్షపాతం కనిపించేది. తమిళంలో కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగల్’ ఆధారంగా తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘తూర్పు-పడమర’ చిత్రం రూపొందింది. దాసరిని దర్శకునిగా పరిచయం చేసిన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ ఈ ‘తూర్పు-పడమర’ను నిర్మించారు. తమిళంలో ప్రధాన పాత్ర పోషించిన శ్రీవిద్య ఇందులోనూ తన పాత్రలో తానే కనిపించారు. దాసరి తొలి చిత్రం ‘తాత-మనవడు’లో ఓ డాన్స్ ఐటమ్ లో శ్రీవిద్య నర్తించడం విశేషం. అందువల్లే తమిళంలో శ్రీవిద్యకు నటిగా ఎంతో పేరు సంపాదించి పెట్టిన ఈ చిత్రంలో ఆమె పాత్రకు మరొకరిని దాసరి ఎంపిక చేసుకోలేదు. 1976 అక్టోబర్ 23న ‘తూర్పు-పడమర’ తెలుగునాట విడుదలై విశేషాదరణ పొందింది.

విక్రమార్క-బేతాళ కథలు భారతదేశంలోని అన్ని భాషల్లో ఆబాలగోపాలాన్నీ అలరించాయి. అందులో బేతాళుడు విక్రమార్కునికి ఓ సమస్యాత్మక కథ చెప్పడం. ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏమిటో విక్రమార్కుని అడగడం చేస్తూంటాడు. ఆ కథకు పరిష్కారం తెలిసీ చెప్పక పోతే విక్రమార్కుని తల వేయి వక్కలవుతుందనీ శాపం పెడతాడు. ఏ కథకయితే విక్రమార్కునికి సమాధానం చెప్పక మౌనంగా ఉంటాడో, అప్పుడు బేతాళుడు అతనికి వశమవుతాడు. అలా ఓ కథ చెప్పి, అందులో ఇద్దరు తండ్రీకొడుకులు, తమకు కనిపించిన అడుగుల ప్రకారం పెద్ద అడుగుల ఆమెను తండ్రి పెళ్ళి చేసుకోవాలి. చిన్న అడుగులున్న ఆమెను తనయుడు పెళ్ళాడాలి. అలాగే జరుగుతుంది. ఆ ఇద్దరు పడతులు కూడా తల్లీకూతుళ్ళు. చిత్రమేమిటంటే, తండ్రి పెళ్ళాడినామె కూతురు. తనయుడు మనువాడిన ఆమె ఆ కూతురు తల్లి. మరి వారికి పిల్లలు పుడితే ఎవరు ఎవరికి ఏమవుతారు అన్నది బేతాళ ప్రశ్న. ఈ ప్రశ్నకు విక్రమార్కుడు తగిన సమాధానం తెలియక మౌనంగా ఉంటాడు. దాంతో బేతాళుడు అతని వశమవ్వడం అన్నది కథలో చూస్తాం. కానీ, అలాంటి పరిస్థితే ఓ తండ్రికి, ఆయన కొడుక్కు ఎదురవుతుంది. అదే ‘తూర్పు-పడమర’ కథ.

ఇందులో శివరంజని ప్రముఖ గాయని. ఆమె గానం, అందం ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆమెకు గాయాలతో రోడ్డుపై పడ్డ సూర్యం కనిపిస్తాడు. తీసుకువెళ్ళి చికిత్స చేయిస్తుంది. గాయాలు నయమయ్యే దాకా ఉండమంటుంది. ప్రతీ విషయంలోనూ వైవిధ్యంగా ఆలోచించే సూర్యం, శివరంజనిపై మనసు పారేసుకుంటాడు. శివరంజని కూతురు అనుకోని పరిస్థితుల్లో సూర్యం తండ్రి చెంత చేరుతుంది. ఆమె ఆ ముసలివాడిపై మనసు పడుతుంది. చివరకు అసలు విషయాలు ఆ తల్లికి, ఆ తండ్రికి తెలుస్తుంది. అప్పుడు వారు కూడా బేతాళ కథనే గుర్తు చేసుకుంటారు. ‘తూర్పు-పడమర… ఎదురెదురు… అవి ఎన్నటికీ కలవవు…’ అన్న సత్యం తెలుపుతూ శివరంజని తన కచేరీలో పాట పాడుతుంది. కూతురు కూడా వెళ్ళి తల్లి చెంత చేరుతుంది. తనయుడు వచ్చి, తండ్రి వద్ద కూర్చుంటాడు. అప్పుడే శివరంజనికి ఓ లేఖ అందుతుంది. ఆ లేఖ చూడగానే ఆమెకు తన భర్త గుర్తుకు వస్తాడు. కచేరీ కాగానే అతనికోసం వెతుకుతూ వెళ్తుంది. పూలమాలతో నించున్న భర్తను చూస్తుంది. చెంత చేరబోయే సరికే అతను శవమై ఉంటాడు. కూతురుతో కలసి శివరంజని తన ఇంటికి కారులో వెళ్తూ ఉంటుంది. వారికి తండ్రీకొడుకులు బై చెబుతూంటారు. సూర్యం మోటార్ బైక్ వేసుకు వచ్చి, “కారు డోర్ సరిగా వేసుకోండి” అని చెబుతాడు. శివరంజని కారు డోర్ వేసుకుంటుంది. ‘మీరు కారు తలుపు వేసుకున్నంత సులువుగా నేను మనసుకు తలుపు వేసుకోలేకపోతున్నాను’ అని చెబుతాడు. శివరంజని తనకు ఇచ్చిన తాళాలు ఆమెకు ఇస్తాడు. కారు బయలు దేరుతుంది. శివరంజని చేతిలో తాళాలు, లాకెట్ సూర్యం చేతిలో మిగులుతాయి. ఆ లాకెట్ లో సూర్యం, శివరంజని బొమ్మలు ఉంటాయి. రవి అస్తమిస్తున్న పడమర వైపు కారు దూసుకుపోతూండగా, కథ ముగుస్తుంది.

తమిళంలోని కథను యథాతథంగా తీసుకున్నారు. కాకపోతే, సన్నివేశాలను కాసింత మార్చి తనదైన మార్కు తగిలించి తెరకెక్కించారు దాసరి. తమిళంలో గాయనిగా నటించిన శ్రీవిద్య తెలుగులోనూ తన పాత్రలోనే అభినయించగా, అక్కడ కమల్ హాసన్ పోషించిన పాత్రను తెలుగులో నరసింహరాజు ధరించారు. తమిళంలో రజనీకాంత్ పాత్రను తెలుగులో మోహన్ బాబు పోషించారు. రజనీకాంత్ తొలిసారి తెరపై కనిపించిన చిత్రంగా ‘అపూర్వ రాగంగల్’ నిలచిపోయింది. ఒకరి పాత్రలు ఒకరు ధరించిన రజనీ, మోహన్ బాబు మంచి మిత్రులుగా ఈ నాటికీ కొనసాగుతూ ఉన్నారు. తమిళంలో జయసుధ పోషించిన పాత్రను తెలుగులో మాధవి ధరించారు. తమిళంలో గాయని ఫ్యామిలీ డాక్టర్ గా నటించిన నగేశ్ తెలుగులోనూ అదే పాత్రలో కనిపించారు. తమిళచిత్రానికి పాటలు రాసిన కన్నదాసన్ ఓ సీన్ లో కనిపించినట్టే, తెలుగులో పాటలు రాసిన సినారె ఓ సన్నివేశంలో కనిపించి, “ఎవరయ్య తెలుగువాడు…” అనే పద్యం చెప్పి ఆకట్టుకున్నారు. తమిళంలో ఓ సీన్ లో నటుడు జయశంకర్ కనిపించినట్టే, తెలుగులో మురళీమోహన్ కనిపించారు.

తమిళంలో నాలుగు పాటలు ఉంటాయి. తెలుగులో ఐదు పాటలు. తమిళ చిత్రానికి ఎమ్మెస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చగా, తెలుగు పాటలకు రమేశ్ నాయుడు తనదైన బాణీలు కట్టి అలరించారు. ముఖ్యంగా “శివరంజనీ నవరాగినీ…” పాట ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉంది. “స్వరములు ఏడైనా…రాగాలెన్నో…”, “తూర్పు పడమర ఎదురెదురు…”, “జతిస్వరమూ…”, “నవ్వుతారు…” వంటి పాటలు ఎంతగానో మురిపించాయి. తెలుగులో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. హిందీలో ఇదే కథను ‘ఏక్ నయీ పహేలీ’ పేరుతో రాజ్ కుమార్, కమల్ హాసన్, హేమామాలిని, పద్మినీ కొల్హాపురితో కె.బాలచందర్ రూపొందించారు. అయితే అక్కడ అంతగా ఆ సినిమా అలరించలేకపోయింది.

Related Articles

Latest Articles