నాగపూర్‌లోకి థర్డ్‌ వేవ్‌ ఎంటర్‌..

ఓ పక్క కేసులు తగ్గాయన్న సంతోషం… మరోవైపు థర్డ్‌ వేవ్‌ మొదలైందన్న ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం క్రాస్‌ రోడ్స్‌లో ఉన్నాం. దేశంలో కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గడం ఊరటనిస్తోంది. కొత్తగా 31వేల మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అవగా.. మరణాలు 300 దిగువకు తగ్గాయి. ఇక వరుసగా రెండో రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. అయితే ఇదే సమయంలో దేశంలో థర్డ్‌ వేవ్‌ పాదం మోపటం ఓ హెచ్చరిక లాంటిది. అదే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.

థర్డ్ వేవ్‌ నాగ్‌పూర్ ని తాకిందని మహారష్ట్ర మంత్రి స్వయంగా తెలిపారు. కరోనా ఇన్ఫెక్షన్లు నగరానికి చేరాయని , త్వరలో సిటీలో కోవిడ్‌ 19 నిబంధనలు తిరిగి అమలులోకి వస్తాయని రాష్ట్ర ఎనర్జీ మంత్రి నితిన్‌ రౌత్‌ చెప్పటం ప్రాధాన్యత సంతరించుకుంది. రెవెన్యూ, పోలీస్‌, హెల్త్‌ విభాగాలకు చెందిన సీనియర్‌ సీనియర్‌ అధికారులతో జరిగిన రివ్వూ మీటింగ్‌ అనంతరం మంత్రి ఈ విషయం చెప్పారు. అంటే అధికారులు ఇచ్చిన ఫీడ్‌ బ్యాక్‌తోనే ఈ ప్రకటన చేశారు. కాబట్టి దానిని అంత సులభంగా కొట్టిపారేయలేము. ఆదివారం పది కేసులు, సోమవారం 13 కేసులు నమోదు కావటాన్ని మంత్రి గుర్తుచేశారు. నగరంలోకి కోవిడ్‌ 19 అడుగుపెట్టిందనటానికి ఇదే నిదర్శనమన్నారాయన.

గత కొన్ని రోజుల నుంచి నిపుణులు కూడా థర్డ్ వేవ్‌ హెచ్చరికలు చేస్తున్నారు. సెప్టెంబర్‌లో మొదలై ఆక్టోబర్‌లో గరిష్టానికి చేరుతుందని అంచనా. మహారాష్ట్ర మంత్రి చెప్పిన దాని ప్రకారం థర్డ్‌ వేవ్‌ మొదలైందనే అనుకోవాల్సి వుంటుంది. అంటే ఇప్పుడు మనం థర్డ్ వేవ్‌లో ఉన్నట్టే లెక్క. ఆగస్టు నెలలోనాగపూర్‌ జిల్లాలో కొత్తగా 145 కేసులు రిజిస్టరయ్యాయి. ఇక ఈ నెలలో ఇప్పటి వరకు 42 మంది కోవిడ్‌ 19 బారినపడ్డారు. ఒకరు చనిపోయారు.

దేశ వ్యాప్తంగా 31 వేల 222 కొత్త కేసులు బయటపడ్డాయి. 290 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,41,042 మందిని మహమ్మారి బలితీసుకుంది. కేరళలోనూ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఆ రాష్ట్రంలో 19 వేల 688 కేసులు, 135 మరణాలు రిజిస్టరయ్యాయి. ఇక కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రియాశీల కేసుల సంఖ్య మరోసారి 4లక్షల దిగువకు పడిపోయింది.

మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నాన్‌ స్టాప్ గా నడుస్తోంది. సోమవారం కోటీ 13 లక్షల మందికి టీకాలు వేశారు. ఒక్క రోజులో కోటి మందికి పైగా డోస్‌ ఇవ్వటి ఇది రెండో సారి. ఇప్పటివరకు దాదాపు 70 కోట్ల డోసుల పంపిణీ జరిగింది.

దేశంలో ఆగస్టు నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం కానుందని.. అది క్రమంగా పెరుగుతూ అక్టోబరులో గరిష్ఠానికి చేరుకోవచ్చని ఇలీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌, కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ల స్టడీ ప్రకారం రెండో దశ కంటే దీని తీవ్రత తక్కువగానే ఉండొంచ్చు. మ్యాథమెటికల్ మోడల్ ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. మూడో దశ వ్యాప్తి పీక్‌లో ఉన్నప్పుడు రోజువారీ కేసుల సంఖ్య లక్షలోపు ఉంటుందని.. పరిస్థితులు మరింత దిగజారితే 1.5 లక్షలకూ చేరొచ్చని అంచనా .

ఈ ఏడాది ఏప్రిల్‌-మేలో కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ విధ్వంసం మొదలైంది. ఆసమయానికి దేశ రాజధాని ఢిల్లీ సహా దేశ వ్యప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సీజన్ కొరత నెలకొంది. ఫలితంగా వేలాది మంది ప్రాణాలు పోయాయి. కేవలం సెకండ్‌ వేవ్‌ కు ప్రిపేర్‌గా లేకపోవటమే ఆ చావులకు కారణమన్న విమర్శలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయంగా కూడా భారత్‌ ప్రతిష్ట దెబ్బతింది. ఇంటర్నేషనల్‌ మీడియా మోడీ సర్కార్ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. అయితే ఇప్పుడు అది పునరావృతం కాకుండా చూడటం అందరి బాధ్యత.

సెప్టెంబర్ నుంచి నవంబర్‌ వరకు పండగల సీజన్‌. అదే అందరినీ కలవరపెడుతోంది. కొత్త వేరియంట్లకు చాలా అవకాశం ఉంది. మరి ఆస్పత్రులు అందుకు సిద్ధంగా ఉన్నాయా? ముఖ్యంగా ప్రభుత్వ ఆస్పత్రుల సన్నధ్దత చాలా ముఖ్యం ఇప్పుడు. ప్రభుత్వ అధికారులు దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్‌ హాస్పటల్స్‌ కూడా ఈ క్లిష్ట సమయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. బెడ్స్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆక్సీజన్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. గత కొన్ని నెలల్లో దేశవ్యాప్తగా ఆక్సిజన్‌ అందుబాటు పెరిగినట్టు సమాచారం. 100గా ఉన్న ఆక్సీజన్‌ కెరీర్ల సంఖ్య ఇప్పుడు 1, 250కి పెరిగింది. లిండే వంటి కంపెనీలు గ్యాస్‌ ఉత్పత్తి ని 50 శాతం పెంచాయి. దీని వల్ల రోజుకు 15 వేల టన్నుల ఆక్సీజన్‌ అందుబాటులోకి వస్తుంది.

కొత్త మ్యుటేషన్ల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉండొచ్చంటున్న నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆస్పత్రులు సన్నద్ధమవుతున్నాయి. అన్ని రష్ట్రాలు ప్రత్యేక పేడియాట్రిక్‌ వార్డులను రెడీ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ముందస్తుగా రెమిడిస్‌విర్‌ వంటి యాంటీ వైరస్‌ మెడిసిన్స్‌ స్టాక్‌ పెట్టుకుంటున్నాయి.

మరోవైపు, దేశంలో మూడింట రెండు వంతుల మందిలో కోవిడ్‌ని ఎదిరించే యాంటీబాడీస్‌ అభివృద్ధి అయ్యాయని ప్రభుత్వ నివేదికలు అంటున్నాయి. 40 ఏళ్లు పైబడిన వారిలో ఇప్పటి వరకు కనీసం 57 శాతం మంది ఒక్క డోసు వ్యాక్సిన్‌ అయినా తీసుకుని ఉన్నారు. అందుకే సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌ వేవ్‌ ప్రభావం తక్కువగా ఉండొచ్చన్న నిర్ధారణకు వచ్చారు వైరాలజిస్టులు. అయితే ఎవరెన్ని చెప్పినా కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉంటేనే ఈ గండం నుంచి గట్టెక్కగలం!!

Related Articles

Latest Articles

-Advertisement-