సంక్రాంతికి సినీ సందడి దూరం!

సంక్రాంతికి కొత్త సినిమాలు సందడి చేస్తాయని తెలుగు ప్రేక్షకులు ఆశించారు. కానీ కరోనా ఆ అవకాశం ఇవ్వలేదు. ఆర్ ఆర్ ఆర్, రాధేశ్యామ్‌ విడుదల వాయిదా పడింది. ఇక, థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఇండస్ట్రీకి మరో దెబ్బ. ఇబ్బందనిపిస్తే విడుదల వాయిదా వేసుకోవచ్చని మంత్రి గారే స్వయంగా సెలవిచ్చారు. టికెట్ల ధరలపై దర్శకుడు ఆర్జీవీతో సమావేశం తరువాత మంత్రి పేర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు, టికెట్ల ధరల వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన కమిటీ మరోసారి భేటీ అయింది. పలు ప్రతిపాదనలు కమిటీ ముందుకు వచ్చాయి. బి,సి సెంటర్లలో ధరల మార్పు, థియేటర్లలో వసతులు వంటి అంశాలపై చర్చించారు. మరోసారి భేటీ అనంతరం కమిటీ సిఫార్సులను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పిస్తుంది. దాని ఆధారంగా తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. అప్పటి వరకు ఎదురు చూడటం మినహా ఎవరూ చేసేదేమీ లేదు.

మరోవైపు ఈ వ్యవహారంపై మాటల యుద్ధం.. ట్వీట్ల వార్‌ కొనసాగుతోంది. పేర్ని నానిని కలిసిన తరువాత కూడా ఆర్జీవీ తన ట్వీట్ల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇక, అధికార పార్టీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సోమవారం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. తెలంగాణలో ఉండి సినిమాలు తీస్తున్న హీరోలు కోట్లు సంపాదిస్తున్నారని ఓ ఎమ్మెల్యే అనటం ఆశ్చర్యమే. ఏపీకి ఒక సీఎం ఉన్నారనే సంగతి గుర్తుందా అని ఆయన పరిశ్రమను నిలదీశారు. ఇదంతా చూస్తే టికెట్‌ ధరల వెనక ఇంకేదో విషయం ఉందనిపిస్తుంది. సినిమా హీరోలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని అనటం ప్రభుత్వ ఉద్దేశాలను బయటపెడుతోంది.

నిజానికి, కొద్ది రోజులుగా సాగుతున్న ఈ మోత్తం వ్యవహారాన్ని గమనిస్తే..దీని అసలు ఉద్దేశాలు వేరు అనిపిస్తోంది. సమస్య టికెట్ల ధరలేనా.. లేదంటే ఇంకేదైనా ఉందా అనే అనుమానం కలుగుతోంది. నల్లపరెడ్డి వ్యాఖ్యలతో కొంత క్లారిటీ వచ్చింది. నిజానికి, సినీ పరిశ్రమతో టీడీపీ స్థాయిలో వైసీపీకి సంబంధాలు లేవు. ఇది నిజం. దానికి కారణం టీడీపీ పుట్టిందే సీనీ పరిశ్రమ నుంచి కావటం. హీరో బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులు ఆ పార్టీలో క్రియాశీలంగా పనిచేశారు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కాబట్టి టీడీపీతో సినీ పరిశ్రమ సన్నిహితంగా ఉండటం సహజం. తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. ఎంజీ రామచంద్రన్‌, కరుణానిధి, జయలలిత సీఎంలుగా పనిచేశారు. అలాంటప్పుడు సినీ పరిశ్రమతో సంబంధాలు సహజం. చిరంజీవి ప్రజారాజ్యం, పవన్‌ జనసేన కూడా అంతే. కాబట్టి, వాటిలా వైసీపీకి సినీ పరిశ్రమతో అంతగా సంబంధాలు లేవు. అదంతా పక్కన పెడితే, జగన్‌ తొలిసారి సీఎం అయిన తరువాత తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను సన్మానించటం కనీస బాధ్యత. కానీ పరిశ్రమ పెద్దలు ఆ పనిచేయలేదు. కనీసం అటువైపు తొంగి చూడలేదు. కాబట్టి, ఇది ప్రభుత్వం…పరిశ్రమ మధ్య ఈగో పంచాయితీలా అనిపిస్తోంది.

సర్కార్ నిర్ణయం వెనక పరిశ్రమను తెలంగాణ నుంచి ఏపీకి తరలించే కోణం కూడా ఉండే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ ఏపీకి రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఇలా అది సాధ్యమా? గతంలో మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు పరిశ్రమ తరలి రావాలని నాటి కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు అనేక రాయితీలు కల్పించిన సంగతి తెలిసిందే.

ప్రభుత్వం వైపు నుంచి చూసినపుడు టికెట్ల ధరలు తగ్గిస్తే పేదలకు మేలు జరుగుతుంది. దాంతో వారికి సర్కార్‌ దగ్గరవుతుంది. ప్రభుత్వానికి ఇలాంటి ఉద్దేశం ఉన్నా ఉండొచ్చు. వందలు వందలు పెట్టి సినిమా చూడటం పేదవాడికి భారమే. ఎవరూ కాదనలేరు. కానీ పేదవాడికి భారమైనవి చాలా ఉన్నాయి.. వాటి పట్ల కూడా సర్కార్‌ ఇలాగే వ్యవహరిస్తుందా అనే ప్రశ్న వస్తుంది.

మరోవైపు, కొంత మంది హీరోలను టార్గెట్‌ చేసి టికెట్‌ ధర తగ్గించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నలుగురు సినిమా హీరోలు ఇండస్ట్రీ కలెక్షన్స్‌ మొత్తం తన్నుకుపోతున్నారు. వారికోసం ప్రేక్షకులు ఎందుకు ఇబ్బంది పడాలని గతంలో వైసీపీ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కొందరిపై కోపంతో పరిశ్రమ మొత్తం ఎఫెక్టయ్యే నిర్ణయాలు ఏ ప్రభుత్వమూ తీసుకోదు.

ఏదేమైనా సినిమా టికెట్‌ ధరలు తగ్గించటం హర్షణీయం కాదనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది.మార్కెట్లో దొరికే అన్ని వస్తువుల వంటిదే సినిమా కూడా. సినిమాను ఒక వస్తువుగా చూసినపుడు దానిని ధర నిర్ణయించే హక్కు తయారీదారునికి ఉంటుంది. సినిమా మేకింగ్ ఖర్చును బట్టి దాని ధర నిర్ణయించే అవకాశం వారికి ఉంటుంది. ఆ పని కూడా ప్రభుత్వమే చేస్తానంటే సాధ్యం కాకపోవచ్చు. అన్నిటికి ఒకే ధర అనటం.. సినిమా పరిశ్రమ తిరోగమనం వైపు నడిపించే నిర్ణయం. ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను సినిమాను ఒకే గాడిన కట్టటం ఎంతవరు సబబు?

మార్కెట్లోకి వచ్చే ప్రతి వస్తువు ధరను నిర్ణయించటం ఏ ప్రభుత్వానికీ సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వాలు వాటిని మార్కెట్‌కే వదిలేస్తాయి. సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలి..హీరోకు ఎంత ఇవ్వాలని అనేది ఆ ప్రాజెక్టును బట్టి ఉంటుంది. కానీ ప్రభుత్వం నిర్ణయించినట్టు ఉండదు. మార్కెట్‌ ఉత్పత్తులు..సేవలను ప్రభుత్వం నియంత్రించలేదు. ఒక వేళ పేద ప్రజల కోసం అలా చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి ఉంటే.. సినిమా టిక్కెట్ల కన్నా ముందు స్కూలు ఫీజులు, ఆస్పత్రి ఛార్జీలు..రవాణా ఛార్జీలను నియంత్రించాల్సి వుంటుంది. ఎందుకంటే పేదవాడికి సినిమా కన్నా ఇవి చాలా ముఖ్యం. వీటి ధరలను నియంత్రించకుండా సినిమా టిక్కెట్ల మీద ఎందుకు పడ్డారన్నదే సామాన్యుడు అడుగుతున్న ప్రశ్న.

ఐతే, ప్రజల బలహీనతలను ఆసరగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు టికెట్‌ ధరలు పెంచితే కుదరదు. కొనుక్కునే వాడు ఉన్నాడు కదా అని రూ. 100 టిక్కెట్‌ రూ.1000 కి అమ్ముతానంటే కూడా కుదరదు. ఏ ధర నిర్ణయించినా అది సహేతుకంగా ఉండాలి. అలా లేనపుడు ప్రభుత్వాలు తప్పకుండా కల్పించుకోవాల్సిందే. అలాగే, బ్లాక్‌ మార్కెటింగ్‌ని కూడా అరికట్టాల్సిందే. సినిమా థియేటర్లలో సౌకర్యాలు..మెయింటెనెన్స్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాల్సిందే. కానీ టిక్కెట్ల ధరల విషయంలో పరిశ్రమ వాదనలను ప్రభుత్వం పాజిటివ్ తీసుకుంటే మంచిందేమో!!

Related Articles

Latest Articles